- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీని అలా చేసేది కేసీఆర్ ఒక్కడేనా?
75 యేండ్ల స్వతంత్ర భారత్‌లో మెజారిటీ ప్రజల జీవన స్థితులు ఇంకా మెరుగుపడలేదు. పేదలు ఇంకా పేదలుగానే ఉన్నారు. ఆర్థికంగా అందనంత దూరంలోనే ఉన్నారు. అట్టడుగు వర్గాలు, దళితులు, గిరిజనుల పరిస్థితి వర్ణనాతీతం. వారికి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో నేటి పాలకులు ఉన్నారు. దేశం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నది. మతం, కార్పొరేట్ కబంధ హస్తాలలో మగ్గిపోతున్నది. కాషాయ బుల్డోజర్ కింద నలిగిపోతున్నది.
ఎదురు తిరిగితే టెర్రరిస్టులు, అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు. సీబీఐ, ఈడీ కేసులు బనాయించి బొక్కలో తోస్తామంటున్నారు. దేశ ప్రజలు మత, కుల రాజకీయాలతో ఎన్నో అవమానలకు గురవుతున్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది. దేశాన్ని చీకటి ప్రపంచంలోకి నెట్టి కార్పొరేటు గద్దలకు దారులు వేస్తున్నది. నల్ల చట్టాలతో రైతుల నడ్డి విరిచింది. యువతకు యేటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ మోసం చేసింది. అగ్నిపథ్ వంటి స్కీంలతో సైన్యాన్ని నిర్వీర్యం చేయాలని అనుకుంటున్నది. గ్యాస్, పెట్రోల్, డీజీల్, నిత్యావసరాల ధరలు పేదవారికి అందనంత దూరానికి వెళ్లిపోతున్నాయి.
అభివృద్ధికి మోకాలడ్డూతూ
రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న అప్పులకు కేంద్రం నియంత్రణ విధిస్తున్నది. వారికి లొంగి, నచ్చినట్టు ఉంటే రాష్ట్రాలకు అప్పులు ఇస్తుంది. లేకపోతే నీచ రాజకీయాలకు తెర లేపుతుంది. ప్రభుత్వాలను పడగొడుతుంది. మీకు నిజంగా దేశాభివృద్ధిలో చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ మౌనంతో దేశానికి నష్టం చేయకండి. మీ చేష్టలతో దేశం అభివృద్ధిలో వెనక్కిపోతోంది. మీరు మంచి చేస్తారని నమ్మి దేశ ప్రజలు మీకు రెండుసార్లు అధికారమిచ్చారు. కానీ, మీరు దేశానికి చేసిందేమీ లేదు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం తప్ప. ఇలా అయితే, దేశం ఎప్పుడు బాగుపడుతుంది? దేశంలో మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజలకు మంచి చేసి ప్రజల మనసు గెలవండి. అంతేకానీ, దేశంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించే రాజకీయాలు చేయకండి.
బీజేపీ చర్యలను ఎండగడుతూ
దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అంత గొప్పగా చెప్పుకునే మీరు, దేశంలో జరుగుతున్న చీకటి కోణాలపై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు. దేశంలో బీజేపీ రాజకీయాలకు ఎదురుతిరిగి ప్రశ్నించేది కేసీఆర్ మాత్రమే. ఆయన తర్వాత మమత, స్టాలిన్, కేజ్రీవాల్, అఖిలేష్ వంటి నేతలు ఉన్నారు. వీరందరి కన్నా ఎక్కువగా దేశ ప్రజల కోసం పోరాటానికి దిగిన ఫైటర్ కేసీఆర్. దేశంలో జరుగుతున్న అక్రమాలు. దేశ పరిస్థితుల గురించి దాదాపు రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా వివరించి బీజేపీ చర్యలను ఎండగట్టిన నాయకుడు కేసీఆర్. 'జాతి భవితకు గొడ్డలిపెట్టు' అయిన బీజేపీ ప్రభుత్వ చర్యలను దేశ ప్రజల ముందు పెట్టిండు కేసీఆర్. వాటికి సమాధానం చెప్పలేకపోవడం బీజేపీ నాయకులకు సిగ్గుచేటు.
ప్రస్తుతానికి దేశాన్ని నియంతల నుంచి కాపాడే నాయకుడి అవసరం ఉన్నది. లేకపోతే దేశ ప్రజలు ఆగమైతరు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు అవసరం. బీజేపీ అరాచకాలను ఎన్ని రోజులు భరించాలి. నాన్ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి. కేటీఆర్ అన్నట్టు తెలంగాణ నుండే బీజేపీ పతనానికి తిరుగుబాటు మొదలవుతుంది. దేశమంతా కేసీఆర్ విప్లవం వ్యాపిస్తుంది. గుక్కెడు నీళ్ల కోసం, బుక్కెడు బువ్వ కోసం, పని కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం, సాగు నీరు, కరెంట్ కోసం, హక్కుల కోసం ఈ 75 యేండ్ల స్వతంత్ర స్వర్ణోత్సవాల వేళ దేశ ప్రజలు అల్లాడిపోవాలా? ఆలోచించండి.
చిటుకుల మైసా రెడ్డి
జర్నలిస్ట్, సిద్దిపేట
94905 24724