ఎందరో గొప్ప నటులు.. ఉత్త నటులేనా?

by Satheesh |   ( Updated:2023-09-08 23:30:57.0  )
ఎందరో గొప్ప నటులు.. ఉత్త నటులేనా?
X

తెలుగు చలన చిత్ర చరిత్రలో ఈ రెండు సినిమాలు గర్వించదగ్గ సినిమాలు. గర్వించుదాం.... గట్టిగానే గర్వించుదాం.... ఎందుకంటే సమాజానికి చక్కటి సందేశాన్నిచ్చిన సినిమాలు. జాతిని జాగృతం చేసిన సినిమాలు. అందుకే మరి...తగ్గేదిలే అని హీరో మేనరిజాన్ని ప్రదర్శిస్తూ డిజే సౌండ్లతో రచ్చ రచ్చ చేద్దాం....! వీళ్ళకు మించిన సినిమాలు ఇంతకు ముందెన్నడూ రాలేదని ఘంటాపథంగా గాండ్రించుదాం....!

ఏం విలువలున్నాయని అవార్డులు?

ఇంత గొప్ప సినిమాలు మనమెప్పుడూ చూసుండం. ఇంతకంటే గొప్ప నటులు ఇంతకు ముందెన్నడూ మనకు కనిపించి ఉండరు. 69 ఏళ్లలో ఏ తెలుగు నటుడూ జాతీయ ఉత్తమ నటుడు కాలేక పోయాడంటే.. అంతా ఉత్త నటులనే కదా.. చరిత్రను వక్రీకరించి తీసిన సినిమాకు ఏకంగా ఆస్కార్‌కు అవకాశం లభించిందంటే.... ఆరు జాతీయ పురస్కారాలు అందుకున్నదంటే.... విస్తుపోకుండా ఎవరుంటారు చెప్పండి. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు సినిమాను తీసిన నటశేఖరుడికి ఏ అవార్డూ లభించలేదు. అదే అల్లూరి సీతారామరాజును ఒక కోవర్టుగా చూపించి అల్లూరి సీతారామరాజును అవమానపరిచిన సినిమాకు మాత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు ఇదెక్కడి విడ్డూరం.

స్వీయ దర్శకత్వంలో త్రిపాత్రాభినయంతో కేవలం 43 రోజుల్లోనే సినిమాను తీసి ఎన్నో రికార్డులను సొంతం చేసుకొని భారతీయ చలన చిత్ర రంగాన్ని ఔరా అనిపించిన నందమూరి తారక రామారావు గారు ఉత్త నటుడుగానే అగుపించారు పాపం...! కానీ కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగల్ని దొంగతనంగా ప్రభుత్వం కళ్ళు గప్పి ఎలా సరిహద్దు రాష్ట్రాలకు దాటించాలో, ఎలా జాతి సంపదను దోచుకోవాలో తీసిన సినిమాకు మటుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు… జాతి విస్తుపోకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే..‌‌... మింగ లేక కక్కినట్లుగా నేనిప్పుడు గర్వించలేక గర్హిస్తున్నాను. ఈ సినిమాలో సమాజాన్ని చైతన్యపరిచే అంశాలున్నాయా... సామాజిక విలువలున్నాయా? మానవతా విలువలున్నాయా? జాతీయ భావాలున్నాయా? దేశ సమగ్రతను చాటే అంశాలు ఏమైనా ఉన్నాయా? సంస్కృతి సంప్రదాయాలు మేళవించిన అంశాలేమైనా ఉన్నాయా? మరెందుకిచ్చినట్లు జాతీయ ఉత్తమ నటుడు...

జనాన్ని చైతన్యపరిచిన ఎన్నో సినిమాలు!

అతను గొప్ప నటుడే కావొచ్చు కాదనను. ఎంచుకున్న సినిమానే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ సినిమాలో హీరో దగ్గర నుండీ విలన్ వరకూ అందరూ స్మగ్లర్లే...! ఇదేనా ఈ సినిమా ఇచ్చే సందేశం. సినిమాలు సమాజాన్ని జాగృతం చేసే మాధ్యమాలు. సామాజిక స్పృహతో వచ్చిన ఎన్నో వందల సినిమాలు ఈ నేలన ఏడాది కాలం పాటు ఆడి జనాన్ని చైతన్య పరిచాయి. నేటికీ ఆ సినిమాలు జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయాయి. సినిమాలంటే అవి..! వాటికి ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవు. SVR, NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, జగ్గయ్య, చంద్రమోహన్, మోహన్ బాబు,రాజనాల, ధూళిపాళ, గుమ్మడి, సత్యనారాయణ, రావు గోపాలరావు, కోట, సావిత్రి, జమున, వాణిశ్రీ, భానుమతి, జయసుధ, జయప్రద, శ్రీదేవి, భానుప్రియ... ఇలా ఎందరో ఇంకెందరో మహా మహా నటీ నటులుండగా 69 ఏళ్లలో ఏ ఒక్కరికి జాతీయ అవార్డు రాలేదంటే సినిమా ప్రియుడిగా సిగ్గుపడుతున్నాను. RRR, పుష్ప, ఉప్పెన... ఈ మూడు సినిమాలకు అవార్డులు రావడంలో ఉన్న మతలబు తెలుగు ప్రేక్షకులకు అర్థం కాకుండా ఉంటుందా? అమ్మా తెలుగు చలన చిత్ర కళామతల్లీ.. ఇక నిన్ను నీవే కాపాడుకో..!

(ఇక్కడ ఏ నటుడ్ని విమర్శ చేయడం లేదు. ఎంచుకున్న సినిమాలే విమర్శలకు గురవుతున్నాయి)

-అమృతవర్షిణి జయరాజ్

Advertisement

Next Story