- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అహంభావం దొరహంకారం.. వెరసి పతనం
తెలంగాణ సాధన నాయకుడుగా తనకు తానే ప్రమోట్ చేసుకొని క్లెయిమ్ చేసుకుంటున్న కేసీఆర్ అహంకారం ఉద్యమ కాలంలోనే అనేకసార్లు బయటపడింది. నాటి ఉద్యమ నాయకులను తమ అవసరానికి త్రిబుల్ ఎక్స్ సబ్బుగా వాడుకొని అదను రాగానే ఘోరంగా అవమానించి దుర్మార్గంగా ప్రవర్తించి, మహా మేధావులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే కాక తన కనీస మర్యాద పాటించకుండా గేటు బయటకు మెడపట్టి నూకేసిన దాఖలాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.
నాటి సమాజాన్ని బొంకించి బోర్లేసి
ఆ కాలంలో సహచర నాయకులను ఒక పథకం ప్రకారం దురహంకారంతో కుట్రపూరితంగా సాచివేత ధోరణి పాటించి పొమ్మనలేక పొగ పెట్టారు. ఒక్కొక్క నాయకుని బయటకు పంపించివేశారు. అలా అలా అవినీతి మోసం కుట్ర నిలువెల్లా కలిగిన ఒక ప్రబుద్ధుడు కేసీఆర్ తన పరివారంతో కలిసి తెలంగాణ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నాడు. దానికి తోడు మాటకారితనంతో ‘మియా బీబీ సారెడు బియ్యం’ చాలని నమ్మబలికి గులాబీ ఇన్నోవా కారు నిండా తన కుటుంబాన్ని బ్యాక్ డోర్ నుంచి అరంగేట్రం చేయించాడు. ఆజ్ఞ లేనిది లోనికి రాకూడదు అని కుక్కలున్నాయి జాగ్రత్త అని హౌస్ ఫుల్ బోర్డు పెట్టాడు. ఇక తెలంగాణ సాధన తర్వాత వీళ్ళ అసలు రాజకీయ క్రీడ పీడ తెలంగాణ పట్టిన చీడగా వేయి కాళ్లు జెర్రిగా వేయి కురులుగా పురి విప్పింది. ఈ కుట్రలను మోసాలను కుయుక్తులను గ్రహించిన మేధావులు చాలామంది వీరికి చాలా దూరంగా వెళ్లిపోయారు. మిగతావారు కేసీఆర్ వందిమాగదులుగా ఆస్థానంలో చేరి తెలంగాణ అనంతరం భజన మండలిగా పరిణామం చెందారు.
కేసీఆర్ తెలంగాణ యావత్ సమాజాన్ని సమర్థవంతంగా చాతుర్యంతో మీడియా తోడు రాగా బొంకించి బోర్లేసాడు. పై కారణాల పర్యవసానంగానే పదేళ్లకే బీఆర్ఎస్ తీవ్ర అనారోగ్యానికి లోనై ప్రైవేట్ దవఖానలో షరీకై వెంటిలేటర్‌పై ఆఖరి ఊపిరి తీసుకుంటుంది. తెలంగాణ రాజ్ దర్బార్ కూలుతున్న శకలాల చప్పుడు వినిపిస్తోంది. కేసీఆర్ హయ్యరార్కీలో భాగంగా సామంతులు, జాగిర్దారులు, భూస్వాములు, దొరలు, దొరసానుల సోపానక్రమం నెలకొల్పాడు. చక్రవర్తి, యువరాజు, మంత్రులు, సామంతుల రాజులను తిరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ పాదుకొలిపాడు. ఈ క్రమంలోనే కేసీఆర్ దర్బార్ క్రమంగా బీటలు వారడం ప్రారంభమైంది. అది 2023 నాటికి కుప్పకూలింది.
తమ గోతిని తామే తవ్వుకుని..
ముఖ్యంగా తెలంగాణలో వామపక్ష ఉద్యమాల నుంచి ఎదిగి వచ్చిన యువతరం కేసీఆర్ కొమ్ముగాసింది. ప్రజలను ఎలా వంచించాలో, మోసగించాలో చెప్పిన ప్రగతి శీల ఉద్యమ వీరులు వీరు. గడి చావడిలో ముందు గంగిరెద్దులాటలు ఆడించిన, పాలు తాగిన తల్లి రొమ్మును గుద్దే నమ్మక్ హరామ్‌లు. అందుకే వీరు ప్రభుత్వ పదవులు పొంది తెలంగాణ పేద ప్రజలకు తీరని విద్రోహం చేశారు. మరికొందరైతే తెల్లార వేసి కేసీఆర్ నోట్లో నుండి వెలువడిన ప్రతి పథకానికి వంతుల వారిగా అక్షరాలా కేసీఆర్ బలగానికి అక్షరార్చన చేసిన భక్త శిఖామణులు ఆస్థాన పౌరోహితులు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ జిల్లాలలో విస్తరించిన తెలంగాణ ఆరోగ్య సమాజ పంటకు పట్టిన చీడపురుగులు డజన్ మందికి పైగా ఉంటారు. వీరి భవిష్యత్తు కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచడం రానున్న తెలంగాణ ప్రభుత్వానికి నాయకత్వానికి మంచిది. వీరు గుమ్మి కింది పందికొక్కులు, కోసిన పంటను పొక్కల్లో దాచుకునే చిలుక పలుకుల ఎలుకలు. వీరి పనంతా పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో, సోషల్ మీడియాలో ఊదరగొడుతూ వచ్చిన అభివృద్ధి నంతా తెలంగాణను కరి మింగిన వెలుగపండుగా పరిమార్చడమే! గత తొమ్మిదేళ్లుగా అందకుంటే కాళ్ళు అందితే జుట్టు ఇదే తీరుగా బీఆర్ఎస్ పాలన నడిచింది. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా పరివర్తన చెంది తెలంగాణ తల్లి పేగును తెంచుకున్నది. బీఆర్ఎస్‌గా మారి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి తమ తమ గోతిని తామే తవ్వుకున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో టీఆర్ఎస్ కథ రంజుగా సత్యనారాయణ నోము సిరీస్ కథ సంవిధానంలా ఒక కవి అన్నట్లు రిన్ డెట్టు సారడిన్ తలకాయ నొప్పి సీన్‌గా ప్రధానకథ నడిచి సమాప్తమైంది.
వికటించిన బీజేపీ బీఆర్ఎస్ వ్యూహం
బీఆర్ఎస్, బీజేపీ పార్టీ చీఫ్‌ల మధ్య కుదిరిన అవగాహన, చీకటి వ్యూహాలు ఒప్పందాలను ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడిపించాయి. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక వూడిపోయినట్టయింది. ఈ విషయాన్ని ఈ బంధాన్ని ప్రజలు పసిగట్టలేకపోతారని భావిస్తే, రెండు పార్టీల అధినాయకులు తప్పులో కాలేసినట్టే అయింది. ప్రజలు నిరంతర జాగరూకులు. వారిని తక్కువ అంచనా వేసిన నాయకులు ఈవీఎంల దగ్గర బోల్తా పడి ఇప్పట్లో లేవ లేకుండా బొక్క బోర్లా పడ్డారు.
-జూకంటి జగన్నాథం,
కవి, రచయిత
94410 78095
Also Read: బీఆర్ఎస్‌ఎల్పీ నాయకుడెవరు.. కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్‌రావు..?