- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాట్రిక్ గెలుపు మోదమా, ఖేదమా?
భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశానికి వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆషామాషీ కాదు. గతంలో ఈ ఘనత సాధించిన ఏకైక ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. వారు 1952, 57, 62 ఎన్నికల్లో గెలిచి మూడు పర్యాయాలు ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.1962 తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నేతగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర దామోదర దాస్ మోడీ వినుతికెక్కనున్నారు.
భారత తొలి ప్రధాని నెహ్రూ తన మూడో పర్యాయ పదవీకాలం పూర్తి కాకుండానే గుండె పోటుతో మృతి చెందారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదలు తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా పని చేసిన కాలాన్ని కలుపుకుని చూస్తే ఇప్పటి వరకు దేశానికి అత్యధిక కాలం పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు ప్రధానిగా సేవలందించిన ఘనత నెహ్రూ కే దక్కుతుంది. ఆ తర్వాత వరుసలో వారి కుమార్తె, భారత దేశపు ఏకైక మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నిలిచారు. వీరిద్దరి తరువాతి స్థానంలో ఇప్పటికే నరేంద్ర మోడీ చేరి ఉన్నారు. ఇక ఇప్పుడు మూడోసారి చేపట్టబోయే పదవిలో వీరు పూర్తి కాలం కొనసాగితే మరో రికార్డు సొంతమవుతుంది అనడంలో సందేహం లేదు.
ఈ టర్మ్ పాలన సాఫీగా సాగేనా?
అయితే ఇక్కడే సవాలక్ష సందేహాలు. గత రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజేపీ ఎన్‌డీఏ కూటమి మిత్ర పక్షాల అవసరం లేకుండానే లోక్ సభలో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజారిటీని సాధించింది. అయితే అప్పుడు ఎవరి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సత్తా ఉండి, ప్రభుత్వ పరమైన నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటూ మిత్ర పక్షాల చేత ఒప్పింపజేస్తూ, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి కాల ప్రభుత్వాన్ని నడపగలిగింది. కానీ ఈసారి పరిస్థితి తారుమారై సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితి. కాబట్టి మిత్ర పక్షాల మీద ఆధారపడి ప్రభుత్వ ఏర్పాటు జరగబోతోంది. అందువల్ల గతంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలం నాటి పరిస్థితులు తలెత్తనున్నాయా? లేక సాఫీగా సాగుతుందా? లేదా అనేది చూడాలి.
అతడే ఒక సైన్యం..
దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అతడే ఒక సైన్యంగా నరేంద్ర మోడీ నడిపిస్తున్నారు. వారి నాయకత్వంలోనే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ గత రెండు పర్యాయాలు సాధించిన సీట్ల కంటే కూడా ఈసారి తక్కువ సీట్లు గెలవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజారిటీ సాధించలేకపోవడం, మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో గతంతో పోల్చుకుంటే మెజారిటీ తగ్గడం, అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రదేశమున్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీని ప్రజలు తిరస్కరించడం. గత ప్రభుత్వంలో మోడీ నాయకత్వం కింద పని చేసిన పదిహేడు మంది కేంద్ర మంత్రుల ఓటమి వంటివి నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ మీద రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రభావం చూపనున్నాయి.
ప్రజలకు కావాల్సింది అభివృద్ధి!
ఇప్పటి వరకు పార్టీలోను, ప్రభుత్వంలోను తిరుగులేని అధినేతగా చలామణి అవుతున్న మోడీ ప్రభ ఇక మీదట సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా సొంత పార్టీలో మోడీ నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లడం ఖాయం. అంతేగాక ఆయన ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రభుత్వాధినేతగా మిత్ర పక్షాల ఒత్తిడికి తలొగ్గి మునుపటిలా నిర్ణయాలు తీసుకోవడంలో దుందుడుకు స్వభావం ప్రదర్శించడం కూడా కుదరదు. అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను దేశం మొత్తం మీద రుద్దడానికి వీలు కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీ అలాగే వారి నాయకత్వంలో పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కానీ మతతత్వ అజెండా కాదని గుర్తెరిగితే పదికాలాలపాటు కొనసాగుతారు. లేకుంటే అనతి కాలంలో మరింత అధోగతి పాలవ్వక తప్పదు.
డా.సందెవేని తిరుపతి
98496 18116
- Tags
- modi 3.0