ప్రేమిద్దాం.. ప్రేమిస్తూనే ఉందాం

by Ravi |   ( Updated:2024-10-26 00:30:25.0  )
ప్రేమిద్దాం.. ప్రేమిస్తూనే ఉందాం
X

మానవతావాదాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనుషుల మధ్య స్త్రీ పురుషులు, జాతి మతం, సంస్కృతి, భాష వంటి భేదాలు మాయమైపోతాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బౌద్ధ మత గురువు దలైలామా చెబుతారు. భవిష్యత్తులో మతమేదైనా ఉందా? అంటే అది మానవతావాదం ఒక్కటే, శాఖోపశాఖలుగా ఉన్న విశ్వాసాలన్నీ ఒక తాటిపైకి వచ్చి నైతిక విలువలతో కూడిన మానవతావాదం రూపుదిద్దుకుంటుందని ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త ఎర్నెస్ట్ రెనాన్ అంటారు. ప్రవక్తలు, తత్వవేత్తలు, మేధావులే కాదు ప్రపంచంలోని అన్ని మతాల సారాంశాన్ని పరిశీలించినప్పుడు మానవతావాదం గొప్పదిగా కనిపిస్తుంది. మతబోధనలన్నీ మానవత్వాన్ని నేర్పుతాయి. మత ధర్మాలన్నీ మనిషిని ప్రేమించమని చెబుతాయి. ప్రేమ కలిగిన మనసులో దైవత్వం కొలువై ఉంటుందని అంగీకరిస్తాయి. దైవత్వాన్ని చేరుకోవడానికి సులువైన మార్గం ప్రేమ కలిగి ఉండటమే.

మానవత్వాన్ని పెంపొందించుకోవడం, ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉండటం మానవ సమా జ పురోగమనానికి అతి ముఖ్యమైనవి. మానవ స్వభావం ప్రధానంగా సానుభూతితో, దయతో నిండి సున్నితంగా ఉంటుంది. అయితే కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా సున్నితమైన మానవ స్వభావంలోకి కోపం, ద్వేషం, ఈర్ష్య వంటి ప్రతికూల భావనలు చొరబడి మనిషిలోని నైతిక విలువలను ధ్వంసం చేస్తున్నాయి. నైతిక విలువలు పతనమైనప్పుడు సమాజ పురోగతి సాధ్యపడదు. అందుకే, వ్యక్తిగత శాంతికి, సమాజ పురోగతి కోసం నైతిక విలువలు పెంపొందించుకోవడం అవసరం. నైతిక విలువలే మనిషిని ఆనందం వైపు నడిపిస్తాయి. ఆనందం కలిగిన మనిషిలో ప్రేమ నిండి ఉంటుంది. ప్రేమించడం ద్వారానే ప్రేమను పొందగలం. ఇవ్వడం ద్వారానే తిరిగి లభిస్తుంది. ఇదే మానవతావాదానికి మార్గం.

అన్ని వైఫల్యాలకూ కారణమిదే..

ప్రముఖ అమెరికన్ రచయిత, ప్రభావవంతమైన ఉపన్యాసకుడు డేల్ కార్నెగీ ఏమంటారంటే, 'మతం మనందరి పైన ఉంచిన అతి ముఖ్యమైన కార్యభారం మీ పొరుగు వారిని ప్రేమించండి అనేది. తన తోటి వారిలో ఆసక్తి లేని వ్యక్తి జీవితంలో అమితమైన కష్టాలను ఎదుర్కొంటాడు. అంతేకాక ఎదుటివారికి అతిపెద్ద అగాధాలను కలుగజేస్తాడు. అటువంటి వ్యక్తుల నుంచే అన్ని మానవీయ వైఫల్యాలు జనిస్తుంటాయి.' ఈ మాటలను పరిశీలించినప్పుడు ప్రేమ కలిగి ఉండడం ఎంత ముఖ్యమైన విషయమో అర్థమవుతుంది. ప్రేమ కలిగి ఉండడం సమాజానికే కాదు వ్యక్తిగత ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఇదే విషయాన్ని బౌద్ధ మత గురువు దలైలామా ఈ విధంగా చెబుతారు. ' సానుభూతిపరులై ప్రేమించే స్వభావం గల వ్యక్తి మానసికంగా ఆరోగ్యవంతుడని అంటాను. సానుభూతి కలిగి అందర్నీ ప్రేమించే దయగల హృదయం ఉంటే మీలో స్వర్గ ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఆప్యాయత మనుషుల మధ్య గోడలను పడగొడుతుంది.'

తోటివారిపై దయ చూపడమే సంతోషం!

ఆధునిక మానసిక శాస్త్రీయ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రముఖ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సోన్యా లైబోమర్ స్కీ కొందరు మధ్యవయస్కులను ఎంచుకొని వారి మనస్తత్వంపై కొన్ని వారాలపాటు అధ్యయనం చేశారు. ఈ అధ్యయన ఫలితం ఏమిటంటే ' ఇతరులపై దయ చూపించడం ద్వారా ఎక్కువగా ఆనందంగా, సంతోషంగా ఉన్నామన్న భావన కలుగుతుందని.' ఇతరులు సుఖసంతోషాలతో జీవించాలన్న కోరిక మనలో కూడా సుఖసంతోషాలని కలుగజేస్తుందని ప్రయోగశాలలో ఓ బౌద్ధ భిక్షువుపై చేసిన ప్రయోగం ద్వారా డాక్టర్ డేవిడ్ సన్ నిరూపించారు. ప్రఖ్యాత మనో చికిత్సకుడు డాక్టర్ హోవర్డ్ సి. కట్లర్, బౌద్ధ మతగురువు దలైలామాతో కలిసి రచించిన "ది ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్" అనే పుస్తకంలో ఇటువంటి శాస్త్రీయ ప్రయోగ ఫలితాలను మరింత వివరంగా తెలుసుకోవచ్చు. మత సిద్ధాంతాలు చెప్పినా, శాస్త్రీయ ఫలితాలు నిరూపించినా గ్రహించాల్సిన విషయం ఏమిటం టే ప్రేమ ద్వారాలు తెరిచి ఉంచడం అతి ముఖ్యం. ప్రేమించడం, సానుభూతి కలిగి ఉండడం అభ్యసించదగిన మంచి మార్గాలు. ఇవి బాల్యం నుంచే నేర్పించాల్సిన గొప్ప సుగుణాలు.

ఇవ్వడం, క్షమించడం గొప్ప సుగుణాలు..

తిరిగి ఆశించకుండా ఇతరులకు ఇవ్వడం, మేలు చేయడం, సేవ చేయడం మానవత్వానికి ప్రతీక. ఇవ్వడం, క్షమించడం అనేవి అత్యుత్తమమైన సుగుణాలు. ఈ విషయాలనే అన్ని మత సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ లోకంలో అందరికన్నా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్న వారిలో కనిపిస్తున్న ముఖ్యమైన లక్షణం సానుభూతితో ఇతరులకు సాయం చేయడం, ప్రేమ కలిగి ఉండటం. సాయం చేయడం మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు మనిషి మనసు ఆనందంతో నిండి ఉంటుంది. మనం జీవిస్తున్న ఈ లోకంలో మంచి సంబంధాలను కలిగి ఉండాలంటే ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. ఎదుటివారికి మంచి చేయడం అనేది ఒక కర్తవ్యం కాదు, అది ఒక ఆనందం. ఎందుకంటే అది మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పెంచుతుంది. ఇదే విషయాన్ని బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ' మీరు ఎదుటివారితో మంచిగా ఉంటే, మీపట్ల మీరు మంచిగా ఉన్నట్లే ' అని చెబుతారు. మానవత్వాన్ని పెంపొందించుకోవడంలో ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం అనే గొప్ప గుణాలను బాల్యం నుంచే నేర్పించాలి, నేర్చుకోవాలి. అభ్యాసం ద్వారా ప్రేమ గుణాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. మత సంప్రదాయాల సారాంశాన్ని ప్రేమతో పోల్చవచ్చు. ప్రేమ కొలువైన హృదయంలో ఈర్ష్యా ద్వేషాలకు తావుండదు. ఏ దారిని ఎంచుకున్నప్పటికి మనుషులుగా మనందరి ప్రయాణం మానవత్వం అనే మంచి మార్గం ద్వారా దైవత్వాన్ని చేరుకోవడమే. దానికోసం ప్రేమించ డం, ప్రేమను పంచడం అతి ముఖ్యం.

శిఖా సునీల్ కుమార్

99081 93534

Advertisement

Next Story

Most Viewed