కథా సంవేదన: గంట

by Ravi |   ( Updated:2023-03-04 18:45:12.0  )
కథా సంవేదన: గంట
X

 మధ్య ఓ స్కూల్ దగ్గరికి వెళ్ళగానే గంట గణగణ మ్రోగింది. ఒక్కసారిగా గంట చుట్టూ ఆలోచనలు చుట్టుముట్టాయి.

ఒకటవ తరగతి వరకు కానిగిరి బడిలో చదివాను. మా సార్ పేరేమిటో తెలియదు. కానీ ఆయనకు రెండు కాళ్ళు లేవు. ఆయన్ని కుంటి పంతులు సార్ అనే అందరూ పిలిచేవాళ్ళు. సాయంత్రం ఐదింటి వరకు బడి వుండేది. ఆ బడిలో గంట లేదు. సార్ మాటే మాకు గంట. ఐదు కాగానే ఇంట్లో చేయాల్సిన హోమ్ వర్క్ గుర్తు చేయించి, ప్రార్థన చేయించి ఇంటికి పంపించేవారు. ఆ సమయంలో ఆయన మాటే మాకు గంటలా విన్పించేది.

ఆ తరువాత ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాను. అది ప్రభుత్వ పాఠశాలే కానీ దాన్ని భద్రయ్య బడి అనేవారు. భద్రయ్య ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కాదు. టీచర్ కూడా కాదు. ఆ స్కూల్ అటెండర్. కానీ అతనే బాగా పాపులర్. మా వూరిలోని అందరూ ఆ బడిని భద్రయ్య బడే అనేవాళ్ళు. సరిగ్గా బడిగంట కొట్టేవాడు. ఆ గంట ఓ గుండ్రంగా వుండేది. ఇత్తడితో చేసింది. ఓ సుత్తె లాంటి దానితో ఆ గంటని కొట్టేవాడు. అతను ఎప్పుడు గంట కొడతాడా ఎప్పుడు ఇంటికి పరుగుపెడదామని చూసేవాళ్ళం. ఆ గంటని కొడదామని కూడా అనిపించేది.

అక్కడి నుంచి మిడిల్ స్కూల్‌కి, ఆ తరువాత హై స్కూల్‌కి వెళ్ళాం. అక్కడ కూడా గంట వుండేది. మొదటి గంట, రెండవ గంట కొంతసేపు మోగేది. మా అటెండర్ దాన్ని ఆ విధంగా మోగించేవాడు. క్లాస్ సమయం అయిపోయిన తరువాత ఒక్కటే గంట కొట్టేవాడు. అది టంగుమని మా బడి మొత్తంగా వినిపించేది. సాయంత్రం బడి అయిపోయే ముందు మాత్రం గంట కాస్సేపు మోగేది. ఆ గంట శబ్దానికి పిల్లలం అందరం ఎగిరి గంతులేస్తూ మా స్కూలు గ్రౌండ్ వైపు పరుగు తీసేవాళ్ళం. రెండవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు గంట చుట్టూ మా ఆలోచనలు తిరిగేవి. తెలుగు క్లాసు ఉన్నప్పుడు తప్ప గంట ఎప్పుడు మోగుతుందా అని చూసేవాళ్ళం.

బడి గంట కాలేజీకి పయనమైన తరువాత గంట అదృశ్యమైంది. ఆ తరువాత బెల్ వచ్చేసింది. కాలేజీల్లో పెద్ద బెల్లు వుండేది. బటన్ మీద చేయి వేస్తే చాలు. అది గణగణమని మ్రోగేది. కరెంటు లేనప్పుడు మాత్రమే గంటని ఉపయోగించే వాళ్ళు. కాలేజీ, యూనివర్సిటీ చదువు అయిపోయి న్యాయవాదిగా మారిన తరువాత మళ్ళీ గంట నా జీవితంలోకి వచ్చింది.

కోర్టులో గంట వుండేది. కోర్టు అటెండర్ గంటని కొట్టేవాడు. అడ్వకేట్లు అందరూ ఆ గంట శబ్దం వినగానే కోర్టు హాల్ దగ్గరికి పరుగెత్తుకొని వచ్చేవాళ్ళు. పోలీసులు, క్లయింట్లూ సరేసరి. ఆ శబ్దంతో అందరూ అలర్ట్ అయ్యేవారు.

మధ్యాహ్నం రెండు గంటలకి, ఆ తరువాత రెండున్నరకి గంట మోగేది. రెండు గంటలకు మోగిన గంటతో అందరూ కోర్టు రూం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. రెండున్నరకి మోగిన గంటతో మళ్ళీ కోర్టు గదిలోకి పరుగెత్తేవాళ్ళం. న్యాయవాది నుంచి న్యాయమూర్తిగా మారిన తరువాత ఈ గంట శబ్దంతో అనుబంధం మరీ ఎక్కువైపోయింది. న్యాయవాదికి వున్న స్వేచ్ఛ న్యాయమూర్తికి ఉండదు. తన కేసు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు న్యాయవాది కోర్టు గదిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కేసులు న్యాయమూర్తివే కనుక ఆయన గంట సమయాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. ఆ విధంగా 28 సంవత్సరాలు గంటతో సహజీవనం చేయాల్సి వచ్చింది.

పదవీ విరమణ చేసిన తరువాత గంట అనేది నా జీవితంలో ప్రాధాన్యతని కోల్పోయింది. ఇప్పుడు గంటతో నిమిత్తం లేకుండా పోయింది. ఒక ఒరవడికి అలవాటు పడిన నాకు ‘గంట’ అనే వస్తువు ప్రాధాన్యత తగ్గినట్టుగా అన్పించింది.

ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళినప్పుడు, స్కూలుకి వెళ్ళినప్పుడు గంట గుర్తుకొస్తుంది. ఆలోచనలు గతం వైపు పరుగెడతాయి. అకాడమీల్లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు కూడా బెల్ మోగి ఆ గంటను గుర్తుకు తెస్తాయి. ఇవేవి లేనప్పుడు మా ఆవిడే గంట మాదిరిగా మారి నన్ను నవ్విస్తుంది. నా పనులని చేయిస్తుంది. అంతేకాదు ఇప్పుడు ‘డెడ్‌లైన్’ కూడా గంట మాదిరిగా పనిచేయిస్తుంది.

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Advertisement

Next Story