- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యవస్థను ప్రశ్నించిన సామాన్యుడు!
ఏదైనా సినిమా చూస్తే ఆనందం కలగాలి. మానసికోల్లాసం పొందాలి. అది కాకపోతే ఆ సినిమా నుంచి కాస్త మంచిని నేర్చుకోవాలి. లేదంటే చరిత్ర అవలోకం కావాలి. రెండున్నర గంటల సమయం వృధా కాకుండా కొంచెమైనా నాలెడ్జ్ ని ప్రసాదించాలి.. ఇవేవీ లేకుంటే సమయం వృధా చేసినట్లే. సినిమా ప్రశ్నించడాన్ని నేర్పిస్తే, సమాజంలోని కుళ్లుని నిలదీసేందుకు మార్గాన్ని చూపిస్తే ఇంకెంతో బాగుంటుంది. ఐతే అది తెలుగు సినిమాల్లో ఉంటుందా అంటే వెతకాల్సిందే.
ఆలోచింపజేసేలా సినిమాలు..
నేటి చాలా సినిమాలు ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేందుకు వీలు కావడం లేదు. విశృంఖలత్వం, సెక్స్, అబ్యూజ్డ్ లాంగ్వేజ్‌తో కూడి ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి చూడడం కష్టమైపోతున్నది. కానీ కొన్ని మలయాళం సినిమాలు మాత్రం ఆలోచింపజేస్తున్నాయి. అలాగే మమ్మూట్టీ, రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, ఎన్టీఆర్, రానా, చరణ్ వంటి వారు నటించిన సినిమాలే చూడాలని లేదు. రూ.వందల కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమాలే జనాదరణకు నోచుకుంటాయని లేదు. తెలుగులో ఎర్రమల్లెలు, ఎర్రసైన్యం వంటి విప్లవ సినిమాలు లేకపోలేదు. కానీ ఇప్పుడలాంటి సినిమాలు తీస్తే పది రోజులు కూడా ఆడని పరిస్థితి. అదే మలయాళంలో మాత్రం చిన్న చిన్న నటులు, పెద్దగా గుర్తింపు లేని నటుల సినిమాలు సమాజాన్ని మేల్కొల్పుతున్నాయి.
నేను థియేటర్‌కి వెళ్లి సినిమా చూడక నాలుగేండ్లు అవుతుంది. అలా అని సినిమాలే చూడనని కాదు. ఓటీటీ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్‌కి వెళ్లేంత అవసరం పడలేదు. ఐతే నిన్ననే యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే ఓ మలయాళం డబ్బింగ్ సినిమా కనబడింది. ఏదో కోర్టు, కామెడీ అని థంబ్ నెయిల్‌లో కనిపిస్తే ఓపెన్ చేశాను. పేర్ల దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కదలకుండా చేసింది. అంటే ఆ సబ్జెక్ట్ నచ్చింది కావచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. కానీ దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడుపుతున్న ఓ సామాన్యుడి పోరాటమే ఆ సినిమా కథ. ఈ మధ్య చాలా ఫేమస్‌గా చెప్పుకుంటున్న నటుడు కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా. (Nna Thaan Case Kodu) ఎందుకో ఆ సినిమా స్టోరీ చెప్పాలనిపించింది. తెలుగులో అలాంటి కథలతో సినిమాలు తీసినా నడుస్తాయి. కానీ ఎవరూ ఆ ధైర్యం చేయడం లేదనిపించింది.
ఉత్త కేసు పెట్టి
సినిమాలో పాత్రల పేర్లు గుర్తుకు లేవు. వాటిని పట్టించుకోలేదు. కానీ స్టోరీ మాత్రం నాకు నచ్చింది. ఓ రోజు మన హీరో ఓ టెంపుల్‌లో భజన కార్యక్రమానికి వెళ్లి చీకటి పడిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఓ గోడ దగ్గర టాయిలెట్ చేస్తుంటాడు. ఇంతలో ఓ ఆటో వేగంగా తన దగ్గరికే వస్తుంది. తప్పించుకోవడానికి అదే ప్రహరీ ఎక్కి లోపలికి దూకేస్తాడు. వెంటనే ఆ ఇంట్లోని రెండు కుక్కలు వెంట పడతాయి. బాగా కరుస్తాయి. ఇంతలో ఆ ఇంట్లో వాళ్లంతా లేచి వచ్చి ఇతను దొంగ అని భావించి బాగా కొడతారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు కూడా వెంటనే వచ్చేస్తారు. దొంగగా భావించి స్టేషన్ కి తీసుకెళ్తారు. ఏమేం వస్తువులు పోయాయో కంప్లెయింట్ ఇవ్వమని ఎమ్మెల్యే భార్యని అడిగితే అలాంటిదేం లేదని చెప్తుంది. ఎందుకు గోడ దూకావని పోలీసులు ప్రశ్నిస్తే ఆటో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి చెప్తాడు. ఆ రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందంటాడు. కోర్టులో కేసు నడుస్తుంది. ఇతను చెప్పిన విషయాన్ని ఎంతకీ నమ్మరు. సీసీ పుటేజీని చూసిన తర్వాత నమ్ముతారు. ఆ ఆటో నడిపిన వ్యక్తిని తీసుకురావాలని బాధితుడినే అడుగుతారు. అతడ్ని వెతికి అతి కష్టమ్మీద కోర్టులో హాజరు పరుస్తాడు. అతను చెప్పిందంతా నిజమేనని, తన ఆటో అతడి మీదికి వస్తుంటే గోడ ఎక్కి దూకాడని చెప్తాడు. ఐతే ఎందుకు అతడి మీదికి ఆటోని తీసుకొచ్చావని లాయర్ ప్రశ్నిస్తాడు. వెనుక నుంచి ఓ పాల వ్యాన్ ఢీ కొట్టడంతోనే నా ఆటో రూట్ తప్పిందని వివరిస్తాడు. అక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉండడం వల్లే అదుపు తప్పిందంటాడు. ఐతే ఆ పాల వ్యాన్ డ్రైవర్‌ని పట్టుకురావాలని కోర్టు ఆదేశిస్తుంది. మళ్లీ హీరో అతడ్ని వెతికి పట్టుకొచ్చి కోర్టులో హాజరు పరుస్తాడు. అతను కూడా అదంతా నిజమేనని ఒప్పుకుంటాడు. అక్కడ గుంతలు ఉన్నాయని, ఓ వ్యక్తి గాయపడి రోడ్డు పక్కన పడి ఉండడంతో తప్పించే ప్రయత్నంలో ఆటోని గుద్దాల్సి వచ్చిందంటాడు. ఐతే తప్పెవరిదని జడ్జి అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భార్య తన ఇంట్లో సూట్ కేసు పోయిందని, అందులో రూ.లక్ష నగదు, విలువైన ఫైళ్లు పోయాయని పోలీసులకు చెప్తుంది. దాంతో హీరోపై దొంగ అనే ముద్ర పడుతుంది. ఇదంతా మీడియాలోనూ వస్తుంది. ఈ క్రమంలో అతడికి ఎవరూ పని ఇచ్చేందుకు ఇష్టపడరు. పైగా అనుమానిస్తుంటారు. అవమానిస్తుంటారు. మానసికంగా కృంగిపోతాడు. భార్య, ఓ ఇద్దరు స్నేహితులు మాత్రమే సహకరిస్తుంటారు.
మంత్రిదే బాధ్యత
ఈ కేసులో గుంతలు పడడం వల్లే ఇదంతా జరిగిందని, అందుకు ఆ శాఖ మంత్రిదే బాధ్యత అని హీరో కోర్టులో వాదిస్తాడు. మరి ఆయన మీద ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా అని జడ్జి అడుగుతాడు. ఐతే తానే మంత్రిపై ఫిర్యాదు చేస్తానంటాడు. సదరు మంత్రిపై కేసు నమోదవుతుంది. ఇక కేసు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఆ మంత్రిని అరెస్ట్, కేసు అంటే రాజ్యాంగపరమైన అనుమతులు కావాలని జడ్జి అడుగుతారు. హీరోకు తన పరిచయాలు, విన్నపాల ద్వారా అనుమతి లభిస్తుంది. ఇక అల్లర్లు, బంద్‌లు జరుగుతాయి. హీరోపై పార్టీ కార్యకర్తల ఒత్తిడి పెరుగుతుంది. పలు దఫాలుగా కోర్టులో వాదనలు జరుగుతాయి. ఆఖరికి మంత్రిని ప్రభుత్వం నుంచి తప్పిస్తారు. కోర్టుకు కూడా హాజరైన తర్వాత కాంట్రాక్టర్‌దే తప్పంతా అన్న వాదన నడుస్తుంది. అతడ్ని కూడా కోర్టులో హాజరవుతాడు. నాదేం తప్పు లేదని, అంతా మంత్రి చెప్పినట్లే చేశానంటాడు. కాంట్రాక్ట్‌లో మెయింటెనెన్స్ చేసే పని లేకుండా తొలగించడం వల్లే కాంట్రాక్టర్లు గుంతలను పూడ్చలేదని తేలుస్తారు. ఇలా ఒకటీ రెండు కాదు.. రూ.కోట్ల విలువైన రోడ్డు పనుల్లో మెయింటెనెన్స్ అనే పదమే లేకుండా చేయడం ద్వారా మంత్రి లబ్ధి పొందారని నిర్దారణకు వస్తారు. ఇంతలో మంత్రి తరఫున అడ్వకేట్ హీరో దొంగ అని, గతంలో అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు రుజువు చేస్తాడు. అలాంటి వ్యక్తి ఫిర్యాదు ద్వారా మంత్రిని శిక్షించడం తగదంటాడు. తాను దొంగతనాలు మానేసి మూడేండ్లయ్యిందని, కూలీ పని చేసుకొని బతుకుతున్నానని చెప్తాడు. అనేక మలుపుల ద్వారా రోడ్డు పనిలో మెయింటెనెన్స్ వర్క్‌ని జత చేయకపోవడం ద్వారా ఎన్ని రూ.కోట్లు కొల్లగొట్టారో విచారణలో తేలుతుంది.
కథలో సహజత్వం
అయితే ఈ సినిమాలో ప్రస్తావించిన అంశాలు ప్రతి రోజూ సమాజం చూస్తున్నవే. ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నది.. ఎదుర్కొన్నదే కథాంశంగా రావడం ద్వారా సినిమా సక్సెస్ అవుతుంది. సినిమా కథ ప్రస్తుత అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నట్లేం కాదు. లోకం తీరును చూపిస్తున్నట్లుగా భావిస్తారో లేదోనన్న భయం ఉండొచ్చు. కానీ తెలుగులోనూ ఇలాంటి కథలతో సినిమా రావాలని కోరుకుంటున్నాను. బలగం, రంగమార్తాండ వంటి సినిమాలు హిట్ కావడానికి సహజసిద్ధమైన కథాంశాలే. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను. అతను కూడా సినిమా డైరెక్టరే. ఏం తీస్తున్నావని అడిగాను.. లేట్ మ్యారేజెస్ అంశాన్ని తీసుకొని సినిమా మొదలుపెట్టానన్నాడు. మరో ఫ్రెండ్ కి ఫోన్ చేశాను. అతను అనారోగ్యానికి గురైన తన తల్లిని కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాన్ని సైన్స్ తో ముడి పెట్టి తీస్తున్నానని చెప్పాడు. ఈ రెండు సినిమాల కోసం ఎదురుచూస్తున్నాను.
శిరందాస్ ప్రవీణ్ కుమార్
80966 77450