- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అమ్మ ఒక యోద్ధ
'ఇస్ దునియామే మా సే బడా యోద్ధా కోయీ నహీ హోతా' అనే సినిమా డైలాగ్ ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యింది. 'ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ లేరని' దాని అర్థం. ఇది నిజం. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కాలంతో పాటు కఠిన సమాజంలో ప్రయాణం చేస్తూ, ప్రతి క్షణం యుద్ధరంగంలో పోరాడుతూ బిడ్డల కోసం గెలుస్తూనే ఉంటుంది. తన రెక్కలు వాలేంత వరకు శ్రమిస్తేనే ఉంటుంది. అమ్మను మించిన దైవం లేదు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకుని మనలను పెంచి పెద్ద చేస్తుంది. మనం చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. బాధ్యత. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. అమ్మ పట్ల మనకు ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం ఇంకోటి ఉండదు.
బాపుతోనే బతుకంతా
చెట్టూ, చేమా అంటే ఆయనకు శ్వాస. పుట్ట మట్టితోనే ఆయన జీవితం. బాపు చిటుకుల నర్సారెడ్డి అందరికీ ఆత్మబంధువు. అమ్మ సత్తమ్మ. విప్లవోద్యమాల పోరుగడ్డ మల్లుపల్లి మాది. దాదాపు 200 బర్లకు కాపరి బర్లకాడి నర్సయ్య. వానొచ్చినా, చలొచ్చినా, ఎండొచ్చినా బర్లగాసుడే. చెట్టు, పుట్ట, చెరువు, పెరడు, అడవి తిరుగుడే. పగలు 12 అయిందంటే బర్లన్నీ మందకు వచ్చు. అప్పటికే అమ్మ సద్ది తీసుకుని వచ్చు. రెండున్నర మూడు ప్రాంతంలో బర్లు తిరిగి మేతకు పోయేది. మంద దగ్గర బర్ల పెండను అమ్మ, నేను ఒక్కదగ్గరికి కుప్పేసి, ఇంటికి వెళ్లేది. చీకటి పడేదాక బాపు బర్లను ఊరు పొలిమేర లొట్లమర్రి, కాశిమ్ చెరువు, పెద్ద చెరువు, నల్ల సముద్రం కుంట, మామిడి తోట దిక్కు, పెద్ద చెప్యాల, రుద్రారం వీరారెడ్డిపల్లి, గాజులపల్లి పొలిమేరల దాకా తిప్పుకుంటూ, చీకటి పడగానే ఊర్లకు పంపేది. ఇట్ల బాపు బర్లను 1985 నుండి 2003 వరకు 25 ఏండ్లు బర్లను కాసిండు. బాపు బర్లను కాసినన్ని రోజులు అమ్మ బాపు తోడు ఉంటుండే.
అమ్మకు నలుగురం సంతానం. అక్క, అన్న, చెల్లె, నేను. అందరి పెండ్లిళ్లు చేశారు. మా పిల్లల పెండ్లిళ్లు చూడలేకపోయారు. సిద్దిపేట నుంచి ఇంటికి అర్ధరాత్రి పోయినప్పుడల్లా అమ్మ 'ఇంత రాత్రి' దాకనా? అని తిడుతుండే. 'అన్నం పెట్టు. ముందు వానికి' అని బాపు చెబుతుండే. రాత్రి, పగలు పోలీసుల బూట్ల చప్పుడు, అన్నల కోసం ఆరా. ఎప్పుడూ ఏదో ఒక ఎన్‌కౌంటర్. ఎప్పుడు ఏమైతదో తెలియని పరిస్థితులు. విలేకరిగా ఊర్లన్నీ తిరుగుతూ, సిద్దిపేటకు వచ్చి వార్తలు పంపిస్తుంటుమి. కొంచెం ఆలస్యం అయ్యిందంటే ఊరి బస్సు మిస్ అవుతుండే. ఇంటికి పోకపోతే అమ్మ కంగారు పడేది. బాపుకు కొంత విప్లవ వాసన ఉండేది. ఏమనకు పోవు. కానీ అమ్మనే బాగా ఆందోళన కంగారు పడేది.
కరువుకాటకాల నీడలో
40 ఏండ్ల క్రితం కరువు, గత్తర వచ్చి జనం ఎంతో ఇబ్బందులు పడిన రోజులు. పని లేక కష్టాలు పడ్డ రోజులు. బాపుతో అమ్మ బాయిలు, సడాకులు (రోడ్లు) తవ్వేందుకు, మట్టి మోసేందుకు పోతుండే. ముదిరాజ్ హనుమంతు తాత బాయి తొవ్వినప్పుడు నేను రెండేండ్ల పిల్లగాన్నట. తుమ్మ చెట్టు కింద నీడ కింద పడుకోబెట్టి అమ్మ బాయి తవ్విరట. అమ్మ 2020 నవంబర్ 13న చనిపోయే ముందు చెబుతుండే. వాన పుష్కలంగా పడినప్పుడు తప్ప ఎకరం పొలంలో పంట పండింది లేదు. మా పొలం దగ్గరలోనే కాంచెరువు (కాశీమ్ చెరువు) ఉంది. అది నిండినాడు ఇంత పంట పండేది. బాయిలో నీళ్లు లేకపోవు. ఉంటే బాపుతో కలిసి అమ్మ యాతం పోసి మడికి నీళ్లు ఎత్తి పోసేది. బాపు 2004 జూన్ 24 చనిపోయిండు 18 ఏండ్లు అవుతుంది.
అమ్మ నాకు ఆత్మస్థయిర్యాన్ని నింపింది. నన్ను ఓదార్చి ధైర్యం నింపింది. కరోనా కన్న ముందు దాకా అమ్మ తన పనులు తాను చేసుకుంటూ, ఇంటి పనులు చేస్తుండే. కాలు జారి కింద పడి నడుముకు, కాలుకు బలమైన దెబ్బ తగలడంతో మంచాన పట్టింది. ఏడాదిన్నర కాలం అమ్మను చంటి బిడ్డ లెక్క చూసుకున్నం. అమ్మ మంచానే ఉండటం చూసి ఏడ్చిన సందర్బాలు. హైదరాబాద్‌లోని అన్న ఇంటిలో అమ్మ చనిపోయింది. ఊరిలో అంత్యక్రియలు చేయలేని పరిస్థితి. సుచిత్ర బ్యాంక్ కాలనీ శ్మశానవాటికలో కన్నీటి వీడ్కోలు పలికాం. అమ్మ మరువలేని యాది.
(నేడు మాతృ దినోత్సవం)
చిటుకుల మైసారెడ్డి
జర్నలిస్ట్, సిద్దిపేట
94905 24724