మార్కులే జీవిత కొలమానం కాదు

by Ravi |   ( Updated:2022-09-03 16:31:03.0  )
మార్కులే జీవిత కొలమానం కాదు
X

ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించిన వారేంకాదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. పిల్లల మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావించడం తప్పు. విద్యా సంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తేకూడదు. జీవితాన్ని నడిపించేది చదువొక్కటే కాదు.

తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాల వెల్లడిలో నెలకొన్న జాప్యం వలన పలు కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే. బుడిబుడి అడుగుల నుంచి వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ, వారి బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది తల్లిదండ్రులే. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్టు విలవిలలాడేది తల్లిదండ్రులే. మరి పిల్లలు చేస్తున్నది ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కన్నవారికి దైర్యంగా ఉండాల్సిన తరుణంలో తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మరి తల్లిదండ్రులు కూడా అంతగా ప్రేమించే వారిపై మార్కుల ఒత్తిడి తేవడం సమంజసమేనా? కొద్దిగా ఆలోచించండి.

వారికి ధైర్యం చెప్పాలి

ఇంటర్‌ ఫెయిల్‌ అయినప్పటికీ విద్యార్థులకు సప్లిమెంటరీ రూపంలో మరో అవకాశం ఉంటుంది. అది రాసి మళ్లీ పాస్‌ కావచ్చు. ఉన్నత విద్యకు అర్హత పొందవచ్చు. ఫెయిల్ అయ్యావని చులకనగా చూసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించవచ్చు. అదేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు మనోవేదనకు లోనవుతున్నారు. పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, వారిని ఒత్తిడికి గురి చేయడం వలన వారు క్షణికావేశానికి గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిపై ఎంతో విద్యాపరమైన ఒత్తిడి ఉందనేది అక్షర సత్యం.

తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోరుకునేవారైతే ఇలాంటి సమయంలో వారికి అండగా ఉండాలి. ధైర్యం చెప్పాలి. పరుష పదజాలంతో దూషించ వద్దు. పిల్లల స్నేహాలు, విద్యాలయాలలో వారి ప్రవర్తన, చదువు తీరును తరచూ పరిశీలించాలి. చదువు తమ వంశ ప్రతిష్ట అంటూ గర్వాలకు పోకుండా పిల్లల పట్ల సానుకూలంగా ఉండాలి. వారిని మార్కులే ధ్యేయంగా పెంచకూడదు. తొంబై శాతం మార్కులు వచ్చినవారు ఎంత ప్రతిభావంతులో నలభై శాతం మార్కులు వచ్చినవారు అంతే ప్రతిభావంతులనే విషయాన్ని పిల్లలకు అర్థం చేయించాలి.

విజ్ఞానమే ముఖ్యం

ఒకసారి పరీక్షలో తప్పితే జీవితం నష్టపోదనే భరోసా ఇవ్వాలి. మళ్లీ చదివి పాస్ కావచ్చనే ధైర్యం ఇవ్వాలి. పాస్ కాలేదని తిట్టకుండా, వేధించకుండా, సముదాయించాలి. తిరిగి మంచిగా చదివి పాసయ్యేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు కూడా క్షణికావేశానికి లోనుకాకుండా సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులు, సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులతో చర్చించాలి. 'మార్కులు కాదు విజ్ఞానం ముఖ్యమనే' విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ఫలితాలు వచ్చే సమయంలో, వచ్చాక ఓ కన్నేసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు.

ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించిన వారేంకాదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. పిల్లల మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావించడం తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తేకూడదు. జీవితాన్ని నడిపించేది చదువొక్కటే కాదు. విద్యార్థులు అధైర్యపడితే తల్లిదండ్రులకు బాధ కలిగించినవాళ్లవుతారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగినవారే ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు.

డా. అట్ల శ్రీనివాస్‌‌ రెడ్డి

ARPP, జాతీయ అధ్యక్షుడు

97039 35321

Advertisement

Next Story

Most Viewed