రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది.. నమ్మాల్సింది కాంగ్రెస్ నాయకులే..!

by Ravi |   ( Updated:2024-11-03 01:16:11.0  )
రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది.. నమ్మాల్సింది కాంగ్రెస్ నాయకులే..!
X

వరుస ఎన్నికల విజయాలతో దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీని ఇక ఆపే శక్తి దేశంలో లేదు అని బలపడుతున్న దశలో, రాహుల్ గాంధీ రూపంలో కొత్త శక్తి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొత్త ఆశలు చిగురించాయి. బీజేపీని రాజకీయంగా నిలువరించేందుకు తన శక్తి యుక్తులన్నింటీని ధారపోస్తూ కాంగ్రెస్ పార్టీకి భారీ మరమ్మతులనే చేస్తున్నారు. బలమైన హిందూత్వ ఎజెండాతో దేశం మొత్తం కాషాయికరణతో దూసుకుపోతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న మోడీ లాంటి గ్లామర్ ఉన్న నేతను బలమైన క్యాడర్ ఉన్న పార్టీని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాన్ని రాజకీయంగా ‘ఢీ’ కొట్టడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సాహసం చేయడమే అవుతుంది.

రాహుల్, కుల గణన ఎజెండాతో ఎలుగెత్తి చాటు తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం రాహుల్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కుల గణ నపై ఒక్క అడుగు ముందుకేసి రాహుల్ ఆలోచనని బలపరచింది. ఇంకా చాలా విషయాల్లో రాహుల్ ఆలోచనతో ముందుకు వెళితే ఫలితాలు అనుకూలిస్తాయి.

పార్టీని కుటుంబాల చేతిలో పెట్టి..

గడిచిన 3 దశాబ్దాల కాలంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో వచ్చిన రాజకీయ మార్పులు ఏమి లేవు. పాత మూస పద్ధతులతో స్థానిక ఆధిపత్య వర్గాల నిర్మాణంలోనే కాంగ్రెస్ కొనసాగడం ఆ పార్టీకి తీరని నష్టం చేసింది. కానీ మరోవైపు భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలను ప్రభావితం చేస్తూ బలమైన పార్టీగా ఎదిగింది. కాంగ్రెస్ మాత్రం కేవలం పార్టీ నిర్మాణాన్ని కొన్ని కుటుంబాల చేతిలో పెట్టి అన్ని వర్గాలకు దూరం అయింది. భారతీయ జనతా పార్టీలో మోడీ నాయకత్వం బలపడ్డ కొద్ది రాహుల్ గాంధీ ఇమేజ్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. రాహుల్ నాయకత్వం వరుస ఓటములు చవిచూడటం, ఇటు పార్టీలో అటు సోషల్ మీడియాలో రాహుల్ ఇమేజ్‌కు పెద్ద గండి పడింది. అయితే వరుస అపజయాలకు రాహుల్ ఎన్నడూ కృంగిపోలేదు, చాలా హుందాగా ఓటమికి నైతిక బాధ్యత వహించాడు. అపజయాల నుండి విజయానికి బాటలు ఎలా వేయాలో అధ్యయనం చేశాడు.

లౌకిక వాదం ఒక్కటే సరిపోదని..

కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అపజయాలు ఎదురైన మొక్క వోని దీక్షతో ముందుకే సాగాడు. పార్లమెంట్ లోపల బయట కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేశాడు. కాంగ్రెస్ పార్టీని బలమైన భావజాలం మాత్రమే నిలబెట్టగలుగుతుందని నమ్మాడు, ఆచరించాడు. అందుకు కావలసిన మేధోమధనం చేశాడు. నిపుణులతో చర్చించాడు. మేధా వుల వద్ద ఆలోచనలు పంచుకున్నాడు. దేశంలోని సోషలిస్టులు, అంబేడ్కర్ వాదులు, బుద్ధిస్ట్‌లు, కమ్యూనిస్టు మేధావుల వద్ద ఆధునిక రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసారు. అందుకే లౌకికవాద నినాదం సరిపోదని గ్రహించి సామాజికన్యాయం ఎజెండాను బుజాలకెత్తుకున్నాడు. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం అనే రెండు ప్రధాన రాజకీయ సూత్రాలను కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చేర్చాడు. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకు డు చేయని సాహసాన్ని భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నిర్వహించాడు. దేశంలో బలమైన భావజాలాన్ని మరో బలమైన భావజాలం మాత్రమే సమాధానం చెబుతుందని రాహుల్ గాంధీ విశ్వసించాడు, ఆచరించాడు. ఆయన కృషి కొంతవరకు ఫలించింది. అనుకూల ఫలితాలు కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయి.

రాహుల్ వ్యూహాన్ని అర్థం చేసుకోక..

అయితే, రాహుల్ ఉపన్యాసాలు కార్యక్రమాలు ప్రజలను ప్రభావితం చేసినంతగా కాంగ్రెస్ నేతలను ప్రభావితం చేయలేకపోవడం విషాదం. రాహుల్ మాట్లాడుతున్న రాజకీయ భాష మావోయిస్టుల భాష అని సాక్షాత్తూ భారత ప్రధాని అంటున్నారంటే ఆయన ఇమేజ్ రాహుల్ ప్రభ ఎంతమేర పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పు డు మారాల్సింది కాంగ్రెస్ నాయకత్వమే. మొత్తం కాంగ్రెసు పార్టీలో రాహుల్ రాజకీయ పరిభాషను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టే నాయకత్వం కనుచూపు మేరలో కనిపించకపోవడం ఆ పార్టీ సంబంధించినంత వరకు బావ దారిద్య్రమే. అఖిల భారత కాంగ్రెస్ నుండి తెలంగాణ కాంగ్రెస్ వరకు ఒక్కరంటే ఒక్క నేత కూడా రాహుల్ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకున్నట్టు కనిపించరు. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి, ఉపాధి కల్పన, నిరుద్యోగం తదితర మౌలిక అంశాలపై రాహుల్ తప్ప ఒక్క నేత కూడా నోరు మెదపరు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది‌న బూస్టింగ్ ఇచ్చిన కర్ణాటక, తెలంగాణలో రాహుల్ ఆలోచన ఎంతవరకు ఆచరణ రూపు దాల్చుతుందన్నది మీడి యాలో కథనాలు చూస్తున్నాం.

కులగణన ఎజెండాతో రాహుల్ ఎలుగెత్తి చాటుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం నిమ్మ కు నీరెత్తినట్టు ఉండటం ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కుల గణనపై ఒక్క అడుగు ముందుకేసి రాహుల్ ఆలోచనని బలపర్చింది. ఇంకా చాలా విషయాల్లో రాహుల్ ఆలోచనతో ముందుకు వెళితే ఫలితాలు అనుకూలిస్తాయి. ఒకవైపు సామాజిక న్యాయంపై రాహుల్ ‌పోరాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం పాత పద్ధతులు అవలంభిస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రా‌ల్లో రాహుల్ రాజకీయ ఎజెండాను ఆచరణలో పెడితే రాహుల్ పరపతి పెరుగుతుంది. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రా‌ల్లో పాలన సాగితే కాంగ్రెస్ పార్టీ తీరని నష్టం జరుగుతుంది. బలమై న భావజాలాన్ని మరో బలమైన భావజాలం మాత్ర మే ఎదుర్కోగలుగుతుందన్న సత్యాన్ని రాహుల్ గ్రహించాడు. అలాగే ఆయన ప్రధాన నాయకత్వం కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు దీనిని గ్రహించినప్పుడు మాత్రమే కాంగ్రెస్ బలపడుతుంది. లేకపోతే హర్యానా ఫలితాలే పునరావృతం అవుతాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌‌కు గుణపాఠం. రాహుల్ గాంధీ రాజకీయంగా పరిణతి చెందాడని దేశం నమ్ముతుంది మారాల్సింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే.

దొమ్మాట వెంకటేష్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

98480 57274

Advertisement

Next Story

Most Viewed