- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మను మించిన దైవం లేదు
తల్లిగా, పిల్లలకు ఆటబొమ్మగా, పని మనిషిగా, వంట మనిషిగా, స్నేహితురాలిగా, సలహాలు ఇచ్చే మార్గదర్శిగా, మనసుకు బాధ కలిగితే ఓదార్చే ఆత్మీయురాలిగా 'అమ్మ'తో మనకు అనుబంధం కలకాలం కొనసాగుతుంది. మనిషి జీవితం మొత్తం అమ్మ ప్రేమతో నిండి ఉంటుంది. కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం తనవారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ కల్మషం లేని ప్రేమను పంచుతూ ఇంటిని నందనవనంగా మారుస్తుంది. అమ్మ లేనిదే జగతి లేదు, ప్రగతి లేదు. అమ్మ లేకపోతే జీవితానికి అర్థం లేదు. ఏమిచ్చి అమ్మ రుణం తీర్చుకోగలం. అలాంటి ఆలోచనలో నుంచి పుట్టిందే మాతృ దినోత్సవం.
అమెరికాలో సివిల్ వార్ జరిగినప్పుడు గాయపడిన సైనికులకు అన్నా మేరీ రివిస్ జార్విస్ అనే మహిళ చికిత్స చేసింది. 'మదర్స్ డే' అనే వర్క్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించింది. ఆమె చనిపోయిన తర్వాత కూతురు అన్నా డార్విన్ తన తల్లి చేసిన సేవలకు గుర్తుగా 1908లో ఒక చర్చిలో మదర్స్ డే వేడుకలు జరిపింది. అధికారికంగా మదర్స్ డే జరపాలని ప్రభుత్వానికి విన్నవించింది. ప్రజలకు అమ్మ సేవలపైన అవగాహన కల్పించింది. 1911లో అమెరికా ప్రభుత్వం అధికారికంగా మదర్స్ డే జరిపించింది. మే రెండో ఆదివారం మదర్స్ డే జరపడం ఆనవాయితీగా మారింది. బిడ్డకు ప్రపంచాన్ని పరిచయం చేసే మొట్టమొదటి వ్యక్తి అమ్మ. బిడ్డ ప్రాణానికి కంచు కవచం, శిశువుకు తొలి నమ్మకం. అమ్మ జోల పాటకు ఏదీ సాటి రాదు. అలసటతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా. బాధలో ఉన్నా, కోపంగా ఉన్నా, అర్ధరాత్రి మగత నిద్రలో ఉన్నా కూడా 'అమ్మా' అని తట్టి లేపితే ఉలిక్కిపడి ఆత్రంగా స్పందిస్తుంది అమ్మ. సుఖదుఃఖాలలో మొదటగా తలచుకునేది అమ్మనే. బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తుంది. అమ్మ సంతోషించే క్షణం బిడ్డ పుట్టినప్పుడు మాత్రమే. తన సంతోషాన్ని బిడ్డలో చూసుకుంటుంది.
తరాలు మారినా
అంధులు, వృద్ధులు అయిన తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం కావడిలో మోసుకుంటూ కాశీకి తీసుకెళ్లాడు శ్రవణ కుమారుడు. 'పెంచాను కానీ, పెళ్లి నా చేతుల మీదుగా జరపలేకపోయాను' అని యశోద బాధపడితే కలియుగంలో వకుళాదేవిగా తన వివాహం జరపగలవని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు. తరాలు, యుగాలు, సంప్రదాయాలు మారినా అమ్మ ప్రేమ మారదు. 'అమావాస్య చీకటిలో చందమామను పట్టుకోగలం కానీ, అమ్మ ప్రేమలో కల్మషం వెతకలేం. తల్లి మేలు కోరని చెడ్డ కుమారుడు ఉండొచ్చేమో కానీ, కుమారుని మేలు కోరని తల్లి మాత్రం ఉండదు' అంటారు శంకరాచార్యులు. అందుకే తల్లిదండ్రులను ప్రేమించండి. అనాదరణకు గురి చేయకండి. ముసలితనం శాపం కాకూడదు. అది వరంగా మార్చేది బిడ్డలు మాత్రమే. 'అమ్మ దీవెన ఆకాశమంత, దేవుని దీవెన దీపమంత' అంటారు కదా! సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించే మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
కొమ్మాల సంధ్య
లెక్చరర్, తాడ్వాయి
91540 68272