ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం!

by Ravi |   ( Updated:2024-05-10 00:45:29.0  )
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం!
X

దేశ గతిని మార్చేది, వ్యవస్థలో మార్పునకు నాంది పలికేది.. ఓటే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను, బహుళ పార్టీలు కలిగిన భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకొకసారి ప్రతిష్టాత్మకంగా ఎన్నికల నిర్వహణను కుంభమేళాగా ప్రకటిస్తారు. చైతన్య శీలురైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి దీప స్తంభాలు. దేశ భవిత, పౌరుల సంక్షేమానికి పాడుపడే శక్తి యుక్తులు, విచక్షణ కలిగిన నేతలు చట్టసభల్లో కొలువుతీరితేనే మన ఎన్నికల ప్రక్రియకు సార్ధకత లభిస్తుంది. ఓటర్లు నిస్తేజం వీడి విజ్ఞతతో నిజాయితీపరులైన నేతలకు పట్టం కడితేనే భారత్‌లో వెలుగు రేఖలు సాధ్యమవుతాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనది. భారతదేశంలో నివాసముంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది. ప్రపంచంలోనే 144 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద దేశంలో ప్రస్తుతం 18వ లోకసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 97 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

వీరి ఓటుతోనే.. దేశం మారేది!

ఐదేళ్లకోసారి దేశ పార్లమెంటుకు ఎన్నికలు జరుపుకొని ప్రజలచేత ప్రజాప్రతినిధులను ఎన్నుకొని మెరుగైన ప్రజా పాలనకు బాటలు వేస్తూ పౌరుల బంగారు భవితను ఓటే నిర్దేశిస్తుంది. ఇంతటి విలువైన ఓటు హక్కుకు పేరు నమోదు చేసుకోవడం, వినియోగించుకోవడంలో భారత పౌరులు ముఖ్యంగా యువత అంతులేని అలసత్వాన్ని ప్రదర్శించుచుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. భావి భారత నిర్మాణంలో యువ ఓటర్లది నిర్ణయాత్మక పాత్ర అన్నది కాదనలేని సత్యం. అయితే, శక్తివంతమైన ఓటు హక్కును నమోదు చేసుకోవడంలో 18 ఏండ్ల నిండిన నవతరం నిర్లక్ష్యం వహించడం దేశానికి ఎంత మాత్రం క్షేమం కాదు. ఈ ఎన్నికల్లో 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 1.9 కోట్లకు చేరుకుంది. అయితే 18 ఏండ్లు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులుగా ఉన్నవారు 4.9 కోట్లు ఉన్నారు. ఈసీ లెక్కలను విశ్లేషిస్తే 38 శాతం యువత ఓటరు నమోదులో శ్రద్ధ చూపడం మిగతా 62 శాతం దూరంగా ఉన్నారని తెలుస్తుంది. దేశ ప్రగతి వాహనానికి ఇరుసు లాంటి వారు యువతే. పోలింగు రోజు వీరు ఓటు హక్కును విధిగా ఉపయోగించుకుంటేనే భారతదేశ రూపురేఖలు మారుతాయి. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశమున్న ఇండియాలో యువత దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదు.100 శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి

అరకొరగా నమోదు!

కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఓటు హక్కు నమోదు పరంగా కొన్ని రాష్ట్రాల్లో యువత మరింతగా నిర్లక్ష్యం వహించింది. బీహార్‌లో 18-19 ఏళ్ల వయసు వారిలో కేవలం 17 శాతం యువతే కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకుంది. ఆ రాష్ట్రంలో 18-19 సంవత్సరాల వయసు వారు 54 లక్షల మంది ఉన్నారు. వారిలో 9.3 లక్షల మంది ఓటు హక్కు పొందారు. దేశ రాజధాని ఢిల్లీలో 18-19 ఏండ్ల వయసు ఓటర్లు 7.20 లక్షల మంది ఉన్నారు. వారిలో 1.50 లక్షల మంది (21 శాతం) ఓటు హక్కు పేరు నమోదు చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ 23%, మహారాష్ట్ర 27%లో అతి తక్కువ ఓటు నమోదు జరిగిందంటే యువతరం ప్రజాస్వామ్య పరిరక్షణ యజ్ఞం పట్ల ఉదాసీనంగా ఉండిపోయారంటే, లోపం ఎక్కడ ఉందో ఆలోచించాలి. తెలంగాణలో 18 సంవత్సరాలు నిండిన వారు 12 లక్షల మంది ఉన్నారు. వారిలో 8 లక్షల మంది ఓటు హక్కుకు నమోదు జరిగింది. ఇలా 67% ఓటు హక్కు నమోదుతో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. జమ్మూ కాశ్మీర్ 62 శాతం, హిమాచల్ ప్రదేశ్ 60 శాతం, తర్వాతి స్థానంలో ఉన్నాయి. కేవలం 12 రాష్ట్రాల్లోనే 18 -19 ఏళ్ల యువత ఓటు హక్కు నమోదు 50 శాతం కంటే ఎక్కువగా ఉంది.

వరుస సెలవులు ఉండటంతో..

నగరవాసులంటే కాస్త చైతన్యవంతులు.. ఓటు హక్కు వినియోగంలో మాత్రం హైదరాబాద్ ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. ఏ ఎన్నిక చూసినా మిగతా రాష్ట్రమంతా ఒక తీరు, రాజధాని ఒక తీరు అన్నట్లుగా ఉంటోంది. పోలింగ్ శాతం పెంపునకు లెట్స్, ఓట్ లాంటి స్వచ్ఛంద సంస్థలు, వాకధాన్‌లు, రన్‌లతో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కార్పొరేట్ కంపెనీలు ఆఫర్లు అందించినా ప్రజలు, ఉద్యోగులు మాత్రం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. రాజధాని చుట్టుపక్కల 24 అసెంబ్లీ స్థానాలు ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే 50 శాతం ఓటింగ్ దాటుతోంది. సరాసరి మాత్రం 40 శాతం మించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారు. వీరిలో సగం మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా ఈసారి పోలింగ్ మే 13న సోమవారం రావడం, శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో కొందరు ఎటైనా వెళ్దామని ప్రణాళిక చేసుకుంటుండం గమనార్హం. ఈ సారి ఎన్నికలు నడి వేసవిలో రావడం. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుకోవడంతో పోల్ మరీ తగ్గే ప్రమాదం ఉన్నది. ఈసారి 85 సంవత్సరాల వృద్ధులకు, 40 శాతం అంగవైకల్యం కలిగిన వికలాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మే 13 న జరిగే ఎన్నికల్లో 100 శాతం ఓటింగ్ నమోదు చేద్దాం! రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుందాం.. ఓటుకు నోటుకు దూరంగా ఉందాం.. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకుందాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం!

ఉజ్జిని రత్నాకర్ రావు

94909 52646

Advertisement

Next Story