కామన్ మ్యాన్ డైరీ:క్యా యార్ బస్ కరో!

by Ravi |   ( Updated:2022-09-03 18:08:26.0  )
కామన్ మ్యాన్ డైరీ:క్యా యార్ బస్ కరో!
X

ఒకప్పుడు బస్ చార్జీలు పెరగడం అంటే వారం రోజుల ముందు నుంచే హడావుడి ఉండేది. ఎక్కడికి ఎంతో పేపర్లలో వచ్చేది అన్నాడు సుబ్బారావు. రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల వాళ్లు ఆందోళన చేసేవారు. బంద్, నిరసనలు, హర్తాళ్లు సాగేవి. చడీ చప్పుడు లేకుండా ఒక్క రోజే ఏడు రూపాయలు చార్జీ పెరిగినా అడిగే నాథుడు కరువయ్యాడు. పొద్దున్న రౌండ్ ఫిగర్ అన్నారు. ఇప్పడేమో డీజిల్ సెస్ అంటు మొత్తానికి ప్రగతి చక్రం పగబట్టేసింది! ఇకపై రోజూ డీజిల్ రేట్లు పెరిగినట్టు బస్సు చార్జీలు కూడా రోజూ పెరుగుతాయేమో? బస్సెక్కాలంటేనే భయమేస్తోంది' అన్నాడు మధు.

మధుసూదన్ ఓ ప్రైవేటు ఉద్యోగి. విశాఖపట్టణం నుంచి బదిలీపై హైదరాబాద్​వచ్చాడు. వచ్చీరాగానే కరోనా సంక్షోభం మొదలైంది. ఉన్న కంపెనీ బిచాణా ఎత్తేసింది! ఊరు కాని ఊరు. ఎటు పోవాలో తెలియదు. లాక్‌డౌన్‌తో వ్యాపారాలు మందగించాయి. కంపెనీలు మూతపడ్డాయి. పరిశ్రమలు మూగబోయాయి. తిరిగి వైజాగ్ వెళ్లలేక హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. రెండేళ్లపాటు పోరాటం చేసి ఎట్టకేలకు ఓ ఉద్యోగం సంపాదించాడు. జీతం 25 వేలు.

నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సమీపంలో మకాం పెట్టాడు.బైక్ లేకపోవడంతో తెలంగాణ ఆర్టీసీని నమ్ముకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డ్యూటీ వేళలు. ఎక్కువసార్లు ఆఫీసువాళ్లే ఎవరో ఒకరు ఇంటి దగ్గర దిగబెడతారు. అందుకే బస్ పాస్ తీసుకోలేదు. సిటీ బస్సు ఎక్కి ఖైరతాబాద్‌లో ఉన్న ఆఫీసుకు వస్తుంటాడు. సోమవారం ఉదయం 11 గంటలకు నల్లకుంటలో ఆర్టీసీ బస్సెక్కాడు. జనం పెద్దగా లేరు. సీటు కూడా దొరికింది. కండక్టర్ టికెట్.. టికెట్ అంటూ వచ్చాడు. ఖైరతాబాద్ ఒకటివ్వండి.. అంటూ 18 రూపాయలు చేతిలో పెట్టాడు 'ఇంకా రెండు రూపాయలు' అన్నాడు కండక్టర్. అదేంటి 18 రూపాయలే కదా? అన్నాడు మధుసూదన్. లేదు. చిల్లరకు కష్టమవుతుందని రౌండ్ ఫిగర్ చేసేశారు. అన్న కండక్టర్ సమాధానంతో రెండు రూపాయల బిల్ల అందించాడు మధుసూదన్. స్టాప్ రాగానే దిగిపోయాడు.

ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఎవరైనా దొరికితే బైక్‌పై వెళ్లిపోదాం అనుకున్నాడు. ఎవరూ లేరు. బ్యాగ్ భుజానికి వేసుకొని బస్టాప్ వైపు నడిచాడు. నాలుగు అడుగులు వేశాడు. నల్లకుంట వైపు వెళ్లే బస్సు దూసుకొచ్చింది. ఆపుదామనే లోపే రయ్యిన వెళ్లిపోయింది. మెల్లిగా నడుచుకుంటూ బస్టాప్ వరకు వెళ్లాడు. పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నల్లకుంట బస్సొచ్చింది. జనం పెద్దగా లేరు. వెళ్లి బస్సులో కూర్చున్నాడు మధు. కండక్టర్ రాగానే 20 రూపాయలు చేతిలో పెట్టి ఫీవర్ హాస్పిటల్ ఒకటివ్వండి అన్నాడు. ఇంకో ఐదు రూపాయలు అని అడిగాడు కండక్టర్ శంకర్! ఎందుకు ఇరవైయే కదా అన్నాడు మధు.

ఉదయం 20 రూపాయలే తీసుకున్నారు కదా? అంటూ జేబులోంచి టికెట్టు తీసి చూపించాడు. మీరన్నది నిజమే. నేనంటున్నదీ నిజమే! డీజిల్ రేట్లు పెరుగుతున్నయ్ కదా! ఆర్టీసీ డీజీల్ సెస్ వేస్తున్నది. మధ్యాహ్నమే టారిఫ్​ మార్చేశారు. ఇకపై డీజిల్ రేట్ల పెరుగుడు మీదనే బస్ చార్జీ ఉంటదన్నాడు శంకర్! ఇదేంటి? అని నసుక్కుంటూనే జేబులో వెతకసాగాడు మధు. మొత్తానికి నాలుగు రూపాయలు పట్టుకున్నాడు. మరో రూపాయి లేదు. ఇప్పుడెలా? అన్నాడు. 'చిల్లర ఇవ్వండి సార్ సతాయించకండి' అంటూ గద్దించాడు కండక్టర్. 'కంగారు పెట్టకండి. చూస్తున్నాను' అంటూ వెతికసాగాడు. పర్సులో ఓ మూలన చిక్కుకుపోయిన రూపాయి బిల్ల చేతికి తగిలింది.. హమ్మయ్యా.. బతికిపోయా అనుకుంటూ ఐదు రూపాయలు చేతిలో పెట్టి టికెట్టు తీసుకున్నాడు.

ఈ కష్టం పగోడి కూడా రావద్దనుకున్నాడు మధుసూదన్. అంతలోనే వెనక సీట్లో ఉన్న సుబ్బారావు మధు సీటు దగ్గరకు వచ్చాడు. ఏం సార్ బాగున్నారా? అంటూ మాటకలిపాడు. 'ఒకప్పుడు బస్ చార్జీలు పెరగడం అంటే వారం రోజుల ముందు నుంచే హడావుడి ఉండేది. ఎక్కడికి ఎంతో పేపర్లలో వచ్చేది అన్నాడు సుబ్బారావు. రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల వాళ్లు ఆందోళన చేసేవారు. బంద్, నిరసనలు, హర్తాళ్లు సాగేవి. చడీ చప్పుడు లేకుండా ఒక్క రోజే ఏడు రూపాయలు చార్జీ పెరిగినా అడిగే నాథుడు కరువయ్యాడు. పొద్దున్న రౌండ్ ఫిగర్ అన్నారు. ఇప్పడేమో డీజిల్ సెస్ అంటు మొత్తానికి ప్రగతి చక్రం పగబట్టేసింది! ఇకపై రోజూ డీజిల్ రేట్లు పెరిగినట్టు బస్సు చార్జీలు కూడా రోజూ పెరుగుతాయేమో? బస్సెక్కాలంటేనే భయమేస్తోంది' అన్నాడు మధు. అంతలోనే ఫీవర్ హాస్పిటల్ స్టాప్ రావడంతో ఇద్దరూ బస్సు దిగిపోయారు.

ఎంఎస్ఎన్ చారి

7995047580

Advertisement

Next Story