- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్త్రీ తలాక్ కష్టాలు చూపే 'నిఖా'
తలాక్.. తలాక్.. తలాక్.. ఈ మూడు పదాలు మగవాడు భార్యతో అంటే వాళ్ళ పెళ్ళి ఇక అప్పటి నుండి చెల్లదు అనే షరియత్ నియమాల మీద ఉర్దూ భాషలో వచ్చిన ఆలోచనాత్మక చిత్రం ‘నిఖా’. ఈ సినిమాలో స్త్రీ కోణం నుండి ట్రిపుల్ తలాక్‌ని, దాని వలన స్త్రీలు తమ జీవితాలలో ఎదుర్కునే సంక్షోభాన్ని దర్శకులు చూపించే ప్రయత్నం చేశారు. ఇస్లాం మతాచారాల ప్రకారం పురుషుడు మూడు సార్లు తలాక్.. అని చెప్పి భార్యను వదిలేయవచ్చు.
భార్యా భర్తలిద్దరి గొడవలు
తలాక్ అనే తొందరపాటు వ్యవహారంతో స్త్రీ జీవితం ఎంతలా అతలాకుతలం అవుతుందో, మానసికంగా మరో భర్తతో జీవించడం కోసం ఆమె ఎంతగా వేదనను అనుభవించవలసి వస్తుందో వివరించి చెప్పే చిత్రం ‘నిఖా’. ఈ సినిమాను పూర్తిగా హైదరాబాద్ నగరంలో తీసారు. కథలోకి వెళ్తే, హైదర్, నీలోఫర్ ఇద్దరూ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్లు. నీలోఫర్‌ని హైదర్ ప్రేమిస్తాడు. కానీ ఆమె వివాహం వారి కుటుంబానికి సన్నిహితులయిన ఓ నవాబ్ కుటుంబం లోని వసీం అనే యువకుడితో నిశ్చయమవుతుంది. వసీం విదేశాలలో చదువుకుని వస్తాడు. హైదరాబాద్ రాగానే ఇద్దరి వివాహం పెద్దలు జరిపిస్తారు. వసీం వ్యాపారంలో అప్పుడే ప్రవేశిస్తాడు. జీవితంలో ఎంతో సంపాదించాలనే తపన అతనికి. అందుకని భార్యను పెళ్ళైన రోజు నుండి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. భర్తతో కాసేపు గడపాలనుకునే నీలోఫర్ కోరిక ఎప్పుడూ తీరదు. భార్య పక్కలో తనకు కావల్సినప్పుడు చేరుతూ మిగతా సమయాల్లో ఆమె పట్ల ఎటువంటి దృష్టి లేకుండా వసీం గడుపుతూ ఉంటాడు. ఈ విషయంగా భార్యా భర్తలిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వసీం అహంకారి, కోపిష్టి కూడా. భార్య తనలో ఏ చిన్న లోపాన్ని చూపించినా, సవరించబోయినా అది ఒప్పుకోలేడు. వీరి పెళ్ళి రోజున ఓ పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తాడు వసీం. కానీ అతనే అర్ధరాత్రి దాకా ఆ పార్టీకి రాడు. అతిథులందరూ భర్త గురించి ప్రశ్నిస్తూ ఉంటే జవాబు చెప్పలేక నీలోఫర్ తన గదిలోకి వెళ్ళిపోతుంది. పిలిచిన వాళ్ళే లేనప్పుడు తాము ఉండి చేసేదేమిటి అని అతిధులు భోజనాలు చేయకుండా వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన వసీం ఈ సంగతి విని నీలోఫర్‌పై ఎగిరి పడతాడు. ఆమె చెప్పేది వినడు. ఈ గొడవ పెరిగి కోపంతో ఆవేశంతోనూ తలాక్.. తలాక్..తలాక్.. అని ఆమెతో తెగతెంపులు చేసుకుంటాడు.
తలాక్ తర్వాత స్త్రీ జీవితం
దీంతో నీలోఫర్ జీవితం తారుమారు అవుతుంది. భర్త ఇంటి నుండి బయటకు వచ్చాక పుట్టినిల్లు చేరలేకపోతుంది. ఒంటరిగా హాస్టల్‌లో ఉంటూ పత్రికలకు కవితలు రాస్తూ ఉంటుంది. అలా ఓ కవితకు అందవలసిన పారితోషికం కోసం ఓ పత్రికా ఆఫీసుకు వెళుతుంది నీలోఫర్. అక్కడ ఎడిటర్ స్థానంలో తన స్నేహితుడు హైదర్‌ని చూస్తుంది. నీలోఫర్ గతాన్ని తెలుసుకున్న హైదర్ ఆమెతో స్నేహం చేస్తాడు. భర్త వదిలేసిన స్త్రీగా నీలోఫర్ పడే అవస్థ చూసి ఆమెకు దగ్గర అవుతాడు. తాను ఆమెను ఎప్పటినుండో ప్రేమిస్తున్నానని, ఆమె ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని అడుగుతాడు.
ఈ లోపు వసీం జీవింతంలో నీలోఫర్ లేని లోటు తెల్సుకుంటాడు. నీలోఫర్ వెళ్ళిపోయాక ఆమె లేని ఇల్లు శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది. తన తప్పు తెలుసుకొని నీలోఫర్‌ని కలిసి ఆ విషయం చెబుతాడు. కానీ అతనికి నీలోఫర్ తిరిగి దగ్గర అవలేకపోతుంది. మత పెద్దలను వసీం కలిసి నీలోఫర్‌ను తాను తిరిగి పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడు. వాళ్లు షరియత్ నియమాల ప్రకారం నీలోఫర్ మరొకరిని వివాహం చేసుకుని కొన్నాళ్ళు అతనితో గడిపి తిరిగి అతనికి విడాకులు ఇచ్చిన తరువాతే వసీం ఆమెను పునర్వివాహం చేసుకోవచ్చని చెబుతారు.
కానీ నీలోఫర్ హైదర్ తనపై చూపే ప్రేమలోని నిజాయితిని అర్థం చేసుకుంటుంది. కానీ ఒకసారి వసీం విషయంలో అయిన గాయం ఆమె మనసులో సలుపుతూనే ఉంటుంది. హైదర్ తన మంచితనంతో ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. హైదర్ మధ్యతరగతికి చెందిన యువకుడు. వసీం అంత ధనవంతుడు కాదు. కానీ అతనిలోని మంచితనం తన అసహాయత వీటి మధ్య నలిగిపోతున్న నీలోఫర్ హైదర్‌ని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇద్దరికీ వివాహం జరుగుతుంది. దానికి వసీం ఆనందంగా హాజరవుతాడు. తన దగ్గరకు మళ్ళీ చేరడానికే నీలోఫర్ హైదర్‌ను వివాహం చేసుకుంటుందని అతను నమ్ముతాడు.
విడాకులప్పుడు స్త్రీ అభిప్రాయం వద్దా?
అయితే వీరి పెళ్ళి తర్వాత హైదర్ నీలోఫర్‌ని హనీమూన్ కోసం అనుకోకుండా బొంబాయిలోని వసీం తీసుకెళ్ళిన హోటలుకే తీసుకెళతాడు. దీంతో తొలి ప్రేమ జ్ఞాపకాలు నీలోఫర్‌ను వెంటాడుతూనే ఉంటాయి. హైదర్ నీలోఫర్‌ని మనస్పూర్తిగా ప్రేమిస్తాడు. ఆమె కోసమే జీవితం అన్నట్లుగా ఉంటాడు. కానీ అప్పుడప్పుడు గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాల నుండి కోలుకోవడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది నీలోఫర్. ఆ సంఘర్షణ తన డైరీలో రాసుకుంటుంది. వసీం రాసిన ఓ ఉత్తరం, నీలోఫర్ డైరీలో ఆమె వసీం గుర్తులను చెరిపేసుకోవడానికి పడే ఘర్షణను చదివిన హైదర్ ఆమె తన దగ్గర సుఖపడట్లేదని భావిస్తాడు. ఈ పెళ్ళి షరియత్ నియమాల కోసమే ఆమె చేసుకుని ఉంటుందని నిర్ణయించుకుని నీలోఫర్ పుట్టిన రోజు కానుకగా వసీంను తీసుకువచ్చి నీలోఫర్‌తో తన మొదటి భర్తను ఆమె మళ్ళీ వివాహం చేసుకోవచ్చని తాను దానికి అనుమతి ఇస్తున్నానని చెబుతాడు.
అయితే, హైదర్ మాటలు నీలోఫర్‌ను గాయపరుస్తాయి. ఆవేశంతో ఇద్దరు పురుషులు తన మనసుతో ఆడుకుంటున్నారని, అహంకారంతో ఒకరు తలాక్ చెప్పి తనను ఒంటరిని చేస్తే, ప్రేమ, త్యాగం పేరుతో మరొకరు తనను ఓ వస్తువుగా ఎంచి వదిలించుకుంటున్నారని అసలు నాకు ఏమి కావాలన్నది ఎందుకు ఇద్దరు ప్రశ్నించలేకపోతున్నారని అడుగుతుంది!. నాకంటూ ఓ అస్థిత్వం, ఓ ఉనికి ఉండవా నాకు ఎవరితో జీవించాలో జీవించకూడదో నిర్ణయించుకునే హక్కు ఎందుకు ఉండదు? నాకేమి కావాలో తనను ఒక్కసారి కూడా ఎవరూ అడగకుండా నా జీవితాన్ని నిర్ణయించే హక్కు వారికెవరిచ్చారని ఆవేశంగా ప్రశ్నిస్తుంది. పైగా పెళ్ళి అప్పుడు స్త్రీకి ఆ వివాహం ఇష్టమేనా? అని అడిగే పద్ధతి ఉన్నప్పుడు భర్త వదిలించుకోవాలనుకున్నప్పుడు స్త్రీ అభిప్రాయం అడిగే పద్ధతి, స్త్రీ అనుమతి ఎందుకు అడగరని నిలదీస్తుంది. ఒకరు తిట్టినట్లు విడాకులిస్తే మరొకరు బహుమతిగా విడాకులిస్తూ అసలు తన గురించి ఏం ఆలోచించారని అడుగుతుంది. ఎవరికి వారు తమ ఇష్టానుసారం నాతో ఆడుకోవడం ఏమిటని ప్రశ్నిస్తుంది. హైదర్‌ను భగవంతుని తరువాత తాను తలవంచే దైవంగా ఇన్నాళ్లు భావించానని కానీ అతను కూడా కేవలం మగవాడిలా ప్రవర్తించాడని కన్నీళ్ళ పర్యంతమవుతుంది నీలోఫర్. నేనే ఆ ఇంటి నుండి వెళ్లిపోతానంటోంది.
హైదరాబాదీలు.. మర్చిపోలేని సినిమా!
వీరిద్దరి సంభాషణ వింటున్న వసీం నీలోఫర్ దగ్గరకు వచ్చి తన అహంకారానికి హైదర్ ను శిక్షించవద్ధని, తన ప్రేమలో స్వార్థం ఉందని కానీ హైదర్ నీ సుఖం గురించే ఆలోచిస్తున్నాడని, మీరిద్దరూ కలిసి ఉండడమే ధర్మమని చెప్తాడు. అహంకారంతో విడాకులివ్వడమే కాకుండా మరొకరి భార్యను మళ్ళీ పొందాలనుకోవడం తన స్వార్ధం అని, తనను క్షమించమని నీలోఫర్ హైదర్‌లను కలిపి అతను వాళ్ళ జీవితం నుండి తప్పుకుంటాడు.
ఈ సినిమాలో నీలోఫర్ పాత్ర ద్వారా ట్రిపుల్ తలాక్ స్త్రీల మనసులకు చేసే గాయాలను, వారు ఎదుర్కోవలసిన పరిస్థితులను దర్శకులు బీ.ఆర్ చోప్రా చూపించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సమస్యపై మరే భాషలోనూ ఇంత లోతైన చర్చ సినిమా రూపంలో జరగలేదు. సినిమాలో ప్రధాన పాత్రలను సల్మా ఆఘా, రాజ్ బబ్బర్, దీపక్ పరాషర్‌లు పోషించారు.
‘నిఖా’ సినిమా పాటలన్నీ హసన్ కమల్ రాశారు. సల్మా అఘా, మహేంద్ర కపూర్ పాడిన ఈ పాటలన్నీ సూపర్ హిట్లే. గులాం హైదర్ ఘజల్ ‘చుప్కే చుప్కే’ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. రవీ అందించిన సంగీతం అజరామరం. ట్రిపుల్ తలాక్ పై వచ్చిన గొప్ప చిత్రంగా మాత్రమే కాక అద్భుతమైన సంగీతానికి, పాటలకీ ఈ చిత్రం సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. “హమ్నే ఉదాసియో మే గుజారీ హై జిందగీ, లగ్తా హై డర్ ఫరేబేవఫా సే కభీ కభీ.. ఐసా నా హోకి జఖ్మ్ కొయీ ఫిర్ నయా మిలే” “దిల్ కే అర్మా ఆసువో మే బెహ్ గయే… హం వఫా కర్కే భీ తన్హా రహ్ గయే” లాంటి వాక్యాలతో స్త్రీల మనసుకు ఎంతో దగ్గరగా వచ్చిన చిత్రం ‘నిఖా’ హైదరాబాదీలు మర్చిపోలేని ఓ ఆణిముత్యం.
- పి. జ్యోతి
98853 84740
Read More: Disha Newspaper
- Tags
- Nikaah