- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడుగుల విజ్ఞాన గని తెలంగాణ..!
బడుగుల హక్కులతో పాటూ విద్య ఆవశ్యకతను చాటి చెప్పి, పాఠశాలలు స్థాపించి, ఆర్థిక అసమానతలు లేని భారతానికి బాటలు వేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగులకు కేజీ టూ పీజీ గురుకులాలు స్థాపించారు. విదేశాలలో పీజీ, ఇతర ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈబీసీ, బీసీ విద్యార్థులకు టీఎస్ మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి స్కాలర్ షిప్ పథకం ప్రవేశపెట్టి జీవితాలల్లో వెలుగు నింపింది. అదే విధంగా విదేశీ విద్య నోచుకోని బీసీ విద్యార్థులకు, జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకునేందుకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేసేందుకు స్వదేశీ విద్యానిధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ఫ్రీ మెట్రిక్ వసతి గృహాల తరహాలో పోస్టుమెట్రిక్‌లో కూడా మౌలిక వసతులు వర్తింపజేసేందుకు నడుం బిగించింది. నూతన రాష్ట్రంలో సరికొత్త ఆలోచనలు, సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా విద్య సామాజిక మార్పును కూడా ప్రభావితం చేస్తుందని బలంగా నమ్మి ప్రోత్సాహానికి ఒడిగట్టారు. స్వదేశీ, విదేశీ విద్యానందిస్తూ బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పించింది.
ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులోకి..
రాష్ట్రం ఏర్పాటు తర్వాత.. విద్యతోనే మానవాళి ప్రగతి సాధ్యమని నమ్మిన వ్యక్తి సీఎం కేసీఆర్. కార్పొరేట్ సంస్థలకు దీటుగా వెనకబడిన తరగతుల విద్యార్థులు చదువుకునేందుకు గురుకులాలు స్థాపించడంతో జాతీయ స్థాయిలో ఏడేండ్లలో గురుకులాలకు చెందిన విద్యార్థులు మెడికల్, జేఈఈలో ఉత్తమ ర్యాంకులు సాధించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బడి, ముబ్బడిగా దోచుకున్న ప్రయివేట్ విద్యాసంస్థలకు మింగుడు పడడం లేదంటే అతిశయోక్తి కాదు. ఏ దేశంలోనైనా మానవ వనరుల అభివృద్ధి కైనా, అధికారం పొందడానికైనా విద్యయే ప్రమాణం. తెలంగాణ ప్రభుత్వం స్వదేశీ విద్యానిధి ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఏఎం, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి 200 సంస్థల్లో ఎక్కడైనా చదుకోవాడానికి బిసీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా 10 వేల మంది విద్యార్థులకు ఏటా లబ్ది చేకూరనుంది, ఇప్పటికే విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించడానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్ లాంటి పది దేశాలకు విస్తరించింది. 2015 నుండి ప్రారంభించిన విదేశీ విద్య ద్వారా ఏటా దాదాపు 300 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు అన్నీ తానై విద్య, జీవన వ్యయ భారం పడకుండా ఆర్థిక సహాయాన్ని ఏకకాలంలో అందిస్తోంది. ఇప్పటికే గురుకులాల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రాథమిక, ఉన్నత విద్య అందుబాటులోకి తెచ్చి, నిరంతరం కృషి చేస్తోంది. దేశంలోను, విదేశాలలోను ఉన్నత విద్యారంగం విస్తరించి వివిధ రకాల సరికొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్ధికాభివృద్ధి, సౌభాగ్యం కోసం విద్యా సంబంధమైన రుణాలు పెట్టుబడిగా అందించాలన్నదే ముఖ్యోద్ధేశంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అయితే ఆర్థిక కోణంలోనే కాకుండా విద్యా ప్రమాణాలు పెంచేందుకు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సత్సంబంధాలు అవసరం ఎంతైనా ఉంది. గ్రామాలు, పట్టణాలలో అక్షరాస్యత రేటును మెరుగుపరచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమ ఫలితాలు అందివస్తున్నాయి.
ఒక్కో విద్యార్థిపై రూ. 1.20 లక్షలు..
మానవ వనరుల అభివృద్ధి జాతీయ లక్ష్యం కాగా ఉన్నత విద్యనభ్యసించే యోగ్యతగల విద్యార్థులు ఆర్థిక కారణాల దృష్ట్యా విద్యనభ్యసించే అవకాశం కోల్పోరాదన్నదే కేసీఆర్ ప్రభుత్వ దృఢ సంకల్పం. తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తు రూపొందుతుందన్న సూక్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణంగా ఆచరిస్తూ అమలు చేస్తున్నారు. కాబట్టే విద్యారంగానికి అమిత ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేడు కేజీ టూ పీజీ 327 గురుకులాలు ప్రభుత్వం చిత్తశుద్ధిని, వాటి విస్తృతి నిరూపిస్తున్నది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక భారం కాకూడదని, ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ.1.20 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. బడుగులకు నాణ్యమైన విద్యను అందించిన ప్రభుత్వం చిత్తశుద్దికి జాతీయ స్థాయిలో సాధించి, నిలిచిన ఫలితాలు నిదర్శనం. గత ఏడు దశాబ్దాలుగా, దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్లు లేని కారణం చేత బీసీలు రాజకీయ, సామాజిక, విద్య, ఆర్ధిక రంగాల్లో తమ హక్కులను కోల్పోతూ వస్తున్నారు. మహనీయుడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మాటల్లో రాజ్యాంగ నిర్మాణంలో బీసీలకు తగినంత రక్షణ దొరక లేదని విచారం వ్యక్తం చేసిన సంగతి విదితమే. గురుకుల అర్హత పరీక్షలో ఒక్కో సీటుకు సుమారుగా 35-40 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారంటే వీటికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయని ‘ఫ్రెంచ్ తత్త్వవేత్త ఆల్బర్ట్ కామస్’ అన్నట్లుగా విపక్షాల హేళనలు తట్టుకుని, అందించిన విజయాల ఘనకీర్తి ఉద్యమ నాయకుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సరిగ్గా సరిపోతుందనేది నిర్వివాదాంశం.
డా. సంగని మల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కేయూ
98662 55355