సర్వైవల్ థ్రిల్లర్…మంజుమల్ బాయ్స్

by Ravi |   ( Updated:2024-04-28 00:45:48.0  )
సర్వైవల్  థ్రిల్లర్…మంజుమల్ బాయ్స్
X

‘మంజుమ్మల్ బాయ్స్’ మలయాళీ అనువాద చిత్రం. అక్కడ 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. తెలుగులోనూ విడుదలై మంచి టాక్‌నే సంపాదించుకుంది. ప్రాణాంతకమైన గుహలోకి అడుగుపెట్టిన ఓ మిత్రబృందం ఎలాంటి విపత్కర స్థితుల్లో ఇరుక్కుని బయటపడిందన్నదే ఈ సినిమా కథ.

కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్ (షాబిన్ షాహీర్) సుభాష్ (శ్రీనాథ్ భాషి) వీరి స్నేహితులు సొంత గ్రామంలోనే చిన్నాచితక ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ బృందానికి ‘మంజుమ్మల్ బాయ్స్’ అనే అసోసియేషన్ ఉంటుంది. వీరంతా ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌కి వెళ్తారు. తొలుత సుభాష్ ప్రయాణానికి సుముఖత చూపడు. చివరి నిముషంలో వెడతాడు. బృందమంతా కొడైకెనాల్‌లోని అందమైన ప్రదేశాలను చూస్తూ గుణ కేవ్స్‌కి వస్తారు. ఇవి ఎంత రమణీయమో అంత ప్రమాదకరం. వందల అడుగుల లోతు లోయలు కూడా ఉంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ ఒకటి. 150 అడుగుల లోతున లోయ ఇది. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు శాఖ అక్కడ కాపలా ఉంచుతుంది. గతంలో 13 మంది ఇందులో పడి ప్రాణాలతో తిరిగి రాలేదని వారికి తెలియదు. కుట్టన్ బృందం వారి కళ్ళుగప్పి లోపలికి వెళ్తారు. కొంత సేపు వారంతా సరదాగా గడుపుతారు. అనుకోకుండా సుభాష్ అక్కడే ఉన్న డెవిల్స్ కిచెన్ లోయలోకి జారిపడతాడు. అతనిని కాపాడుకునేందుకు స్నేహితులు ఏం చేశారు. అతడు బ్రతికి బయటపడ్డాడా… పోలీసులు, స్థానికులు ఎందుకు వారికి సహకరించలేదు. చివరికి స్నేహితుని కాపాడుకునేందుకు ‘కుట్టన్’ లోయలోకి ఎందుకు వెళ్ళాడు. లోయలో వారికి ఎదురైన సంఘటనలేమిటి, ముగింపు సుఖాంతమా… దుఃఖాంతమా.. అనేది తెరమీద చూడాలి.

చిత్ర విశేషాలు

‘మంజుమ్మల్ బాయ్స్’ ఓ యదార్థ గాథ. 2006లో గుణ కేన్స్ లో చిక్కుకున్న తన మిత్రుని రక్షించుకునేందుకు ఎర్నాకులం ‘మంజుమ్మల్ బాయ్స్’ చేసిన సాహసానికి తెర రూపం. ఈ చిత్రం దర్శకుడు చిదంబరం కథను సహజంగానే చిత్రించాడు. మలయాళీ సినిమాల్లో నెరేషన్ స్లోగా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ చిత్రానికి ఈ అపవాదు తప్పదు. అయితే, సినిమా చూస్తున్నంత సేపు ఆ ఇరుకు లోయలో… కటిక చీకట్ల మధ్య ప్రేక్షకులు కూడా ‘పాత్రలు’గా ఫీల్ అవుతారు. అంతగా దర్శకుడు ఉత్కంఠభరితంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. నెమ్మదిగా మొదలైన కథ ఆ తర్వాత వేగమందుకొంటుంది. వీరి’ అల్లరి బాగానే అలరిస్తుంది. ‘గుణకేవ్స్’ చూడాలనుకున్న తర్వాతనే కథ మలుపు తిరుగుతుంది. ఇక సుభాష్ డెవిల్స్ కిచెన్‌లో పడిన తర్వాత నుంచి కథ మరి బిగుతుగా ‘టెన్షన్’ క్రియేట్ చేస్తుంది. సుభాష్ ఎలా బయటపడతాడు అన్న ఆసక్తి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

ఇంటర్వెల్ తర్వాత ఈ సర్వైవల్ డ్రామాతోనే ముందుకు వెళుతుంది. డ్రామా కోసం దర్శకుడు సీన్లు రాసుకోలేదు. సన్నివేశాలలో డ్రామా సహజంగా కనిపిస్తుంది. మిత్రుడ్ని కాపాడేందుకు మిగిలిన స్నేహితుల పడే ఆరాటం, తపన ప్రేక్షకుల్ని మురిపిస్తాయి. సుభాష్‌ను రక్షించేందుకు ముందుకు రాని పోలీసులు, స్థానికుల స్పందనను దర్శకుడు చిదంబరం సహజంగా చిత్రిస్తాడు. ఇదే సందర్భంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కథకు అవసరమైన ఎమోషన్స్‌ను అందిస్తాడు దర్శకుడు. ఇవి చిత్ర ముగింపుకి బలంగా సహకరించాయని చెప్పవచ్చు. ముగింపు అందరి హృదయాలను బరువుగా హత్తుకుంటుంది.

అలరించిన సంగీతం, దృశ్యీకరణ

సాంకేతికంగా… దర్శకుడు తన పాత్రను నిజాయితీగా నిర్వర్తించాడు. కథను నిజాయితీగా చూపించాడు. సినిమాలో వేగం లేకపోయినా .. ఉత్కంఠతకు లోటు లేకుండా చేశాడు. సినిమాకు ప్రధాన ఆకర్షణ షైజు ఖలీద్ తన కెమెరాతో చక్కగా దృశ్యాలను చిత్రించాడు. కొడైకెనాల్ అందాలు, ‘గుణకేవ్స్’ వంటి అతడిలోని పనితనానికి ప్రతీకలు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా కనిపిస్తుంది. అనువాద చిత్రం అనిపించే వాతావరణం కనపడదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువచ్చారు.

చిత్రం: మంజుమ్మల్ బాయ్స్

నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, జార్జి మరియన్ తదితరులు.

దర్శకత్వం: చిదంబరం

నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్

ఓటీటీ: హాట్ స్టార్ (మే 3న)


-భమిడిపాటి గౌరీ శంకర్,

94928 58395

Advertisement

Next Story

Most Viewed