మరోకోణం: కేసీఆర్ కొత్త పార్టీ.. ఫ్రంటా? టెంటా?

by D.Markandeya |   ( Updated:2022-09-27 09:55:24.0  )
మరోకోణం: కేసీఆర్ కొత్త పార్టీ.. ఫ్రంటా? టెంటా?
X

కేసీఆర్ జాతీయ పార్టీ గురించిన చర్చ మరోమారు ఊపందుకుంది. దసరా రోజే కొత్త పార్టీకి అంకురార్పణ జరుగుతుందని గులాబీ బాస్ చెప్పినట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 11న హైదరాబాదుకు వచ్చిన ఆయన కేసీఆర్‌తో భేటీ అయి పలు విషయాలు చర్చించారు. అదే రోజు ప్రగతి భవన్ నుంచి వెలువడిన ప్రకటన కూడా కొత్త పార్టీ ఏర్పాటుపై మరింత స్పష్టతనిచ్చింది.

ఇప్పటికే మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాపై ఏకాభిప్రాయం సాధించగలిగామని ఆ ప్రకటనలో కేసీఆర్ తెలిపారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడం కొత్త పార్టీ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్‌లోనూ, టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చ జరిగి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. జిల్లా కార్యవర్గాలు, జిల్లాధ్యక్షుల మీటింగ్ సైతం ఇలాంటి తీర్మానాలే చేశాయి.

కీలక పాత్ర ఎవరిది?

అయితే, కొత్త పార్టీ రూపురేఖలు ఎలా ఉంటాయి? తెలంగాణ నేతలు కాకుండా ఇంకెవరు చేరతారు? జాతీయస్థాయిలో ఎవరు కీలక పాత్ర వహిస్తారు? ఇప్పటివరకూ కేసీఆర్ కలిసిన అందరు సీఎంలకూ, పార్టీల నేతలకూ తమకంటూ ఒక సొంత పార్టీ ఉన్న రీత్యా కొత్త పార్టీలో ఎందుకు చేరతారు? అది వివిధ ప్రాంతీయ పార్టీల ఫ్రంటుగా ఉంటుందా? లేదంటే ఆయా రాష్ట్రాలలోని వివిధ ప్రజాసంఘాల టెంటుగా ఉంటుందా? అన్న విషయంలో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి జాతీయ రాజకీయాలలోకి వెళ్లాలన్న ఆలోచన కేసీఆర్‌లో 2018 ఎన్నికలకు ముందే మొదలైంది.

ముందే వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం ప్రధాని మోడీని ఆశ్రయించి, ముందస్తుకు వెళ్లిన ఆయన గెలిచిన తర్వాత కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేసి తను ఢిల్లీ వెళ్లి జాతీయ రాజకీయాలలో నిమగ్నమవుతారని అప్పట్లో బలమైన వదంతులే వచ్చాయి. అప్పటిదాకా ఆయన ఒకటి రెండు సందర్భాలలో తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కాని, బీజేపీని కాని పల్లెత్తు మాట అనలేదు. కీలక బిల్లుల ఆమోదానికి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సహకరించారు. అందుకే 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఎన్డీయే సర్కారులో చేరతారని సైతం అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఏ కారణం చేతో అది జరగలేదు.

ఆ ఫలితం తర్వాతనే

రెండవ దఫా అధికారం చేపట్టిన తర్వాత కూడా కేసీఆర్ కేంద్రంతో సఖ్యంగానే ఉన్నారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. వారి పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. చరిత్ర క్రమాన్ని పరిశీలిస్తే, 2021 ఏప్రిల్ 30న టీఆర్ఎస్‌లో ఈటల సంక్షోభం బద్దలై, హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ భారీ విజయం పొందిన తర్వాత గులాబీ బాస్ క్రమంగా కేంద్రం పట్ల, మోడీ పట్ల, అధికార బీజేపీ పట్ల తన వైఖరిని మార్చుకుంటూ వచ్చారు. నవంబర్ రెండున హుజూరాబాద్ ఫలితం వెలువడగా, అదే నెల ఆరున వచ్చే యాసంగి నుంచి వడ్ల కొనుగోళ్లను తాము చేపట్టబోమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు.బీజేపీ నేతలకు దమ్ముంటే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి లెటర్ తేవాలని సవాలు విసిరారు.

మరుసటి రోజునే కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి మొట్టమొదటిసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. 'ఖబడ్దార్ బీజేపీ, దేశంలో అగ్గి పెడుతం' అంటూ హెచ్చరించారు. తెల్లవారి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరోసారి కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. వడ్ల కొనుగోలు అంశంపై ధర్నాలకు పిలుపునిచ్చారు. 17న ముచ్చటగా మూడోసారి విలేకరుల సమావేశం పెట్టి, 18న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఇక కేంద్రంపై యుద్ధమేనని, చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతానని ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.

క్రమక్రమంగా దాడిని పెంచి

ఇక అప్పటినుంచీ టీఆర్ఎస్ అధినేత వెనక్కి చూసిందే లేదు. వరస సమావేశాలలో, బహిరంగసభలలో కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నారు. ప్రధాని మోడీని అసమర్థుడని, అబద్ధాలకోరని, చేతకాని వాడని పరుష పదజాలంతో తులనాడుతున్నారు. 2022 జనవరి 8న సీపీఎం అగ్రనేత ఏచూరి, కేరళ సీఎం పినరయి, సీపీఐ నేతలు డి రాజా, చాడను వేర్వేరుగా కలిసి మోడీపై యుద్ధానికి మద్దతు కోరారు.

ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విమర్శిస్తూ మోడీది చెత్త ప్రభుత్వమని, బీజేపీకి వ్యతిరేకంగా తాను దేశమంతా తిరుగుతానని, విప్లవం తెస్తానని ప్రకటించారు. అదే నెల 13న నిర్వహించిన మీడియా సమావేశంలో మొట్టమొదటిసారి కేసీఆర్ కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. మోడీ పాలనలో దేశం సర్వనాశనం అయిపోతోందని, ప్రజల బతుకులలో మార్పు రావాలంటే ఫ్రంట్లతో, టెంట్లతో సాధ్యం కాదని, కొత్త రాజకీయ శక్తి ఉద్భవించాలని ప్రకటించారు.

నేతలను కలుసుకుంటూ

కేసీఆర్ కార్యాచరణ అప్పటి నుంచి వేగవంతమైంది. మొదట ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ (పీకే)ను కలిసి జాతీయపార్టీ ఏర్పాటు కోసం అనుసరించాల్సిన ప్రాథమిక వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్‌ను అనుయాయిగా చేర్చుకున్నారు. ఫిబ్రవరి 21న ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను కలుసుకున్నారు.

మార్చ్ నాలుగున జార్ఖండ్ వెళ్లి జేఎంఎం అధినేత శిబూసొరేన్, ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం హేమంత్ సొరేన్‌తో, మేలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్ సీఎం బల్వంత్ మాన్, మాజీ ప్రధాని దేవేగౌడ, తమిళ హీరో విజయ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు.అంతకుముందు 2021 డిసెంబరులోనే డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఈ ప్రముఖులందరితోనూ జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రత్యామ్నాయంపై తన ప్రతిపాదనలుంచారు.

బాధితులకు ఆర్థిక సాయమంటూ

ఇదే కాలంలో టీఆర్ఎస్‌లో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం గురించిన చర్చలు తీవ్రమయ్యాయి. 'దేశ్ కీ నేతా కేసీఆర్' అంటూ నేతలు నినదించడం ఆరంభించారు. కేసీఆర్ ప్రధాని కావాలంటూ సమ్మక్క తల్లికి మొక్కులు సమర్పించారు. దేశవ్యాప్తంగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జాతీయ, వివిధ భాషల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తెలంగాణ సాధించిన ఘనతపై ఫుల్ పేజీల యాడ్స్ ప్రచురితమయ్యాయి. రాకేశ్ తికాయత్‌ సహా ఇతర రైతు ఉద్యమ నేతలతో, రిటైర్ట్ సివిల్ సర్వీస్ అధికారులతో కేసీఆర్ సత్సంబంధాలు నెలకొల్పుకుని చర్చలు ప్రారంభించారు.

ఇందులో భాగంగానే సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు, గాల్వాన్ లోయ పోరులో అమరులైన సైనికులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆయా రాష్ట్రాలలో సభలు నిర్వహించి చెక్కులను అందజేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన పలువురు రైతు నాయకులు ఈమధ్యనే హైదరాబాదుకు వచ్చి కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపి వెళ్లారు.

ఇంతకీ ఎవరు చేరతారు?

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. అయితే, కేసీఆర్ పెట్టబోయే పార్టీలో రైతు నాయకులు, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు, ప్రకాశ్‌రాజ్, హీరో విజయ్ లాంటి సెలబ్రిటీలు మాత్రమే చేరతారా? లేక జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన వివిధ రాష్ట్రాల నేతలు కూడా చేరతారా? అనే విషయంలో ఎంత మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటివరకు గులాబీ బాస్ కలిసిన ప్రాంతీయపార్టీ అధినేతలలో ఎవరూ తాము తమ పార్టీని కొత్త పార్టీలో విలీనం చేస్తామని చెప్పలేదు.

బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పరచే జాతీయ ఫ్రంట్ గురించి మాత్రమే మాట్లాడారు. కాంగ్రెస్ లేకుండా అలాంటి ఫ్రంట్ అసాధ్యమని కూడా కొందరు తెగేసి చెప్పారు. ఒక్క కుమారస్వామి తప్ప కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అలాంటివాళ్లు తమ పార్టీలను కొత్త పార్టీలో విలీనం చేయడం అసాధ్యం.

దీంతో ప్రయోజనమేమిటి?

ఈ పరిస్థితులలో కేసీఆర్ కొత్త పార్టీ డీఎంకే, ఏఐడీఎంకే లాగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలకు లేదంటే ఎస్పీ, తృణమూల్‌లాగా దేశంలో కొన్ని రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమై నామమాత్రపు ఉనికిని చాటుకోవడం మాత్రమే జరుగుతుంది. ఇందువల్ల ఆయనకు చేకూరే ప్రయోజనాలు కొన్నున్నాయి. జాతీయపార్టీ పెట్టానని, మోడీ దుష్టపాలనకు తానే ప్రత్యామ్నాయమని, తనను ఆశీర్వదించాలని తెలంగాణ ఓటర్లకు చెప్పి వచ్చే శాసనసభ ఎన్నికలలో గెలిచేందుకు ఉపయోగించుకోవచ్చు.

బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ అంటూ కొత్త పార్టీ ముసుగులో దేశమంతా తిరిగి యూపీఏ నుంచో లేక ఎన్డీయే నుంచో కొన్ని చిన్న పార్టీలను దూరం చేయవచ్చు. రెండు కూటములకు సమదూరంలో ఉండవచ్చు. యూపీఏను వీక్ చేస్తే ఎన్డీయే నుంచి, ఎన్డీయేను వీక్ చేస్తే యూపీఏ నుంచి క్విడ్ ప్రో క్వో (ఇచ్చుకో పుచ్చుకో) పొందవచ్చు.

అలా జరుగుతుందా?

ఊసరవెల్లిలా రంగులు మార్చే స్వభావానికి కేసీఆర్ ప్రసిద్ధుడని మనందరికీ తెలుసు. ఉద్యమకాలంలోనూ ఆయన ఎన్నోసార్లు తన ఎత్తుగడలు మార్చారు. ఒకసారి కాంగ్రెస్‌తో, మరోసారి టీడీపీతో జతకట్టారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానని చెప్పి చేయిచ్చారు. అలాంటి కేసీఆర్ పది నెలల క్రితం అకస్మాత్తుగా బీజేపీపై యుద్ధం ప్రకటించారంటే, కాంగ్రెస్‌ను కూడా అంతే దూరంలో పెడుతున్నారంటే దాని వెనకాల తప్పనిసరిగా ఏదో ఎత్తుగడ దాగి ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకు లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి కనుక ఢిల్లీలో ఏ కూటమికి మెజారిటీ వస్తే, ఆ కూటమిలోనే చేరే వెసులుబాటు కేసీఆర్‌కు దొరుకుతుంది. ఎన్డీయే సర్కారు వచ్చినా, యూపీఏ పగ్గాలు చేపట్టినా కుమారుడు కేటీఆర్‌ను తెలంగాణకు సీఎం చేసి, తాను కేంద్ర కేబినెట్‌లో చేరవచ్చు. ఎలా చూసినా కేసీఆర్‌కు డబుల్ ధమాకేనా?

డి. మార్కండేయ

[email protected]

Advertisement

Next Story

Most Viewed