- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
యాది: అడవిని గెలిచిన యోధుడు
'దాడులు ఆపాలని, ఆపితే తాము పట్టాలివ్వడానికి వస్తామని తాసిల్దార్ అరిచి చెప్పాడు. దీంతో ఆదివాసీలలో ఆశ పుట్టింది. ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఎదురుదాడికి విఘాతం కలగడంతో సైన్యం పైకి చేరుకోగలిగింది. పైకి వచ్చిన సైనికులు ముఖ్యులను గుర్తించి కాల్పులు జరపడం ప్రారంభించారు. భీమ్ అనుచరులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గందరగోళంలో సైనికులదే పైచేయి అయింది. చాలా మంది కాల్పులలో గాయపడి కింద పడిపోయారు. కెప్టెన్ కాల్పులు జరపడంతో భీమ్ కుప్పకూలిపోయాడు. ఈ పోరాటం అక్కడితో ముగిసింది.'
కొమురం భీమ్ ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక. పలు ఉద్యమాలకు స్ఫూర్తి. 'జల్-జంగల్-జమీన్' నినాదంతో ఉద్యమించిన యోధుడు. గోండు తెగలో కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం సంకేపల్లిలో 22 అక్టోబర్1901న భీమ్ జన్మించాడు. జోడెఘాట్, బాబేఝరి గుట్టలను కేంద్రంగా చేసుకుని నిజాం సైన్యాలపై గెరిల్లా పోరాటం నడిపించాడు.
కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి సహాయంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 8న కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించింది. అతనితో పాటు దాదాపు 200 మందిని హతమార్చింది. అధికారికంగా మాత్రం 12 మంది అని చెప్పారు. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వియుజ మాస పౌర్ణమి. దాంతో అప్పటి నుంచి ఆదివాసీలు ఆ తిథి రోజునే కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకుంటారు. భీమ్ నేతృత్వంలో ఆదివాసీలు
తమకు జీవనాధారమైన అడవి నుంచి తరిమేసే ప్రభుత్వ విధానాలకు, చట్టాలకు, తమ భూములను గిరిజనేతరులు ఆక్రమించుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అడవిని నరికితే జంగ్లాత్ భూమి అని, లేదంటే రెవెన్యూ భూమి అని గోండులను తరిమేయసాగారు. పంటలను ధ్వంసం చేశారు, జరిమానాలు వేశారు. ఈ వేధింపులకు, అణచివేతలకు వ్యతిరేకంగా గోండులు, కోలామ్‌లు పోరుబాట పట్టారు. 12 గ్రామాలలో తుడుం మోగించారు.
కలిసి రావాలని పిలుపు
ఆ పన్నెండు గ్రామాలకే కాకుండా అన్ని గ్రామాలకు కొమురం భీమ్ తన ప్రకటన పంపిస్తాడు. రాంజీ గోండు కలను సాకారం చేయడానికి పోరాటం చేద్దామని పిలుపు ఇస్తాడు. గూడేలు పోరాటానికి సిద్ధమవుతాయి. దీంతో నిజాం బలగాలు వీరి మీద దాడికి బయలుదేరుతాయి. సైనికదాడిని కొమురం భీమ్ దళాలు గెరిల్లా పద్ధతిలో తిప్పికొట్టాయి. గోండులు, కోలామ్‌లలో విజయ ఉత్సాహం వెల్లివెరిసింది. ఆనందం పట్టలేకపోయారు. ఆసిఫాబాద్ జిల్లా యంత్రాంగం కంగు తిన్నది. నిజాం సర్కారు బిత్తరపోయింది.
భీమ్ దళాలు ఉన్న కేంద్రాన్ని ముట్టడించడం కష్టమని, గుట్టల మీది దళాలను దెబ్బ తీయడానికి కింది ప్రజలను హింసించాలని ప్రణాళికలు వేశారు. గుట్టల మీదికి ఆహారం వంటి సరుకులు వెళ్లకుండా దిగ్బంధం చేయాలని నిర్ణయించారు. నిజాం పోలీసులు, అటవీ అధికారులు గూడేల మీద పడి హింసాకాండకు పూనుకున్నారు. దాడులతో పంటలు నాశనమవుతున్నాయి. జోడెఘాట్‌కు సరుకులు అందడం కష్టమైంది. ఈ స్థితిలో కొమురం భీమ్ రెండు నిర్ణయాలు తీసుకున్నాడు.
ఒకటి గ్రామాలలో రహస్యంగా సంచరించి సరుకులు పోగేసుకోవడం, రెండోది పన్నెండు గ్రామాల మీద అధికారం ఇస్తే నిజాంకు విధేయులమై ఉంటామని సర్కారుకు వర్తమానం పంపడం. వెంటనే కార్యరంగంలోకి దిగారు. కొమురం భీమ్ తరఫున రాయబారిగా వెళ్లిన సూరును తాసిల్దార్ దూషించి వెనక్కి పంపించాడు. ప్రతిఘటన కొనసాగించాల్సిన పరిస్థితే ఉందని భీమ్ గ్రహించాడు. సబ్ కలెక్టర్ తో చర్చలూ విఫలమయ్యాయి.
కొనసాగిన లడాయి
లడాయి ప్రారంభించి ఏడు నెలలు గడిచాయి. పోరాటం కారణంగా వ్యవసాయం దెబ్బ తిన్నది. చెక్‌పోస్టుల ఏర్పాటుతో రహస్య దళాలు గ్రామాలలో తిరగలేని వాతావరణం ఏర్పడింది. జోడెఘాట్‌కు సరిగా ఆహార పదార్థాలు అందడం లేదు. కుర్దు పటేల్ సహకారంతో నిజాం సైన్యం దాడికి పూనుకుంది. తుడుం మోగించి పౌజును సిద్ధం చేశాడు కొమురం భీమ్. కొండపైకి ఎగబాకుతున్న సైనికుల మీదికి గోండులు, కోలామ్‌లు బండలు దొర్లించారు. దాంతో సైనికులు చెల్లాచెదురై తమను తాము కాచుకోవడానికి ప్రయత్నించారు.
తుపాకులు పేలుస్తూనే పైకి వస్తున్నారు. దాడులు ఆపాలని, ఆపితే తాము పట్టాలివ్వడానికి వస్తామని తాసిల్దార్ అరిచి చెప్పాడు. దీంతో ఆదివాసీలలో ఆశ పుట్టింది. ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఎదురుదాడికి విఘాతం కలగడంతో సైన్యం పైకి చేరుకోగలిగింది. పైకి వచ్చిన సైనికులు ముఖ్యులను గుర్తించి కాల్పులు జరపడం ప్రారంభించారు. భీమ్ అనుచరులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గందరగోళంలో సైనికులదే పైచేయి అయింది. చాలా మంది కాల్పులలో గాయపడి కింద పడిపోయారు. కెప్టెన్ కాల్పులు జరపడంతో భీమ్ కుప్పకూలిపోయాడు. ఈ పోరాటం అక్కడితో ముగిసింది. (నేడు ఆదివాసీ యోధుడు కుమురం భీమ్ వర్ధంతి)
ఆలేటి రమేశ్
99487 98982