- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు చిత్రాలు… ఒక అభిప్రాయం!
‘కథలంటూ ఏమీ లేవు. ఉన్నవి, ఇంతకు ముందు వచ్చినవి ఎలా కొత్తగా తెరపై ప్రజెంట్ చేస్తున్నాం అనేది ప్రేక్షకునికి అవసరం. గతంలో తాము చూసిన ఏ చిత్రమైన, ప్రస్తుతం చూస్తున్న చిత్రం గుర్తుకు వస్తే ప్రమాదమే..’ ఇది నాలుగు దశాబ్దాల క్రితం దర్శకుడు మధుసూదన రావు గారు చెప్పినది. అందుకనే ఆయన తన సినిమాల కథ కోసం విపరీతంగా శ్రమించారు. కనుకనే ఇంటిపేరు `విక్టరీ’గా ప్రేక్షకులు ఖాయం చేశారు.
ఒకే కథతో.. ఎన్ని సినిమాలొచ్చినా..
చిత్రసీమలో నాన్న, అన్న, తల్లి, చెల్లి సెంటిమెంట్స్ బాగా వర్క్ అవుట్ అవుతాయి. కృష్ణారెడ్డి లాంటివారు తల్లి సెంటిమెంట్ తోనే విజయం సాధించారు. `అన్న’ చెల్లి కోసం, `నాన్న’ కొడుకు కోసం పడే తపనతో కథలు తయారు చేసుకొని విజయాలు సాధించింది చిత్ర పరిశ్రమ. నాటి `దొంగ రాముడు’ నుంచి నేటి `జైలర్’ వరకు నాటి `బంగారు గాజులు’ `చిట్టి చెల్లెలు’ నుంచి నేటి `భోళా శంకర్’ వరకు కొన్ని వందల చిత్రాలు ఒకే కథలో వచ్చాయి. ఫలితాలు అందరికీ తెలిసినవే. ఇక్కడ గుర్తుంచుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రసిద్ధ నటులు, సీనియర్ నటులు నటించిన కథను తీర్చిదిద్దే విధానంతో `పాత వాసన’లుంటే ప్రేక్షకులు వందలు, వందలు డబ్బులు తగలేసి సినిమాలు చూసే రోజులు పోయాయి. సినిమా రెండో ఆటకే సోషల్ మీడియాలో సమీక్షలు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి నెగిటివ్ టాక్ వస్తే తిరిగి పుంజుకోవడం కష్టమే.
ఆగస్టు 10, 11 తేదీలలో వరుసగా మెగాస్టార్ చిరంజీవి నటించిన `భోళాశంకర్’ రజనీకాంత్ నటించిన `జైలర్’ (10న విడుదలైంది) వచ్చాయి. తొలి రోజు తొలి ఆట నుంచే అభిమానులు సహితం `భోళా శంకర్’ పట్ల నిర్లిప్తను, నిరాశను వ్యక్తం చేశారు. `జైలర్’ చిత్రం ఇంటర్వెల్ తర్వాత దాదాపు 40 నిమిషాలు `డ్రాగ్’ ఉన్న మొత్తంగా దర్శకుడు నెల్సన్ ప్రేక్షకులు (అభిమానులు) రజిని `స్టైల్’ ఎలా ఉండాలని ఆశించారో` అలానే’ సినిమాను నింపేశారు. `భోళా శంకర్’ విషయానికొస్తే `చిరంజీవి’ చరిష్మా మీద చిత్రం లాగిస్తుందనుకున్న వారికి నిరాశ ఎదురైనట్టు చేశారు దర్శకుడు మెహర్ రమేష్. `వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవికి, రజినీకి కూడా ఈ మధ్యకాలంలో విజయాలు లేవు. ఆ కసితోనే నెల్సన్, రమేష్‌లు కృషి చేశారు. ఆ కసి 8 సంవత్సరాల క్రితం వచ్చిన `అజిత్’ సినిమా `వేదాళం’ మాతృక. `జైలర్’ కథ కూడా `పూరి’ `బుడ్డా హోగా తేరా బాప్’, `భారతీయుడు’ హాలీవుడ్ చిత్రం `ఎక్సైండిబుల్స్’ ఇలా అనేక కథల `ఫ్లేవర్’ కనిపిస్తుంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణలు ఒకరికొకరుగా కథలో ప్రవేశించి తమ పాత్ర పరిధిలో నటించి వెళతారు.
ఎందరో భవిష్యత్తును నిర్ణయించేది..
రెండు సినిమాలలోనూ ఎన్నో సన్నివేశాలలో ఎంతో అతి కనిపిస్తుంది. కానీ… రజిని, నెల్సన్ల బృందం దీనిని ఎక్కడ కనిపించకుండా వర్తమాన యువత కోరుకునే విధంగా కథనం నడిపించారు. ముఖ్యంగా రజిని, కమలహాసన్, మోహన్ లాల్, అజిత్ తదితరులు సాధ్యమైనంతవరకు దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్తారు. వారికి తమ అభిమానుల మనస్థితి, తమ `బాడీ లాంగ్వేజ్’ తెలిసిననే నమ్ముతారు. కానీ.. తెలుగు పరిశ్రమలో పెద్ద స్టార్స్ దర్శకుడు కి ఇచ్చే స్వేచ్ఛ అతి స్వల్పమని అందరికీ తెలిసిందే. ఫలితాలు కూడా ఆ మాదిరిగానే ఉంటున్నాయి. తమని నమ్మి కోట్లు ఖర్చు చేస్తున్న సినిమా బెటర్ గా రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ… కథకు మించి మార్పులు చేస్తే గతంలో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. `నిర్మాత దేవుడు’ అంటే చాలదు. ఆర్థికంగా ఆ దేవుడికి కాస్తంతైన ప్రసాదం మిగిలేటట్లుగా చూసుకోవలసిన అవసరం ఉంది.
`భోళా శంకర్’ `జైలర్’ నిర్మాణంకు అయిన ఖర్చు వచ్చిన - వస్తున్న వసూళ్ల వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. వాటిని గూర్చిన చర్చ ఇక్కడ అప్రస్తుతం. రెండు చిత్రాలకు కథ, కథనాలు, కథానాయకుల ‘హీరోయిజం’ ప్రదర్శన, టెక్నికల్ వాల్యూస్ వంటి వాటితో పాటుగా సహాయ పాత్రలు పోషించిన నటులు కీర్తి సురేష్, సుశాంత్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, సునీల్ ఇలా వారి ప్రాధాన్యత కూడా తగ్గటం మరో ప్రధానమైన అంశం. ఎంత త్యాగాలు జరిగినా `భోళా శంకర్’ `జైలర్’ చిత్రాల మధ్య అంతరం ప్రేక్షకులు గ్రహించారు. “చిత్ర సీమలో విజయాలే కొలమానాలు కావు. కానీ.. విజయాలే బ్రతుకు మార్గాలని” అప్పుడెప్పుడో ముళ్ళపూడి వారు కాస్త సీరియస్ గానే చెప్పారు. చిత్ర జయాపజాయాలు పైన కొన్ని వేల మంది బ్రతుకులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే దర్శకులు భవిష్యత్తును ఇటువంటి చిత్రాలు నిర్దేశిస్తాయి. ఫెయిల్యూర్ దర్శకులకు అవకాశం ఇవ్వటం మంచిదే. కానీ.. ఏ మేరకు అతనిలోని దర్శకునికి అవకాశాలు ఇస్తున్నామనేది కూడా ముఖ్యం. నెల్సన్, మెహర్ రమేష్ లలోని టాలెంట్ ఏమిటో ప్రేక్షకులు గ్రహించారు కనుకనే ఫలితంను అదే విధంగా ప్రదర్శించారు.
చిన్న సినిమాను నలిపేస్తూ..
ఈ రెండు చిత్రాల నేపథ్యం చిత్ర పరిశ్రమ, అభిమానులు గమనించవలసిన అంశం ఏమిటంటే హై బడ్జెట్, లో బడ్జెట్ సినిమాల మధ్యనున్న సన్నని గీత. ఎక్కువ ఖర్చు చేసి, స్టార్స్, గొప్ప కాంబినేషన్స్, క్రేజీ సమీకరణాలు, మాధ్యమాల ద్వారా ఇచ్చే `హైపు’ నాలుగు ఆటలు రాబడికి మాత్రమే దోహద పడతాయి. ఆ తరువాత కథా కథనాలలో శక్తి సామర్ధ్యాలు లేకుంటే కేవలం `కథానాయకుడు’ స్టామినా చిత్రానికి ఆర్థిక వనరుల సమీకరణ కష్టం. ఫలితం నిరాశపూరితం. నాలుగు దశాబ్దాలుగా వందల సినిమాల్లో నటించిన `సీనియర్స్’ చిత్ర ఫలితం తెలియదని అనుకోలేము కదా! ఇక్కడ మరో విషయం చిన్న సినిమాలు కొన్ని `సామజవరగమన’, `బేబీ’, `విమానం’, `బలగం’ `మధ్యతరగతి మందహాసం’ ఇలా ఎన్నెన్నో ప్రజాదరణ పొందాయి. అందులో స్టార్స్ లేరు. భారీ సెట్స్ లేవు. గొప్ప గొప్ప ఛాయాగ్రహకులు లేరు. మరి అది కూడా ఖర్చుకు 15 రెట్లు ఆదాయాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టాయి. అయితే పెద్ద సినిమాలు రిలీజ్ రోజు నుంచి 45 రోజులు పాటు నగరంలో `థియేటర్స్’ను సొంతం చేసుకుని, చిన్న సినిమాలు ఆదాయానికి, ప్రేక్షకులు వినోదానికి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమో పెద్దలు ఆలోచించాలి. రెండు పులులు దెబ్బలాడుకుంటే మధ్య నలిగిన పొట్టేలు మాదిరి చిన్న నిర్మాతలు ఆదాయం పైన పడే దెబ్బ చిత్ర పరిశ్రమలోని కొన్ని వేల మంది కార్మికుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇంకో విషయం వయసు మీద పడిన హీరోలు `యువత’వలే `కుర్ర హీరోయిన్స్’ తో డాన్స్‌లు చేస్తే చూసే `యువజనం’ ఇప్పుడు ఉన్నారా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. `యువత’ కోసం తీసే సినిమాలో `యువత’ కోరుకునే తారలు ఉండాలి కదా!
భమిడిపాటి గౌరీశంకర్
9492858395