కేసీఆర్‌ను ఓడిద్దాం.. ప్రజాపాలన తెద్దాం!

by Ravi |   ( Updated:2023-11-23 01:01:07.0  )
కేసీఆర్‌ను ఓడిద్దాం.. ప్రజాపాలన తెద్దాం!
X

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం.. మరో స్వతంత్ర పోరాటం! 1969 జై తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీసుల ఎదురు కాల్పులలో మరణించి వీరమరణం చెందితే, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1386 మంది కనకనలాడే అగ్నికి ఆహుతి అయ్యారు. వారి బలిదానాలు వెలకట్టలేనివి. ప్రపంచ ఉద్యమాలలో ఏ ఉద్యమంలో కూడా ఆత్మహత్యల పరంపర లేదు.

అమరుల లెక్కలు చెప్పరా?

తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమంలో ఒక కుటుంబ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతమంది అమరులయ్యారు. విధి నిర్వహణలో చనిపోయిన సైనికుడికి కోటి రూపాయలు, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చిన కేసీఆర్, తెలంగాణ అమరుల కుటుంబాలకు మాత్రం కంటి తుడుపు చర్యగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అటెండర్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిజంగా అమరవీరుల కుటుంబాలకు చేయవలసిన సహాయం ఇదేనా? భారత పార్లమెంటు సాక్షిగా కేసీఆర్ మాట్లాడిన మాటలకు విలువ లేదా? ఆనాడు మాట్లాడిన వెయ్యి మందికిపైగా అమరులు ఈరోజు ఎక్కడ? ఎంతమంది అమరవీరుల కుటుంబాలను గుర్తించిందో చెప్పే సాహసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? కేవలం 548 మందిని గుర్తించి మిగతా వారిని గుర్తించకపోవడంలో ఉన్న కారణాలు ఏమిటో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై లేదా? ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలకు వీరిని రాజకీయంగా వాడుకోవడంలో ఉన్న శ్రద్ధ వీరి సమస్యలపై పోరాటంలో లేదు. తెలంగాణ ఉద్యమంలో రైలు రోకోలు, వివిధ ఉద్యమ కార్యచరణాలు చేసినప్పుడు కేసీఆర్ బూటకపు మాటలు నమ్మి ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఈరోజు కుటుంబాలకు భారంగా బతుకు వెళ్లదీస్తున్న 175 మంది తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా ఉంది. దీనికి తోడు ఆరోజు వీరోచిత పోరాటం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు యువత అనేక కేసులలో దోషులుగా ఉండి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు గౌరవభృతి కల్పిస్తూ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యమకారులను గుర్తించింది. ఇక్కడి ఉద్యమకారులకు ఆ గుర్తింపు ఉందా?

ప్రాంతం వాడే మోసంచేస్తే..

తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా దక్కిన అధికారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. అమరవీరులను, తెలంగాణ ఉద్యమకారులను, వారి త్యాగాలను అవహేళన చేస్తోంది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను అని చెప్పుకునే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల కుటుంబ సభ్యుల పక్షాన ఒక ప్రశ్న అడగదలుచుకున్నాము.. అయ్యా కేసీఆర్, 1969 జై తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి? 1948 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మీ కుటుంబ పాత్ర ఏమిటో చెప్పే ధైర్యం ఉందా? కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఒక దుర్బుద్ధితో నీ కుటుంబం పన్నిన పన్నాగానికి ఇంతమంది బలిదానాలు గావించాలా? కేవలం కపటదీక్షలతో, కపట నాటకాలతో నాడు యువతను, ప్రజలను రెచ్చగొట్టి ఇంతమంది బలిదానాలకు కారణమయ్యారు. మహాకవి కాళోజీ ‘‘ప్రాంతేతరుడు మోసం చేస్తే, ప్రాంతం పొలిమేరల వరకు తరమికొడుతం. ప్రాంతం వాడు మోసం చేస్తే, ప్రాంతం లోపల పాతిపెడతాం’’ అన్నాడు. ఆ మాటల ప్రకారం ప్రాంతేతరుడు మోసం చేస్తే, వారిని తరిమికొట్టారు తెలంగాణ ప్రజలు.. ఈరోజు ప్రాంతం వాడు మోసం చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలోనే బొంద పెట్టాలని తెలంగాణ ప్రజలకు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల విన్నపం.

నయా ఖాసీం రజ్వీని ఓడిద్దాం

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి కేసీఆర్‌పై తమ గోడు వెళ్ళబోసుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రజలపట్ల ప్రభుత్వానికి కనీస స్పందన లేదు. అమరుల బలిదానాలకు పట్టిన గతి చూస్తుంటే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం నవాబు ఏ విధంగా అయితే ఖాసీం రజ్వీచే దమనకాండ చేయించాడో.. అదే విధంగా తెలంగాణ సమాజంపై మరో ఖాసీం రజ్వీ మాదిరిగా తయారయ్యారు కేసీఆర్. రాష్ట్రంలోని నిరుద్యోగులను, ధరణి పేరుతో తెలంగాణ రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాడు. ఇటువంటి నయా ఖాసీం రజ్వీ పాలనలో తెలంగాణ అమరుల త్యాగాలు మసకబారుతున్నాయి. ఆమరుల ఆత్మలకు శాంతి లేదు. కేసీఆర్ పాలన అంతం చేసి.. ప్రజా పరిపాలన వచ్చినప్పుడే మన అమరుల త్యాగాలకు గుర్తింపు. ఇటువంటి ఖాసీం రజ్వీలను ఓడించి తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలిని చేసి తెలంగాణను కాపాడుకుందాం.

ఎం. రఘుమారెడ్డి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక

83282 12979

Advertisement

Next Story