- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమాఫీతో ... రైతులంతా సాఫీ...!
రాష్ట్రంలో నేడు ప్రధానంగా రైతుల్లో వ్యవసాయ రుణమాఫీ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది.. ఎప్పుడెప్పుడు రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఒకేసారి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవమే... అదే సమయంలో రైతు రుణమాఫీలో కొన్ని లోటుపాట్లు ఉన్నది కూడా వాస్తవమే... ఉద్యోగులకు, టాక్స్ పేయర్స్‌కి, భూస్వాములకు, ఎమ్మెల్యే, ఎంపీలు తదితరులకు రుణమాఫీని ప్రభుత్వం రద్దు చేయడం సమంజసమే.. ఐదెకరాల నిబంధన పెట్టడం కరెక్టే. కానీ పనిలో పనిగా రేషన్ కార్డు.. పట్టాదారు పాసుపుస్తకం ఉండాలని సాంకేతిక కారణాలు చూపడం సమంజసం కాదు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులను ఇంకా జారీ చేయలేదు. మరి రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి అంటే చాలా మంది అన్యాయమైపోతారని ప్రభుత్వం గుర్తించాలి.
ఎవరైనా మంచిపని చేస్తే ఆ రుణం తీర్చలేనిదని అంటాం. అరచేతిలో కూర పెడితే ఆరు నెలలు గుర్తు ఉంటుందని అంటారు.. కూరకే ఆరునెలలు గుర్తు పెట్టుకుంటే... అధికారం అనే మహావకాశం ఇచ్చిన రైతుల రుణమాఫీ 66 లక్షల నుంచి 26 లక్షలకు కుదించాలనుకోవటం.. అసమంజసమా కాదా? రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకాలు అనే అడ్డంకులు పెట్టాలనుకుంటే ఎలా? రుణమాఫీ చేస్తారనే ఆశతో.. సగానికి సగం తగ్గిస్తారనే భయంతో... రుణమాఫీ కోసం అన్నదాతలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం రుణమాఫీ కోసం అధికారులతో రివ్యూ మీటింగులకన్నా... నేరుగా ప్రజలనుంచే ప్రతిస్పందన తెలుసుకోవడం మంచిది.. ఎన్నికల ప్రచారంలో అధికారానికి వచ్చే నెల రోజుల ముందు వరకు కాంగ్రెస్ ఈ రోజే రుణం తీసుకోండి అధికారానికి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని అరుగ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది.
రేషన్ కార్డు కండిషన్ పెడితే డేంజర్!
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలే కాకుండా రాష్ట్ర ప్రజలకు 130కి పైగా హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ప్రజల్లో ఆశలు రికేత్తించింది. ఆరు నెలలైనా మోక్షం లేకపోవటంతో... ప్రజలు ఆలోచనలో పడ్డారు... అందుకు ప్రభుత్వం ఎన్నికలు రావడం వంటి కారణాలు చెబుతోంది. ప్రభుత్వ వాదనను అంగీకరించవచ్చు. కానీ రేషన్ కార్డు.. పట్టాదారు పాసుపుస్తకం ఉండాలని సవాలక్ష సాంకేతిక కారణాలు చూపడం సమంజసం కాదు. పేదరికమే ప్రధాన నిబంధనగా ఐదు ఎకరాల భూమి క్రైటీరియాగా తీసుకుని రుణమాఫీ చేయాలని రైతులు ముక్తకంఠంతో ముఖ్యమంత్రిని కోరుతున్నారు. కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నోళ్లకే ఇస్తామనడం రైతు వ్యతిరేక చర్య అవుతుంది. పెడితే ఐదు ఎకరాలు నిబంధన పెట్టండి. దానితో పేదరికమే గీటురాయిగా ఉంటుంది. ఇంకా ఏ నిబంధనలూ అవసరం లేదు.
పేదరికం ఆధారంగా పెట్టొచ్చు..
రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకొని ఆరు నెలలు అవుతుంది. అవి ఇవ్వకుండా ఆ కార్డు కావాలని నిబంధన ఎలా పెడతారు? వ్యాపార ప్రకటనల్లో పెద్ద యాడ్ ఇచ్చి దాని కింద చిన్నగా అక్షరాల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్లుగా ఉంది ఈ నిబంధనల తీరు.. పేదరికం ఆధారంగా ఐదు, ఆరు ఎకరాల నిబంధన పెట్టొచ్చు. మొన్నటిదాకా కేసీఆర్ 66 లక్షల మందికి ఏ నిబంధన లేకుండా ఇచ్చారు. సగానికి పైగా కుదించుతానంటే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. 66 లక్షల మందికి ఇచ్చిన కేసీఆర్‌తో రేవంత్ రెడ్డిని పోల్చి చూస్తారు. రైతుల్లో కాంగ్రెస్ వ్యతికత మూట కట్టుకుంటుంది. ఈ నిబంధనలు పెట్టి .. సగానికి పైగా రుణమాఫీ ఇవ్వమని ఓటు అడగలేదుగా అని పౌర సమాజం నుండి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
రైతు సమస్యలు నాలుగు రెట్లు
దూరమవుతున్న పల్లెటూళ్లే పట్టుగొమ్మలని నానుడి... వాస్తవానికి గ్రామీణ భారతం రుణగ్రస్త భారతం అయ్యింది. పట్టుగొమ్మ అనే నానుడికి దూరమవుతోంది. పండితే రేట్లు ఉండవు... రేట్లు ఉంటే పండని అనిశ్చిత పరిస్థితికి రైతు నెట్టివేయబడ్డాడు.... పిన్నిసు తయారీదారైనా సరే తన వస్తువుకు తాను ధర నిర్ణయించుకుంటాడు. జనాభాలో 60, 70 శాతంగా ఉన్న రైతులు మార్కెట్‌ని నిర్ణయించుకోలేని స్థితిలో ఉంది రైతాంగం. అందుకే రుణమాఫీ కోసం ఎదురు చూపులు..... ఉద్యోగులకు నెల నెలా వెన్నెలా ఉంటుంది. రైతుకు సంవత్సరానికి ఒక్కసారి కూడా సరైన వెలుగులుండవు... అందుకే రుణమాఫీ చెయ్యాలి. ప్రభుత్వానికి సవాలక్ష సమస్యలు ఉండొచ్చు... రైతులకు ఇంకా నాలుగు రెట్లు ఎక్కువ సమస్యలు ఉంటాయి. మెజారిటీ రైతుల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి.. ముందడుగు వేస్తారని... రైతుల పట్ల మానవత్వాన్ని చాటుకుంటారని ఆశిద్దాం.
సాదం వెంకట్
93953 15326