టి-కాంగ్రెస్ కథ కంచికేనా!

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:17:34.0  )
టి-కాంగ్రెస్ కథ కంచికేనా!
X

నిజానికి రేవంత్ అధ్యక్షుడైన తర్వాత వెంటిలేటర్‌పై పడుకున్న టి-కాంగ్రెస్ లేచి కూర్చుందనుకుంటే, జాతీయస్థాయిలో ఆ పార్టీ ప్రస్తుతం అంతకంటే ఘోరమైన దీనావస్థలో ఉంది. అనారోగ్యం కారణంగా 2017లో సోనియా పదవి నుంచి తప్పుకుని తనయుడు రాహుల్‌గాంధీకి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. 2019 సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యాక, కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయిన రాహుల్ యుద్ధరంగానికి వెన్ను చూపి పరారయ్యారు. ఇప్పటికీ సైన్యాధిపత్యాన్ని స్వీకరించలేని అపరిపక్వతలో ఉన్నారు.

వేయి జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ లేవలేకుండా ఉందన్న స్థితిని గ్రహించే తృణమూల్ అధినేత మమతా బెనర్జీ బీజేపీయేతర, కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించారు. శరద్‌పవార్, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాకరే తదితర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో పక్కన పెడితే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మమతతో చేతులు కలపడానికి ఆసక్తిగా ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలువడం వెనకాల ఈ వ్యూహమే దాగి వుందంటున్నారు. ఒకవేళ మమత ఫ్రంట్‌లో స్థానం దొరక్కపోతే యూపీఏలో చేరే ఆప్షన్ కూడా ఉండనే వుంటుంది.

రాష్ట్రాల హక్కులను హరించే మోడీ పాలన అంతం పేరుతో కేసీఆర్ కమలనాథులపై ఆలౌట్ వార్ ప్రకటించి ఎన్నికలకు వెళితే అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధానపోరు జరుగుతుంది. కాంగ్రెస్ అనివార్యంగా అధికార పార్టీకి తోక పార్టీగానే మిగిలిపోతుంది. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 35-45 సీట్లు వస్తాయనుకుంటే, కాంగ్రెస్, బీజేపీకి చెరో 25-35 సీట్లు వచ్చిన పక్షంలో చివరకు అనివార్యంగా కాంగ్రెస్ కేసీఆర్‌కు బేషరతు మద్దతు ప్రకటించక తప్పని స్థితి ఉంటుంది. అందుకు ఆ పార్టీ సిద్ధపడకపోతే బీజేపీతో జట్టుకట్టే స్వేచ్ఛ, వెసులుబాటు కేసీఆర్‌కు ఉంటుంది. రేవంత్‌కు ఇష్టమున్నా లేకపోయినా జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాల దృష్ట్యా హైకమాండ్ ఆదేశాలను పాటించకతప్పదు.


ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడుతుందని, దినదినం పుంజుకుంటున్న కమలనాథులను వెనక్కి నెట్టేసి టీఆర్ఎస్ పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతుందని చాలా మంది ఆశించారు. ఆయన అధ్యక్షుడైన కొత్తలో రాజకీయ వాతావరణం అలాగే కనిపించింది. ప్రతి నిత్యం రేవంత్ ఇంటికి వేలాది మంది చేరుకోవడం, కాబోయే సీఎం అంటూ నినదించడం, కాస్త లేట్‌గా అయినా సీనియర్లు దారికి రావడం, తామంతా కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తామని ప్రకటించడం పార్టీ శ్రేణులలో జోష్‌ను నింపింది. ఇతర పార్టీలలో చేరిన కొందరు జిల్లాస్థాయి నేతలు సొంత గూటికి తిరిగిరావడం కూడా సానుకూల సంకేతాలను వెలువరించింది. ప్రారంభంలోనే దళిత, ఆదివాసీ దండోరా చేపట్టడం, నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తడం, తరచూ కేసీఆర్ పాలనపై తనదైన శైలిలో సంచలన ఆరోపణలు చేయడం ద్వారా రేవంత్ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనకు పార్టీ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ఫ్రీహ్యాండ్ ఇచ్చిందనే టాక్ ఢిల్లీవర్గాల నుంచి వినవచ్చింది.

చల్లారిన పొంగులా

అయితే, ఇదంతా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. దారిలోకి వచ్చారనుకున్న సీనియర్లు రోజుకొకరు నేరుగా రేవంత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకు కోవర్ట్ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే నాశనమేనంటున్నారు. హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఈ దాడి మరింత తీవ్రమైంది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్, ఉత్తమ్, దామోదర, మధుయాష్కీ, భట్టి ఇలా సీనియర్ నేతలందరూ రేవంత్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. డీసీసీలను మారుస్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లాస్థాయి నేతలు కూడా అసమ్మతి స్వరమే అందుకున్నారు. అన్ని జిల్లాలలో జరగాల్సిన నిరుద్యోగ జంగ్ సైరన్ సభలకు అతీగతీ లేకుండాపోయింది. ఆందోళనలు, ఉద్యమాలకు బ్రేక్ పడింది. ఇతర పార్టీల నుంచి రావాల్సిన ఛోటా బడా నేతలు డోలాయమానంలో పడ్డారు. శ్రేణులలో కూడా ప్రారంభంలో ఉన్న ఉత్సాహం కొరవడింది. స్వయంగా రేవంత్‌ కూడా నీరుగారిపోయిన చందంగానే వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన ఒక్క నేతపై ఇప్పటివరకు చర్య తీసుకోలేకపోయారు. వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు.

నీరసపడిపోయి

ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తున్నదే తప్ప రంగంలోకి దిగడం లేదు. డబ్బులు తీసుకుని రేవంత్ నియామకానికి సహకరించారని స్వయానా తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై ఆరోపణలు చేసినవారిని కూడా పట్టించుకున్న నాథుడు లేడు. రేవంత్ డైనమిజం గురించి తెలుసుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ చొరవతోనే పిసీసీ పగ్గాలు అప్పగించారంటూ అప్పట్లో వచ్చిన వార్తలు ఎంతవరకు నిజమోకానీ, ఇప్పుడు మాత్రం ఆయన కేంద్రంలో, రాష్ట్రంలో ఒంటరిగానే మిగిలిపోయారు. కేసీ వేణుగోపాల్, కొప్పుల రాజువంటి ఢిల్లీ నేతలు కూడా రేవంత్ అంటే పెదవి విరుస్తున్నారని, అసంతృప్త నేతలకు ఊతమిస్తున్నారని సమాచారం. ఆ మధ్య హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌజ్‌లో నిర్వహించిన రహస్య సమావేశంలో వైఎస్సార్ ఆత్మగా పేరుబడిన ఓ ఎంపీ రేవంత్ వ్యతిరేక వర్గీయులను ఏకం చేయడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీని ఉమ్మడి శత్రువుగా భావించి కేసీఆర్‌తో సఖ్యంగా ఉండడమే ప్రస్తుత పరిస్థితులలో శ్రేయస్కరమని వీళ్లు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేయబోతున్నారని వినికిడి. ఇలాంటి విపత్కర పరిణామాల నేపథ్యంలో రేవంత్ తీవ్ర నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్నారని గాంధీభవన్ వర్గాల భోగట్టా.

నాయత్వ లేమి

నిజానికి రేవంత్ అధ్యక్షుడైన తర్వాత వెంటిలేటర్‌పై పడుకున్న టీ-కాంగ్రెస్ లేచి కూర్చుందనుకుంటే, జాతీయస్థాయిలో ఆ పార్టీ ప్రస్తుతం అంతకంటే ఘోరమైన దీనావస్థలో ఉంది. అనారోగ్యం కారణంగా 2017లో సోనియా పదవి నుంచి తప్పుకుని తనయుడు రాహుల్‌గాంధీకి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. 2019 సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యాక, కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయిన రాహుల్ యుద్ధరంగానికి వెన్ను చూపి పరారయ్యారు. ఇప్పటికీ సైన్యాధిపత్యాన్ని స్వీకరించలేని అపరిపక్వతలో ఉన్నారు. గత్యంతరం లేని స్థితిలో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా మళ్లీ సారథ్యాన్ని స్వీకరించాల్సివచ్చింది. ఈ బలహీనతలే బలంగా గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, వీరప్పమొయిలీ, ఆనంద్‌శర్మ వంటి నేతలు జీ-23గా ఏర్పడి గాంధీ కుటుంబంపై ధిక్కారస్వరం వినిపించారు. అంతర్గత కుమ్ములాటలు, అధినాయకత్వం అసమర్థత, తప్పుడు వ్యూహం-ఎత్తుగడల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలలో ఆ పార్టీ భారీగా నష్టపోయింది. గెలుచుకున్న మధ్యప్రదేశ్‌ను కోల్పోయింది. అధికారంలో ఉన్న రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో సైతం రోజురోజుకూ అసమ్మతి పెరిగిపోతోంది. తెలంగాణ ఇచ్చి కూడా తెలంగాణ ప్రజల ఓట్లను పొందడంలో ఘోరంగా విఫలం కావడం మన ముందున్న కఠోర వాస్తవం. 2014ను వదిలేసినా, అధికారం ముంగిట్లోకి వచ్చిందన్న స్థితిలో తప్పుడు అలయెన్స్‌లు, కోవర్ట్ నేతల కారణంగా 2018 ముందస్తు ఎన్నికలలో అవమానకరంగా ఓటమి పాలైంది. ఈ పరిస్థితులన్నింటికీ జాతీయ కాంగ్రెస్‌లో నెలకొన్న నాయకత్వ సంక్షోభమే కారణమనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అందుకే పక్కచూపులు

వేయి జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ లేవలేకుండా ఉందన్న స్థితిని గ్రహించే తృణమూల్ అధినేత మమతా బెనర్జీ బీజేపీయేతర, కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించారు. శరద్‌పవార్, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాకరే తదితర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో పక్కన పెడితే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మమతతో చేతులు కలపడానికి ఆసక్తిగా ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలువడం వెనకాల ఈ వ్యూహమే దాగి వుందంటున్నారు. ఒకవేళ మమత ఫ్రంట్‌లో స్థానం దొరక్కపోతే యూపీఏలో చేరే ఆప్షన్ కూడా టీఆర్ఎస్‌కు ఉండనే వుంటుంది. ఈ విషయాన్ని సైతం సోనియాకు సన్నిహితంగా వుండే స్టాలిన్‌తో కేసీఆర్ చర్చించే వుంటారని చెన్నయ్ వర్గాల సమాచారం.

కలలు కల్లలేనా?

ఈ రెండింటిలో ఏది జరిగినా టి-కాంగ్రెస్‌కు, ప్రత్యేకించి రేవంత్‌రెడ్డికి అశనిపాతమే అవుతుంది. రాష్ట్రాల హక్కులను హరించే మోడీ పాలన అంతం పేరుతో కేసీఆర్ కమలనాథులపై ఆలౌట్ వార్ ప్రకటించి ఎన్నికలకు వెళితే అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధానపోరు జరుగుతుంది. కాంగ్రెస్ అనివార్యంగా అధికార పార్టీకి తోక పార్టీగానే మిగిలిపోతుంది. కేసీఆర్-మోడీ మధ్య నెలకొన్న సందేహాస్పద, రహస్య సంబంధాలను బహిర్గతం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాలన్న రేవంత్ కలలు కల్లలవుతాయి. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 35-45 సీట్లు వస్తాయనుకుంటే, కాంగ్రెస్, బీజేపీకి చెరో 25-35 సీట్లు వచ్చిన పక్షంలో చివరకు అనివార్యంగా కాంగ్రెస్ కేసీఆర్‌కు బేషరతు మద్దతు ప్రకటించక తప్పనిస్థితి ఉంటుంది. అందుకు ఆ పార్టీ సిద్ధపడకపోతే బీజేపీతో జట్టుకట్టే స్వేచ్ఛ, వెసులుబాటు కేసీఆర్‌కు ఉంటుంది. రేవంత్‌కు ఇష్టమున్నా లేకపోయినా జాతీయస్థాయి రాజకీయ సమీకరణాల దృష్ట్యా హైకమాండ్ ఆదేశాలను పాటించకతప్పదు.

కోరిక తీరాలంటే

ప్రస్తుతం రేవంత్ కోరుకోవాల్సింది ఒక్కటే. కేసీఆర్ ఏ కారణం వల్లనైనా తన బీజేపీ వ్యతిరేక వైఖరి విడనాడి ఆ పార్టీతో యథాతథ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని. మళ్లీ కాంగ్రెస్ పార్టీని శత్రువుగా గుర్తించాలని. అప్పుడే ఆయన టార్గెట్-2023 కల సాకారమవుతుంది. లేదంటే తనే అవతలి పక్షంలో చేరాలి. సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుంది? కేసీఆర్ చివరికంటా బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారా? మోడీ-షా ద్వయంతో రాజీపడతారా? కేంద్ర పార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ను రేవంత్ కనీసం వంద జాకీలైనా పెట్టి లేపుతారా? లేక అధిష్టానం ఒత్తిళ్లను, సీనియర్ల చికాకులను తట్టుకోలేక కమలనాథులను ఆశ్రయించి కేసీఆర్‌పై సమరశంఖం పూరిస్తారా? చూడాల్సిందే.

డి మార్కండేయ

Advertisement

Next Story