పాలన వైభవమా..! పాలక వైభోగమా..!!

by Ravi |   ( Updated:2023-04-30 00:15:16.0  )
పాలన వైభవమా..! పాలక వైభోగమా..!!
X

రెండు నెలల కిందట వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు తనకు జరిగిన అన్యాయంపై భుజాన నాగలి మోసుకుంటూ.. చేతిలో ఉరితాడు పట్టుకుని.. తనకు జరిగిన అన్యాయాన్ని ఫ్లెక్సీపై రాసుకుని ప్రదర్శిస్తూ.. అర్ధనగ్నంగా హైదరాబాద్ రోడ్లపై తిరిగినది వినే ఉంటాం. అధికార నేతల అండతో కొన్నేళ్లుగా తన భూమి ఆక్రమణ చెరలో ఉండగా.. స్థానిక అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక చేసేదేమీలేక రాజధానిలో ఉండే పాలక పెద్దలను కలిసి తన బాధను చెప్పుకునేందుకు వచ్చినట్టు అతడు ఆవేదనతో చెప్పినది తెలిసిందే.

ఇలా సామాన్యుడికి ఏ కష్టమొచ్చినా.. మొదటగా తలుపు తట్టేది.. మండల ఆఫీసును.. లేదంటే.. ఆర్డీవో ఆఫీసుకు.. అక్కడా కాదంటే.. కలెక్టరేట్ కు.. అక్కడ చేతులెత్తేస్తే.. ఇక మిగిలింది ఒక్కటే. సచివాలయానికే దారిపట్టి వచ్చేది. ఇక్కడికి వచ్చేది. తన కష్టాలు చిన్నసార్‍‌లు తీర్చకపోవడంతో పెద్దసార్లైనా పట్టించుకుంటారనే ఆశతో వస్తాడు. ఇక్కడికి వచ్చాక కూడా తన బాధలను పట్టించుకోకుండా గేట్లు మూసుకుపోతే.. ఇక చావే గతంటూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగో.. పెట్రోల్ డబ్బాతో వచ్చి అక్కడే ఒంటిపై పోసుకుని కాల్చుకున్న ఘటనలూ లేకపోలేదు.

వసతుల లేవనే కారణంతో..

పాత సచివాలయం నిజాం కాలం నుండి వారసత్వంగా వస్తుంది. ఆ సచివాలయంలో అతిథులకు సరైన సౌకర్యాలు లేకపోవడం.. సరైన పార్కింగ్ వసతి. రెండు మూడు భవనాలుగా ఉండడం. అధికారులు, సిబ్బందికి విభాగాల్లోకి వెళ్లేందుకు సమస్యలు వస్తుండడం. వాస్తుకు అనుకూలంగా లేకపోవడం.. లాంటి కారణాలతో కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణం తలపెట్టి పాత సచివాలయం కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ప్రభుత్వ చర్యపై వ్యతిరేకత రాజకీయనాయకుల్లో వచ్చి కోర్టుకు పోయినా, తీర్పులు అనుకూలంగా రావడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. అయితే.. దీనిని మొదట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్మించాలనుకున్నారు కానీ చట్టపరమైన ఇబ్బందులతో సాధ్యంకాకపోవడంతో. చివరకు పాత సచివాలయ పునాదులపైనే కొత్తగా నిర్మాణం జరిగింది. ఈ కూల్చివేతల్లో పురాతన కట్టడాలు.. ఆలయం, మసీదులు, చర్చి కూల్చివేత లాంటి వాటిపై వివాదాలు చుట్టుముట్టినా వెనకడుగు వేయకుండా ప్రభుత్వం అత్యాధునిక, కార్పొరేట్ హంగులతో కొత్త సెక్రటేరియట్ 26 నెలల్లోనే రూపుదిద్దుకుంది.

దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రూ. 600 కోట్లకుపైగా ప్రజాధనంతో నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమై నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అట్టహాసంగా ప్రారంభించి అధికారికంగా విధులను చేపట్టనున్నారు. కాగా.. ఈ భవనాన్ని అందంగా..ఆకర్షణీయంగా నిర్మించి తీర్చిదిద్దారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కొత్త సచివాలయం రాజభవనంలా ఉంది. సామాన్యుడు దగ్గరి నుంచి చూస్తే .. ఆ ఇంద్రభవన వెలుగులను చూసి బెదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు.

సామాన్యులకు గేట్లు తెరుచుకుంటాయా?

అయితే, కొత్త సచివాలయం నిర్మాణం చూస్తే సామాన్యులకు కనీసం లోనికి వెళ్లే అవకాశమైనా దొరకుతుందా? అనే అనుమానాలు రేకేత్తుతున్నాయి. కార్లలో వెళ్లే సెలబ్రిటీలు, వీఐపీలు, ధనవంతుల కోసమే సెక్రటేరియట్ గేట్లు తీసేలా ఉన్నాయి. ఈ సచివాలయంలో పేదలు తమ సమస్యలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వద్దకు వెళ్లి చెప్పుకునే పరిస్థితి ఉంటదా? అనే ప్రశ్నలు, ఆరోపణలు, విమర్శలు రాజకీయ నేతల నుంచి తలెత్తాయి. దీనిపై అధికార పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటే.. మరోవైపు విపక్ష నేతలు విమర్శలను గుప్పిస్తున్నారు. దీంతో కొద్దిరోజులుగా దీని చుట్టే చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా కానీ.. సామాన్యులకు సులువుగా ఎంట్రీ ఉంటుందా.. లేదా.. అనేది సచివాలయం ప్రారంభించాకే స్పష్టత వస్తుంది.

నిర్మాణం నుంచే వివాదాలకు కేరాఫ్

కొత్త సచివాలయం వివాదాలకు కేంద్రంగానూ మారింది. కొత్త సచివాలయ డోమ్‌లు తెలంగాణ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని.. అధికారంలోకి వచ్చాక తాము కూల్చివేస్తామంటూ.. తాజ్ మహల్ తరహాలో ఉన్న ఆ డోములను కూల్చి, రాష్ట్ర సంస్కృతికి సంప్రదాయాలకు అనుగుణంగా మారుస్తామని బీజేపీ ఛీఫ్, సీఎం కేసీఆర్ కు వాస్తు పిచ్చి బాగా ఉందని.. అందుకే ఆయన పాత సచివాలయానికి రాలేదని.. తనకు నచ్చిన్టటు వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం నిర్మించుకున్నారని.. టీపీసీసీ చీఫ్ ఆరోపణలు చేశారు. పూర్వకాలంలో ప్రజల సొమ్మును రాజులు రాళ్ల పాలు చేసినట్టు.. ప్రస్తుత కాలంలో ప్రజల సొమ్ము రాజ భవంతుల పాలు అంటే ఇదేనేమో..! ఈ పాలన భవన విజయ వైభవ వెలుగులు ఎవరికో.. అనేది చెప్పలేం. కానీ.. పాలక వైభోగానికి.. బడా బాబులకు.. పెత్తందారులకు.. పైరవీలకు.. కమీషన్లకు.. కాంట్రాక్టులకు.. కేరాఫ్ అడ్రస్‌లా నిలవకుండా.. సామాన్యుడికి ఏదైనా కష్టమొస్తే.. సచివాలయానికి పోతే తీరుతుందనే భరోసాతో వచ్చేలా వెలగాలని ఆశించడమే..! స్వరాష్ట్రంలో సుపరిపాలన అందించే సౌధమై నిలవాలని.. మొత్తానికి ‘జనహిత’ సౌధమై విలసిల్లాలని కోరుకోవడమే తప్ప.! అన్నం ఉడికిందని తెలుసుకోవడానికి.. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు.. !! అనే సామెత మాదిరిగానే.. పేదోడు తనకు వచ్చిన కష్టాన్ని తీర్చండి సారూ.. అంటూ.. కాలుకాలు కొట్టుకుంటా మారుమూల నుంచి రాజధానిలోని సచివాలయానికి వచ్చిండంటే.. ఇంతకంటే.. ఇంకేం ఆశిస్తాడు సామాన్యుడు.

సురేష్ వేల్పుల

సీనియర్ జర్నలిస్టు

91001 44990

Advertisement

Next Story