- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘట్కేసర్ గురుకుల్ చరిత్రను కాపాడుదాం..!
ఘట్కేసర్ గురుకుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బన్సీలాల్ వ్యాస్ రాజస్థాన్ లోని నారద గ్రామంలో చిన్న మార్వాడి కుటుంబంలో పుట్టిన బిడ్డ. ఆయనకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన తండ్రి తన సోదరుడైన రాధాలాల్ వ్యాస్‌కి దత్తత ఇచ్చారు. రాదాలాల్‌తోపాటు బన్సీలాల్ వ్యాస్ కూడా చిన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చేశారు.
గురుకుల్ స్థాపన
1939 ప్రాంతంలో నిజాం కాలంలో ఎవరికి విద్యపై చింతలేని సమయంలో పిల్లలందరూ విద్యకు దూరమవుతున్న విషయం బన్సీలాల్ వ్యాస్ గమనించి ఒక గురుకులాన్నీ ప్రారంభించాలని సంకల్పించారు. కానీ ఆ రోజుల్లో నిజాములు వీటి ఏర్పాటుకు వ్యతిరేకులు. వ్యాస్ వీటి ఏర్పాటుకు 1937లో నిజాం ప్రభుత్వాన్ని అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు. కానీ నిజాం అందుకు అంగీకరించలేదు. దీంతో మరోసారి 1938లో మరోసారి కోరితే, నిజాం పాలనలో మంత్రిగా ఉన్న ఆర్య సమాజ్ మద్దతుదారుడు కృష్ణ ప్రసాద్ సహకారంతో గురుకుల స్థాపన కోసం అనుమతి లభించింది. 1938 ఉగాది రోజున హైదరాబాదులోని అనంతగిరి రాంబాగ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత ప్రొఫెసర్ దారేశ్వర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. కానీ ఎంతోమందికి వ్యాస్ స్థాపించిన గురుకుల్ ఇష్టం లేదు. దీంతో వ్యాస్‌ని చంపాలని కూడా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన గురుకుల్ మెల్లమెల్లగా 48 మందికి చేరింది. కానీ ఆ ప్రాంతంలో సమస్యలు రావటంతో అక్కడినుండి దూల్ పేటకు మార్చారు. దూల్పేట్‌లో మతకల్లోలం వల్ల మళ్లీ అనంతగిరిలోని రాంభాగ్‌కు గురుకులాన్ని మార్చారు.
ఆశ్రమ నిర్మాణానికి వితరణ
గురుకులంలో విద్యార్థులు పడుతున్న బాధలు చూడలేక శ్రీరామ్ గోపాల్ లాఠీ 11 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. దీంతో ఆ స్థలంలోకి దీనిని మార్చాలనుకున్నారు కానీ దీని నిర్మాణానికి సుమారు రూ. 60,000 వరకు అవుతుందని వ్యాస్ అంచనా.కానీ రూ.18000లో పోగయ్యాయి. కానీ రామ్ భగవాన్ ముందుకొచ్చి 'మీరు పనులు మొదలు పెట్టండి తక్కువ అయిన డబ్బులు నేను భరిస్తాను' అని తెలియజేయడంతో పనులు మొదలెట్టారు. ఆర్య సమాజ్ కార్యకర్త కిషన్ లాల్‌ని గురుకుల్ నిర్మాణం కోసం అధ్యక్షుడిగా అదే సమావేశంలో ఎన్నుకున్నారు.
1941 సెప్టెంబర్ 30న విజయదశమి పర్వదినం నాడు దీనిని ప్రారంభించారు. పచ్చని చెట్ల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణం గల విశాలమైన ప్రదేశంలో గురుకుల్ నెలకొల్పారు. అనంతగిరి గురుకుల్లో ఉన్న బ్రహ్మచార్యులను కుడా ఘట్కేసర్ గురుకుల్‌లో వ్యాస్ చేర్చారు. స్వామి దయానంద సరస్వతి భాష్యం చెప్పిన వేద విద్యను బ్రహ్మచారులకు నేర్పించేవారు. దీనితోపాటు ఆధునిక కాలానికి అవసరమైనటువంటి విజ్ఞాన శాస్త్రాలు కూడా బోధించేవారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి ప్రవర్తనను వేద విద్య వైపు మార్చగలిగే ఉన్నత ఆశయాలు గల ఉపాధ్యాయులచే వారికి శిక్షణ ఇప్పించేవారు.
రెండు విధాలుగా శిక్షణ
గురుకుల్లో శిక్షణ రెండు విధాలుగా ఉండేది ఒకటి విద్యా మందిర్‌లో, రెండోది ఉద్యోగ మందిర్‌లో.. చేతివృత్తులైన వడ్రంగము, హవన సామాగ్రి తయారు చేయడం, ఆయుర్వేద చూర్ణాలు తయారు చేయడం విద్యార్థులకు నేర్పించేవారు. గురుకుల్ ముద్రణాలయంలో సభ్యులకు శిక్షణ ఇచ్చేవారు. గానుగ ద్వారా నూనె తీయడం, పిండి నిర్వహణ మొదలైనవి నేర్పించేవారు. ఆయుర్వేద ఔషధాలు తయారు చేసేవారు. గురుకుల్లో తయారుచేసిన ఈ ఉత్పత్తులను సభ్యులు, విద్యార్థులు కూడా సెలవు దినాలలో చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకొని వచ్చేవారు. వీటికి తోడుగా గురుకుల్లో గోశాల, వ్యవసాయ క్షేత్రం ఉండేవి. పాడి పంటలతో గురుకుల్ అలరారుతుండేది. 1953-1954వ సంవత్సరం వరకు గురుకుల్ విద్యాసంస్థలో రాష్ట్ర బాష అయినా హిందీ మాధ్యమం ద్వారా విద్య బోధన 7వ తరగతి వరకు జరుగుతుండేది. గురుకుల్ చుట్టూ ఎక్కువమంది తెలుగువారే. వీరిలో చాలామంది పేదవారైనందున ఏడవ తరగతి వరకు తెలుగు మీడియం కూడా ప్రభుత్వం నుండి అనుమతి పొంది ప్రవేశపెట్టారు. 1955-1956లో 8వ తరగతి, అనంతరం 9,10 తరగతులు. ఈ విధంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ 1972వ సంవత్సరంలో జూనియర్ కళాశాల స్థాయికి గురుకుల్ ఎదిగింది. నాటి ఆరోగ్య శాఖ మంత్రి చందగాంధీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను గురుకుల్‌లో ఏర్పాటు చేశారు.
శిథిలావస్థలో గురుకుల్
ఇంతటి ప్రాముఖ్యత గల ఘట్కేసర్ గురుకుల్ ఇప్పుడు శిథిలా వ్యవస్థకు చేరింది. తరగతి గదుల పై కప్పు ఎప్పుడు కూలిపోతుందో అని విద్యార్థులు భయాందోళనతో ఉంటారు. వర్ష కాలంలో తరగతులు జరగడానికి వీలు లేకుండా వర్షపు నీరు తరగతి గదుల్లో పడుతూ ఉంటాయి. గురుకుల్‌ని అభివృద్ధి చేయాలనీ విద్యార్థి సంఘాలు అనేకసార్లు అధికారులను కలిసినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని గురుకుల్‌ని అభివృద్ధి చేయాలనీ మనవి.
- శ్యామ్ కిరణ్ అంకం
ఏబీవీపీ ప్రాంత కార్యసమితి సభ్యులు