అబద్ధాలు నేరాలను కప్పిపెట్టలేవు..

by Vinod kumar |   ( Updated:2023-04-10 23:31:06.0  )
అబద్ధాలు నేరాలను కప్పిపెట్టలేవు..
X

నటులు శోక సన్నివేశాల్లో గ్లిజరిన్ రాసుకొని కన్నీరు పెడుతుంటారు. కానీ జగన్ గ్లిజరిన్ అవసరం లేకుండానే టక్కు, టమారా, గజ కర్ణ, గో కర్ణ విద్యలతో కన్నీరు పెడుతూ రాజకీయాల్లో రక్తి కట్టిస్తున్నారు. అబద్ధాలతో ఎంతగా నటిస్తే రాజకీయం అంత పండుతుందని ఆయన ఆశ. జగన్ రెడ్డి మాయలను ప్రజలను తెలుసుకోవాల్సి వుంది. జగన్మాయలు, అబద్ధాలను విపులంగా ప్రజలు విశ్లేషించుకోవాలి. అబద్ధాన్ని అబద్దం అని విసుగు లేకుండా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌లో. ఇటువంటి అబద్దాలను అడ్డుకోకపోతే ప్రజల భవిష్యత్తు మరోసారి అంధకారమౌతుంది. కావునా రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి సామాన్య పౌరులు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి. విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఇటువంటి మాయలు, అబద్ధాలు అడ్డుకోవడం సాధ్యపడదు. సియం జగన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతూ బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలే జగన్ రాజకీయ ప్రాణ వాయువు. అబద్దాలు, ఏడుపులతో తప్ప ఒడుపుగా ఓట్లు రాబట్టిన చరిత్ర జగన్‌కి లేదు.

మీడియా బలం లేదా.. హవ్వ..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సభలో సియం జగన్ రెడ్డి స్వార్ధమే పరమార్థంగా అబద్దాలతో అభినయం ప్రదర్శిస్తూ తనకు ఆర్థిక బలం, మీడియా బలం, అంగ బలం లేదని, నేర చరిత్ర లేదని, అబద్ధాలు చెప్పడం రాదని, మోసం చెయ్యడం తెలియదని, నక్క జిత్తులు తెలియవు అని, చెప్పింది చెయ్యడం మాత్రమే తెలుసునని పచ్చి అబద్దాలు చెప్పడం విన్న ప్రజలు ముక్కున వేలువేసుకొన్నారు. నాకు మీడియా బలం లేదు అన్నారు. మరి సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎవరివి..? టీవీ చానల్‌ను ప్రారంభించినప్పుడు ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు మొదట చైర్మన్‌‌గా వున్నది ఎవ్వరు..? ఇవికాక మీరు డబ్బులు ఇచ్చి పోషించే బాడుగ మీడియా, వెబ్‌సైట్లు, య్యూట్యూబ్‌ చానళ్లకు లెక్కే లేదు. అయినా నాకు మీడియా బలం లేదని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. తనకు సొంత మీడియా లేదని తాను కొలిచే దైవంపై ప్రమాణం చెయ్యగలరా..?

ఆర్ధిక బలం లేదని ఎంత పేద అరుపులు అరుస్తున్నాడో ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఈ నాలుగేళ్ల అవినీతి అక్రమ సంపాదన కాక 2019 నాటికే రూ 370 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్నుడుగా సియం జగన్ రికార్డులకు ఎక్కారని ది ప్రింట్, ఇండియా టుడే వెల్లడించింది. ఇవికాక హైదరాబాద్, బెంగుళూరు, ఇడుపుల పాయలలో నిర్మించిన రాజప్రసాదాలు ఎన్నో వున్నాయి. అయినా తానూ పేద వాడిగా అభినయాలు ప్రదర్శిస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఎన్నో రకాలుగా తెర వెనుక పెత్తనం వెలగబెట్టి రాష్ట్రాన్ని దివాలాతీయించిన ఆర్ధిక నేరస్థుడు జగన్.

అంతా ప్రజల కోసమేనంటూ నిష్టగా సాగిన అవినీతి యజ్ఞంలో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని నిగ్గు తేల్చడానికి దర్యాప్తు సంస్థలు ఎంత శ్రమ పడ్డాయో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ చూశారు. రూ. 43 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు బొర్రే పెట్టినట్లు సిబిఐ నిగ్గు తేల్చి 11 ఛార్జిషీట్లు, ఈడీ 6 చార్జి షీట్లు వేసింది. అన్ని ఛార్జి షీట్లలోను 420 కింద కేసు నమోదు చేసి జగన్ రెడ్డిని మొదటి ముద్దాయిగా తేల్చింది. 16 నెలలు జైలు జీవితం గడిపి, బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి నేర చరిత్ర లేదని చెప్పుకోవడం సిగ్గు చేటు, జగన్ ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.

జలదేవాలయం పోలవరమెక్కడ..?

నాలుగేళ్లుగా అన్ని వర్గాలను దగా చేసి, ప్రజల సంపద దోపిడీచేసి ప్రజలకు భవిష్యత్ లేకుండా చేసిన జగన్ రెడ్డిని ప్రజలు ఎలా నమ్ముతారు? ఏ వర్గాన్ని, ఏ రంగాన్ని బాగు చేశారని జగన్‌ని నమ్మాలి? అమరావతి రైతులను మోసంచేసినందుకు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు నమ్మాలా? అయిదు కోట్ల ఆంధ్రుల జలదేవాలయం పోలవరాన్ని పాడు పెట్టినందుకు నమ్మాలా? ఆర్ధిక వ్యవస్థను నాశం చేసి లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా అంచుకు చేర్చినందుకు నమ్మాలా? సీబీఐ కేసుల నుండి బయట పడేందుకు రాష్ట్రప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టినందుకు నమ్మాలా? కరెంటు చార్జీలు 7 సార్లు పెంచి 16 వేల కోట్ల భారం ప్రజల వేసినందుకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడబోతున్నందుకు నమ్మాలా? ప్రత్యేక హోదా సాధించి యువతకి కల్పిస్తానని యువతని మోసం చేసినందుకు నమ్మాలా? రాష్ట్రంలో శ్యాoడ్, ల్యాoడ్, మైన్ సమస్త ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నందుకు నమ్మాలా? ఎలా నమ్మాలి?ఎందుకు నమ్మాలి? చెప్పండి. అసలు మా నమ్మకం నువ్వే జగన్ అనేది పార్టీ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమమా? ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు ఎలా చేపడుతారు? ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకున్నటువంటి వాలంటీర్లు పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు? వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు.

గత ప్రభుత్వ కట్టడాలు కూల్చడం, రంగులు వేయ్యడం, పేర్లు మార్చడం, స్టిక్కర్లు అంటించడం పిచ్చి పరాకాష్టకు చేరింది. కొంతకాలం రంగుల పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు పాసు పుస్తకాలపై, యాడ్స్, బ్యానర్లు, పోస్టర్లు, మరుగుదొడ్లు. చెత్త బండ్లు, ఇండ్లు ఇలా దేనిని వదలకుండా జగన్ బొమ్మలు కనిపించాలి అంటున్నారు. ఇప్పుడు ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తూ తమ వికారాన్నిప్రదర్శిస్తున్నారు. ఇళ్లపై స్టిక్కర్లు వేయడమంటే లబ్దిదారులు అగౌరవంగా భావిస్తున్నారు. లబ్దిదారుల నిస్సహాయత, ఆర్థిక అవసరాలు లాంటి బలహీనతలను ఆసరాగా వారిని బజారు కీడుస్తున్నారు. ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడి బతుకుతున్నారనే చులకన భావం కలిగిస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్లపై స్టికర్లతో ఆగుతారా? లేక సంక్షేమ పధకాలు అందుకొంటున్న ప్రజల ఒంటిపై కూడా జగన్ స్టిక్కరు అంటిస్తారేమోనని అమాయక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

స్టిక్కర్లు వేస్తే మంచి పాలనా..?

స్టిక్కర్ వద్దంటే ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డు ఎక్కడ రద్దు చేస్తారేమోననే భయం వారిని వెంటాడుతుంది. ఒకవేళ స్టిక్కర్ అంటించుకోవడానికి నిరాకరిస్తే వారు తమ పార్టీ కాదు, తమకు ఓటు వేయరనే చిట్టా తయారు చేసి వారి ఓట్లు తొలగించడం, వేధింపులకు గురిచేయడం, నిఘా పెట్టడం లాంటివి చేస్తారనే అనుమానం ప్రజల్లో ఉంది. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని, మద్దతు ఇవ్వని వారిని గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఉంది. గతంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఈ విధమైన రంగులు, ఫొటోలు,స్టిక్కర్లు వంటి వికారాలతో పరిపాలన సాగించలేదు. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు అడుగడుగునా నిలదీశారు. రంగులు, ఫొటోలు, స్టిక్కర్ల తో ప్రజలను దగా చెయ్యాలని చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజాధనంతో అమలవుతున్న దాదాపు 80 పథకాలకు తండ్రి వైఎస్, తనయుడుపేర్లు పెట్టుకొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు అయిన పధకాలకే పేర్లు మార్చి తండ్రి,తనయుల పేర్లు తగిలించుకొన్నారు. మీ చేతకాని, అసమర్ధ పాలనకు మీ పేర్లు రక్షణగా నిలుస్తాయా..? పేర్లు మార్చినంత మాత్రానా, స్టిక్కర్లు వేసినంత మాత్రానా మీ పరిపాలన సుపరిపాలన అవుతుందా? నాలుగేళ్లుగా విషం, విధ్వంసం, విద్వేషం, వివాదాలు, కుట్రలు తప్ప ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకొన్నారా..? ఇంకా మీ పగటి వేషాలు, జిమ్మిక్కులు నమ్మి జనం ఓట్లు గుమ్మరిస్తారు అని భ్రమించకండి. మీ ప్రభుత్వానికి గోరీ కట్టడానికి సమయం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

- నీరుకొండ ప్రసాద్

9849625610




Advertisement

Next Story

Most Viewed