- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం అన్ని పార్టీల ఏటీఎం!
నీళ్లు - నిధులు - నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టి లక్ష కోట్లు అప్పు తెచ్చి కమిషన్ల కోసం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో ప్రాణహిత చేవెళ్ల నుండి కాళేశ్వరంగా మారిన ప్రాజెక్టు బీజేపీ, బీఆర్ఎస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలకు ఏటీఎం అయిందని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వివిధ పార్టీలకు వచ్చిన వందల కోట్ల విరాళాల ద్వారా తేటతెల్లం అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే దందా లో ఔర్ చందా దొ అనే విధంగా అయింది. అరవై ఏళ్లు అన్యాయానికి దోపిడీకి గురైన తెలంగాణ ప్రజలు మళ్లీ అదే దోపిడీకి గురి కావడానికి మాత్రం రాజకీయ పార్టీలకు అధికారం అప్పజెప్పడం లేదు. ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించి పాలిస్తే బాగుంటుంది.
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KIPCL) ద్వారా అప్పు తెచ్చిన లక్ష కోట్లకు ప్రతీ నెల పదివేల కోట్లు ప్రభుత్వం వడ్డీల రూపంలో చెల్లిస్తుంది. గత సంవత్సరం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం వలన బ్యారేజీలో నీళ్లు నిలువ చేసి ఎత్తలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకు ఎల్ & టీ సంస్థ పిల్లర్లు కుంగిన ఏడవ బ్లాక్ ముందు వరద ముంపు లేకుండా ప్రొటెక్షన్ వాల్ నిర్మించి పిల్లర్ల కింద ఏర్పడిన బుంగను పూడ్చి గేట్లను కట్ చేసి తొలగించడం జరిగింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రాణహిత నుండి వరద ఉన్నందువల్ల నీళ్లు నిల్వ చేస్తే మళ్లీ బ్యారేజ్ కుంగిపోయే ప్రమాదం ఉందని మొత్తం బ్యారేజీ 85 గేట్లు తెరిచి ఉంచడం జరిగింది. అంటే ఈ సంవత్సరం గోదావరి నీళ్లు ఒక్క చుక్క కూడా స్టోరేజ్ చేయలేం, ఎత్తిపోయలేం కాబట్టి గోదావరి నీళ్లు బంగాళాఖాతం పాలు.
ప్రచారం మోతే కానీ...
ఏ ఉద్దేశంతో గత ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టు నిర్మించడం జరిగిందో ఆ ఉద్దేశం నెరవేరుతుందా? ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో అని టాక్సులు చెల్లించే ప్రజలు, మేధావులు ఆలోచించాలి. లక్షల కోట్లు అప్పులు తెచ్చి కమీషన్ల కోసం సబ్ కాంట్రాక్టు కంపెనీలకు పనులు అప్పజెప్పి టైం బౌండ్ విధించి వందల సంవత్సరాలు నిలవాల్సిన ప్రాజెక్టు ఆఘమేఘాల మీద నిర్మించి లిఫ్టింగ్ ఏ రివర్ అని డిస్కవరీ ఛానల్‌లో ప్రచారం చేసి శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగింది అని దశాబ్ది ఉత్సవాలు నిర్వహించి కేవలం నాలుగు సంవత్సరాలలోనే పిల్లర్లు కుంగిపోయే నాసిరకం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత గత ప్రభుత్వానిది.
ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకుని
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అయిందని స్వయాన దేశ ప్రధానమంత్రి, హోం మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర బీజేపీ నాయకులు గత ఐదేళ్లుగానే కాదు... అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చి ఏటీఎం అయిందని ప్రచారం చేయడం తప్ప ఎంక్వయిరీ చేసి అవినీతిని బయటకు తీసింది లేదు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యుసీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అని స్వయానా సెంట్రల్ వాటర్ కమిషన్ అడ్వైజర్ వెదిరే శ్రీరామ్ ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రాజెక్టు కుంగడానికి మేం బాధ్యులం కాదని, మా ప్రభుత్వానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ప్రాజెక్టు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని నిర్మించడం జరిగింది. కాబట్టి, అందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
బాండ్స్ చెబుతున్న నిజాలు
ఇంకోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడిగా ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు సీడబ్ల్యుసీ ఇచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు, జాతీయ హోదా కూడా ఇవ్వలేదు ప్రచారం చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాజెక్టు లోపాలను వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలే అని ప్రచారం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ప్రాజెక్టు పేరు ఊసెత్తలేదు. దీనికి కారణం విరాళాల రూపంలో వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ కావచ్చు అనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్ ప్రచారం తప్ప పెద్దగా మార్పు ఏమీ కనిపించడం లేదు.
విచారణలో మార్పు లేదు!
కాళేశ్వరం ప్రాజెక్టులోని వైఫల్యాలను అవినీతిని వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటివరకు సేకరించిన సమాచారం ఆశాజనకంగా లేదు. టైం బౌండ్ విధించి నిర్మాణం పనులు సబ్ కాంట్రాక్ట్ కంపెనీలకు అప్పజెప్పడం నాణ్యతలేని నిర్మాణ పని వల్లనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయని సమాచారం తప్ప అవినీతి అక్రమార్కుల మీద ఎలాంటి పురోగతి సాధించిందీ, వెలికి తీసింది లేదు. విచారణ పేరుతో ఇలా కాలయాపన చేయడానికి ఈ కమిషన్ వేశారని ప్రజల అభిప్రాయం. నేనేమన్నా ఇంజనీర్‌నా అని కేసీఆర్ మాట మార్చడం వలన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంజనీర్లు ఒకరిపై ఇంకొకరు వ్యతిరేకంగా అఫిడవిట్లు సమర్పిస్తున్నారని సమాచారం.
ప్రభుత్వాధికారం చేతులు మారినప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో పెద్దగా మార్పు ఏమీ కనిపించడం లేదు. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం పొలిమేరల దాకా తరిమికొట్టాలి - అదే ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతిపెట్టాలి అని కాళోజీ అన్నాడు. అరవై ఏళ్లు అన్యాయానికి దోపీడీ గురైన తెలంగాణ ప్రజలు మళ్లీ అదే దోపిడీకి గురి కావడానికి మాత్రం రాజకీయ పార్టీలకు అధికారం అప్పజెప్పడం లేదు. ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించి పాలిస్తే బాగుంటుంది.
బందెల సురేందర్ రెడ్డి
మాజీ సైనికుడు
83749 72210