తీరు సరిగా లేకపోతే సాగనంపుతారు..

by Ravi |   ( Updated:2023-12-13 00:30:42.0  )
తీరు సరిగా లేకపోతే సాగనంపుతారు..
X

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. రాబోయే నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణంగా రాష్ట్ర స్థాయి సమస్యలే ప్రభావితం చూపుతాయి. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జాతీయ అంశాలే కీలక పాత్ర వహిస్తాయి. మొన్న జరిగిన ఉత్తరాది రాష్ట్ర ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అయినా, కొంతమేరకు మధ్యప్రదేశ్‌లో 40.4 శాతం, రాజస్థాన్‌లో 39.5శాతం, ఛత్తీస్‌ఘఢ్‌లో 42.23 శాతం ఓట్లతో తన ఉనికిని నిలుపుకోగలిగింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన అంచనాలు తిరగబడ్డాయి. గెలవగలిగిన అవకాశాలను కాంగ్రెస్, ఇండియా కూటమి చేజార్చుకున్నాయి.

ఒప్పందాలు సరే.. ఐక్యత ఏది?

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు ఇండియా కూటమిగా పేరుకే ఏర్పడ్డాయి. కానీ, వాటి మధ్య పోరాట పటిమ, ఐక్యత లేదు. అలాగే మోదీ ఆకర్షణీయ ఇమేజ్ ముందు రాహుల్ తేలిపోయాడు. మోదీ వాగ్ధాటి ముందు రాహుల్ గాంధీ ప్రసంగాలు పేలవంగా ఉన్నాయి. గతంలో కూడా రాహుల్ గాంధీ మోదీకి సరితూగగల నాయకుడు కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం బీజేపీకి ఉన్నంత బలమైన సంకల్ప బలం. శిక్షణ పొందిన కార్యకర్తలు లేకపోవడం ఒకటైతే... జాతీయ వాదం, హిందుత్వ సైద్ధాంతిక పునాది, పక్కా ప్రణాళిక, అపరిమిత ఆర్థిక వనరులు ప్రధానమంత్రి సమర్ధ నాయకత్వం మరొక కారణంగా చెప్పుకోవాలి. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, కులవివక్షత, బీసీల కులగణన, విద్యా, వైద్యం, రహదారులు ఉపాధి అవకాశాలు మొదలైన సమస్యలను ప్రజల ముందు సరిగ్గా ప్రచారం చేయలేకపోయాయి.

పైగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ నాయకుల అంతర్గత పోరు, నాయకుల కుమ్ములాట, ముఠా తగాదాలు, మితిమీరిన స్వార్ధపూరిత ఆకాంక్షలు కాంగ్రెస్ కొంప ముంచాయి. కర్నాటకలో కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించిన ఐక్యకార్యాచరణ, వ్యూహాలు ఈ రాష్ట్రాల్లో లోపించాయి. పైగా కాంగ్రెస్ తన మిత్ర పక్షాలతో కలిసి ఉమ్మడి ఒప్పందాలు కుదుర్చుకొని ఐక్యంగా పోరాడలేకపోయింది. ఇండియా కూటమిలో 28 రాజకీయ పార్టీలు ఉమ్మడిగా స్థానిక సమస్యల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పోరాడలేక పోయాయి. ఇకముందు కూడా ఇండియా కూటమి తమ లోపాలను గుర్తించకుండా, వ్యూహాలను, ఎత్తుగడలను సవరించుకోకుండా, ఎవరిదారి వారిదే అన్న పోకడతో ముందుకు పోతే బలమైన బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదు.

ఆ కొండను ఢీ కొట్టడం ఎలా?

బీజేపీ దేశవ్యాప్తంగా హిందుత్వ ఐక్యత అనే భావోద్వేగ నిర్ణయాలతో ముందుకు పోతుంది. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు. ట్రిపుల్ తలాక్ వంటి సున్నితమైన అంశాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఇటీవల బెంగాల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ పరిణామాలను గమనిస్తే, బీజేపీ ఎన్నికల రణం మొదలెట్టిందని అర్థం చేసుకోవచ్చు. సున్నితమైన అంశాలను తన ఎన్నికలలో ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించనుందని తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కార్యచరణ వేగవంతం చేస్తే మాత్రం, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి దీటుగా ఇండియా కూటమి రాజ్యాంగపరమైన మానవ హక్కులు, పౌరహక్కుల పరిరక్షణ, సామాజిక ఆర్థిక సంక్షేమం, సామాజిక సామరస్యంతో కూడిన ఉద్యోగ, ఉపాధి హామీ పథకాలు, దేశ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విభిన్న నమూనాతో ముందుకు సాగాలి. ఇండియా కూటమిలో అంతర్గత విభేధాలు, ప్రతికూల అంశాలను గుర్తించి లోపాలను పరిష్కరించుకోవాలి. దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకర్షించే, ఉత్తేజ పరిచే కార్యాచరణ ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ లాంటి బలమైన పార్టీని, మోడీ లాంటి దృఢమైన ఆకర్షణీయమైన చరిస్మాటిక్ నాయకుణ్ణి ఎదుర్కోవడం సాధ్యపడుతుంది.

నేతల ప్రవర్తనపై జనం కన్ను

2014లోనూ, 2018 ముందస్తు శాసనసభ ఎన్నికల్లోనూ ఘన విజయాలను సాధించిన టీఆర్ఎస్, జాతీయ రాజకీయాల్లో కూడా రాణించాలని బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. సాధారణంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తారు. అనేక వినూత్న సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రవేశ పెట్టింది. కొంత మేరకు అనేక పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. అయినా గత 9 సంవత్సరాల పాలనాకాలంలో అభివృద్ధి కంటే, నాయకుల ప్రవర్తన తీరుపైనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక గ్రామీణ అభివృద్ధి పథకాలు, రైతు సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ అమలు చేసినప్పటికీ ఓటర్లు జిల్లా, గ్రామ స్థాయిలో తిరస్కరించారు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ స్థానిక నాయకత్వ ప్రవర్తనే! బీఆర్ఎస్,బీజేపీని విమర్శించినంతగా దేశంలో మరే విపక్ష పార్టీ బీజేపీని విమర్శించలేదు.అయినా ఆ రెండు పార్టీలు ఒక్కటే,అవి తెరవెనుక చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి అని కాంగ్రెస్ విస్తృతంగా చేసిన ప్రచారం బలంగా ప్రజలపై ముద్ర పడింది.ఆ ప్రచారం బీఆర్ఎస్‌కు బీజీపీకీ కూడా నష్టం కలిగించింది. తెలంగాణలో కాంగ్రెస్ 64 సీట్లతో సాంకేతికంగా విజయం సాధించినా అది సంపూర్ణంగా బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ధోరణికి ఓటర్ల నిరసనగానే భావించాలి.

- డా.కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed