- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అజ్ఞాత దాత నిజాం వెంకన్న
సుప్రసిద్ధ సాహితీవేత్త, రచయిత, పుస్తక ప్రచురణకర్త, సామాజిక కార్యకర్త, పెద్దలు, ఆప్త మిత్రులు అయిన నిజాం వెంకటేశంగారి ఆకస్మిక మరణం జీర్ణించుకోలేనిది. బాధాకరమైనది. ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడం వల్ల మరణించారని, ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ నివాళుల వల్ల తెలిసింది. అదే రోజు రాత్రి తొమ్మిదిన్నరకు రాజమహేంద్రవరం రైల్వే స్టేషనులో సికింద్రాబాద్ రావడానికి రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్న నాకు జర్నలిస్ట్, కవి, కథారచయిత దేశరాజుగారు ఫోన్ చేసి చెప్పారు. మొదట నమ్మకం కలుగలేదు. నాలుగు రోజుల క్రితమే సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో ఉన్న వెంకన్న ఇంటికి వెళ్లి పరామర్శ చేసాను. అప్పటికే వారి తల్లిగారు మరణించి పదిహేను రోజులు అయింది. 'నాలుగు తరాలవారు కలిసి ఉంటున్న ఇల్లు, నిజాం వెంకన్న ఇల్లు' అని నేను గొప్పగా రాసాను. ఇలా అకస్మాత్తుగా మొదటి రెండు తరాల వారు వెళ్లిపోతారని ఊహించలేదు. వారి అమ్మ సత్తెమ్మ గారంటే వృద్ధాప్యంలో సహజ మరణం చెందారు. ఆ అమ్మ కొడుకు వెంకన్న ఇంకా చాలా కాలం బ్రతకవలసిన వాడు, ఎందరికో ఇంకా తన ప్రేమాభిమానాలను పంచవలసినవాడు. అమ్మ సత్తెమ్మ మరణించిన పద్దెనిమిది రోజుల తరువాత, కొడుకు వెంకన్న మరణించాడు. చాలా బాధాకరమైన విషయం.
మనసు బాధ పెట్టుకుని
నాలుగు రోజుల క్రితం నేను వెంకన్నను కలిసినప్పుడు నాతో ఇలా అన్నాడు. అప్పటికి అమ్మ సత్తెమ్మ దశదిన కర్మ పూర్తి అయి, హైదరాబాదులోనే ఉంటున్న తన కూతురు ఇంటికి 'నిద్రకు' వెళ్లివచ్చారు. అలసటతో కనిపించారు. 'శరీరం అంతా కొట్టి పడేసినట్టు, నొప్పులతో ఉంది. అమ్మ దాదాపు నిండా నూరేండ్లు బ్రతికి తనువు చాలించింది. బాధ పడకూడదని నాకు నేను ఎంత సమాధానం చెప్పుకున్నా, మనసులో బాధ సుడులు తిరుగుతూనే ఉన్నది. ఎందరికో ఇటువంటి బాధాకరమైన సందర్భాలలో, ఎన్నో ధైర్యవచనాలు చెప్పాను కానీ, అదెంత వేదనకు గురిచేస్తదో ఇప్పుడు అర్థం అవుతున్నది. నా చిన్నప్పుడే మా నాన్న మరణించాడు. అన్నీ అమ్మే అయి, నన్ను చెల్లెను పెంచింది. నాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, రెండు ఇండ్లను అమ్ముతుంటే, అమ్మ ఏమీ అనకుండా సంతకాలు పెట్టింది. నా కొడుక్కంటే నాకేదీ ఎక్కువ కాదు అన్నది. నా కోసం, మా ఇంటికి వచ్చిన వారికి విసుక్కోకుండా భోజనాలు పెట్టింది. కుటుంబ విషయాలలో, నా జీవితం అంతా అమ్మను సంప్రదిస్తూ వస్తున్నాను. ఇప్పుడు అకస్మాత్తుగా నా వెన్నుదన్ను కూలిపోయినట్టు ఉంది' అన్నాడు. అమ్మ మరణించిన దుఃఖం, వెంకన్న మనసు మీద ఒత్తిడి కలిగించింది. నేను వెళ్లిన కాసేపటి తరువాత వెంకన్న మిత్రులు ఇద్దరు జి. గంగాధర్, అనంతరాములు గార్లు కూడా కామారెడ్డి జిల్లా నుండి పరామర్శ చెయ్యడానికి వచ్చారు. నేను మా బాపు మరణించిన తరువాత నా అనుభవంలోకి వచ్చిన భావనలను వెంకన్నతో షేర్ చేసుకున్నాను. 'అమ్మ నాన్న ఉన్నంత కాలం మనం చిన్న పిల్లలమే! మన ముందు ఏవో రక్షణ గోడలు ఉన్నాయని మన మనసులో ఏదో ధైర్యం ఉంటుంది. వాళ్లు వెళ్లిపోయిన తరువాత మనం ఒంటరివాళ్లం అయినట్టు వుంటుంది. ఇక మనమే జీవన యుద్ధరంగంలో ఒంటరిగా మృత్యు ఫిరంగి దాడులకు ఎదురుగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మానాన్న వెళ్లిపోయిన తరువాత, మనం నిజంగా అనాథలం అవుతాం. మనలను మనమే కూడదీసుకుని, మన వెనుక మన పిల్లలు ఉన్నారని మళ్లీ ధైర్యం తెచ్చుకుని, జీవితంతో పోరాడవలసి ఉంటుంది అని!' ఎంతో జీవితానుభవం ఉన్న, మరెంతో సాహిత్య పఠనం చేసిన వెంకన్నకు అవి తెలియవని కాదు, సందర్భం వచ్చిందని వెంకన్నతో షేర్ చేసుకున్నాను.
ఆ భరోసా కూలిపోయింది
ఈ హైదరాబాదు మహానగరంలో నాకు నిజాం వెంకన్న కూడా ఉన్నాడు అనే భరోసా ఎక్కడో నా అంతరాంతరాలలో ఉండేది. ఈ నలబై సంవత్సరాలుగా, మరీ గత అయిదారు సంవత్సరాలుగా మరింత సన్నిహితమై అదంతా వెంకన్న సహృదయత వల్ల, నాలో గూడుకట్టుకున్న భావన! అదిప్పుడు కూలిపోయింది. నేను వెంకన్నను కలిసి తిరిగి వస్తున్నప్పుడు, నాకు రెండు ఇంగ్లిషు పుస్తకాలు చూపించారు. నాకు ఇవ్వడానికి కొన్నాడట! అవి రెండు కూడా కుక్కల గురించి రాసిన పుస్తకాలని చెప్పాడు. నేను రాసిన 'గూఫీ' (ది డాగ్) అనే పుస్తకం వెంకన్నకు ఇష్టమైన పుస్తకం. నాకు ఇంగ్లిషు రాదు కద అంటే, తానే వాటిని చదివి, వాటి సారాంశాన్ని నాకు చెప్తానని అన్నాడు. మరెన్నటికీ చెప్పలేనంత దూరం వెళ్లిపోయాడు. 1983లో అయుండాలి, కరీంనగర్ బుక్ ట్రస్ట్ తరఫున వారు ముఖ్య బాధ్యత వహిస్తూ 'బొగ్గుపొరల్లో ' అనే కథాసంకలనాన్ని ప్రచురించే పనిలో, నాకు కరీంనగర్‌లో వెంకన్న పరిచయం అయ్యాడు. అప్పటి నుండి మధ్య మధ్య గ్యాప్‌లు వచ్చినా, నన్ను కూడా తన పెద్ద మిత్రబృందంలో కలుపుకుంటూ వస్తున్నాడు. సమకాలీన సాహిత్య ప్రపంచంలో ఆయన గొప్ప కలుపుగోలు మనిషి. ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలకు, రచయితలకు కవులకు సహాయాలు చేసాడు. వాటిని ఎక్కడా చెప్పుకోలేదు. కరీంనగర్ నుండి హైదరాబాదు వరకు ,ఆయన సాహిత్య సామాజిక జీవన క్షేత్రం!
రాయగలిగి ఉండి కూడా
వెంకన్న స్వయంగా రాయగలిగి ఉండి కూడా ఎక్కువగా రాయలేదు. తనకు నచ్చిన సాహిత్యంతో మమేకమయ్యాడు. వాటినే ప్రచురించాడు, పంచాడు. వెంకన్న ఎన్నో ఇతర రచయితల పుస్తకాలను ప్రచురించాడు. ప్రచురణకర్తగా కూడా ఎక్కడా తన పేరు లేకుండా జాగ్రత్త పడ్డాడు. వెంకన్నకు కీర్తికాంక్ష లేదు. నేను ఆయనను చూస్తూ, నన్ను నేను వదిలేసుకోవడం నేర్చుకున్నాను. వెంకన్న కొన్నిసార్లు నారపల్లెలోని మా ఇంటికి వచ్చాడు. సుప్రసిద్ద కథా నవలా రచయిత కీర్తిశేషులు కొడవటిగంటి కుటుంబరావుగారి మిసెస్ వరూధిని గారిని చూడాలని ఉంది అంటే, తన కార్‌లో హైదరాబాద్ లోని, తెల్లాపూర్ తీసుకుని పోయి చూపించాడు. వెంకన్నకు సాహిత్యంలో వస్తువు పట్ల ఎంతటి పట్టింపొ, దాన్ని కళాత్మకంగా రాయడం పట్ల కూడా అంత పట్టింపు ! వెంకన్న నేను ఎప్పుడు కలుసుకున్నా, తన ఆటోబయోగ్రఫీ రాయమని అడిగేవాన్ని. వెంకన్న మిత్రులు అందరూ కలసి దాన్ని రాసి ప్రచురించాలని నా మనవి! వెంకన్న మిసెస్ మాధవిగారు, కొడుకు ప్రశాంత్, కోడలు సంధ్య గార్లకు, మనవడు ఆదిత్యకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. వారు ధైర్యంగా ఉండాలి.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి
90001 84107