అమరావతి రైతులకు.. ఏం సమాధానం చెబుతారు?

by Ravi |   ( Updated:2023-10-19 00:30:53.0  )
అమరావతి రైతులకు.. ఏం సమాధానం చెబుతారు?
X

డిసెంబర్ నెలాఖరు నుండి పూర్తిగా పాలనా యంత్రాంగమంతా విశాఖకు వచ్చేస్తుందని విశాఖలో ఇన్పోసిస్ డెవలప్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి విశాఖకు వెళితే రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి ఏం సమాధానం చెబుతారు? రైతుల శవాల మీదుగా రాజధానిని విశాఖకు తరలిస్తారా? రాజధాని మార్పు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా రాజధానిని విశాఖకు తరలిస్తామనడం ఏమిటి? రాజధాని మార్పుపై సీఎం జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కాదా?

సీఎం జగన్ రెడ్డికి న్యాయస్థానాలన్నా, రాజ్యాంగం అన్నా, ప్రజాస్వామ్యం అన్నా ఏ మాత్రం గౌరవం లేదు. విశాఖకు తరలించి విశాఖ నుండి పాలన చేసి ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెప్పడం ఆ ప్రాంత ప్రజలను మోసగించడమే అవుతుంది. అమరావతి నుంచి కార్యాలయాలు తరలించరాదని హైకోర్టు విస్పష్టంగా ఆదేశించినా. మూడు రాజధానులపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతున్నా రాజధానిని మార్చేందుకు జగన్‌ ప్రభుత్వం దొంగ దారిని ఎంచుకుంది. అందుకే ఏకంగా అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు [హెచ్‌వోడీలు] స్పెషల్‌ ఆఫీసర్ల మకాం విశాఖకు మార్చేలా కుట్ర పన్నారు. దీనిపైనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జీవోలు జారీ చేశారు.

అమరావతి రెక్కలు విరిచేశారు

విశాఖ సముద్ర తీర ప్రాంతం, సహజసిద్ధ ప్రకృతి అందాలతో పాటు ఖనిజ వనరులు అపారంగా ఉన్నందునే విశాఖపై ముఖ్యమంత్రి జగన్‌కు అవ్యాజ ప్రేమ తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాత్రం కాదు. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్యనేతల బినామీలు విశాఖలో తిష్ట వేశారు. వైసీపీ కీలక నేతలంతా నగరం చుట్టుపక్కల స్థిరాస్తులు సంపాదించారని ప్రజలు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. వైసీపీ నాయకులకు విశాఖ తమకు సంపద గనిగా మారిన పరిస్థితుల్లో పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్‌ రెడ్డి హడావుడి చేస్తున్నారు. మరోవైపు రాయలసీమకు మొండిచేయి చూపుతున్నారు.

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుందన్న అసూయ, అక్కసుతోనే అవాస్తవాలతో అమరావతి రెక్కలు విరిచారు. అమరావతి రాజధాని విషయంలో నియంతలు పాలించినా ఇంత కర్కశంగా వ్యవహరించేవారు కాదు. స్వార్ధానికి, కుట్రలకు, కుతంత్రాలకు నిలయంగా మారిన వైసీపీ మంత్రులను, నాయకులను ప్రజలు ఉపేక్షించరు. ప్రజా ద్రోహులైన స్వార్థ పాలకుల చేతుల్లో రాష్ట్ర భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. పాలన చేతకాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రాంతాల మధ్య విషం పోసి ప్రాంతీయ విద్వేషాలు రగిలించే ప్రయత్నాలను మొదలుపెట్టారు. వైసీపీ నాయకులు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ప్రజలను రెచ్చగొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ మంత్రులు, నాయకులు నాలుగున్నరేళ్ళు విశాఖలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అమ్మేయడం, మిగిలిన భూములు అధికారపక్ష నాయకులు కబ్జా చేయడం తప్ప ఉత్తరాంధ్రకు చేసిన మేలు ఏమిటో చెప్పగలరా? రాజధానిగా అమరావతి పీక నులమడానికే మనసులో ఉన్న కారణాలు బయటికి చెప్పకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ కవరింగ్ ఇస్తున్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పగలరా?

సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి...

ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయన్నది నిజమే. ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, రవాణా సౌకర్యాల్లో వెనుకబాటు ఉందని, పెద్ద సంఖ్యలో అత్యంత వెనుకబడిన గిరిజనులు (పి.వి.టి.జి) ఈ ప్రాంతంలో ఉన్నారని జీఓలో చెప్పారు. మరి రాయలసీమలోని నిత్య కరువు పీడితమైన ప్రకాశం, పల్నాడు జిల్లాల మాటేమిటి? రక్షిత మంచినీరు కూడా లభించని వెనుకబడిన ఆ పది జిల్లాల అభివృద్ధికి కూడా ఇటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేస్తారా? రాయలసీమ ప్రజల అభివృద్ధి జగన్ రెడ్డి ప్రభుత్వానికి అవసరం లేదా?

విశాఖకు రాజధానిని తరలించడం అంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు, వసతి సదుపాయాలను కూడా విశాఖలో ఏర్పాటు చేయడానికంటూ జారీ చేసిన బూటకపు జీఓ 2015 చూస్తే జగన్ మోసం అర్ధం అవుతుంది. ప్రభుత్వం చీకటి జీవోలో ఎన్ని నంగనాచి నీతి కబుర్లు చెప్పినా, ముఖ్యమంత్రి నాలుగేళ్లుగా ఊదర గొడుతున్న మూడు రాజధానుల ప్రణాళిక మేరకే దొంగ జీఓ 2015 విడుదల చేశారని ప్రజలే అంటున్నారు. వెనుకబడిన ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ ఆ ప్రాంతంలో పర్యటించాల్సి వస్తుందట. ఆ సమయాల్లో ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి పర్యటిస్తారట, రాత్రిపూట కూడా అక్కడే బస చేయాల్సి వస్తుందట, ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపేందుకు ముఖ్యమంత్రి విశాఖలో బస చేస్తారట. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయి సిబ్బందికి తక్షణమే చేరవేయడం సాధ్యపడుతుందట. ఈ ప్రక్రియ సజావుగా సాగడం కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు, ఇతర సహాయ సీనియర్‌ అధికారులకు వసతి సౌకర్యాలను అక్కడ ఏర్పాటు చేయాల్సి వస్తోంది అని 2004- 2015 జీవోలు జారీ చేసి ఉత్తరాంధ్రా వెనుకబాటుతనం గురించి పెద్ద ఉపోద్ఘాతం రాశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇటువంటి కృషి అవసరమని ఇప్పుడే ప్రభుత్వానికి గుర్తుకు వచ్చిందా? నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చీకటి జీవోలతో రాజధానిని దొడ్డిదారిలో విశాఖకు తరలిస్తున్నారు. విశాఖలో సీఎం కార్యాలయం, ప్రభుత్వం శాఖలు ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రా అభివృద్ధి అవడం సాధ్యమా?

చతికిలబడిన ఉత్తరాంధ్ర

అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ మంత్రులు, నాయకులు తమ నాలుగున్నరేళ్ల పరిపాలనలో ఉత్తరాంధ్రను ఉద్ధరించింది ఏమిటి? అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటే ఉత్తరాంధ్రలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేసి అదనంగా ఒక్క ఎకరానికి అయినా సాగునీరు ఇచ్చారా? కొత్తగా ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క రోడ్డు అయినా నిర్మించారా? ఉత్తరాంధ్రాకి కేంద్రం ద్రోహం చేస్తున్నా జగన్ ప్రభుత్వానిది ప్రేక్షక పాత్రే. పెట్రో యూనివర్సిటీ వంటి సంస్థల నిర్మాణం పూర్తి కాలేదు. విశాఖ మెట్రో రైలు అటకెక్కింది. గిరిజన యూనివర్సిటీ అతి గతి లేదు. రైల్వే జోన్ అడ్రస్ లేదు. ఇక ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఒక ప్రహసనంగా మిగిలింది. ఉత్తరాంధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును పూర్తిగా అమ్మేస్తున్నా జగన్ నోరు మెదపడం లేదు. ఉత్తరాంధ్రకు జీవనాడిగా నిలిచే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రకటనలకే పరిమితమైంది తప్ప అంగుళం కూడా ముందుకు కదల లేదు. ఉత్తరాంధ్ర లోనే అతి పెద్ద నదిగా ఉన్న వంశధారపై రెండవ దశ నిర్మాణం, మహేంద్ర తనయపై ఆఫ్‌ షోర్‌ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రాధాన్యతల లిస్టులో ఉన్నా పని మాత్రం ఆ దిశ గా ఒక్క అడుగు పడలేదు. వంశధారపై ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్ ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవడం మినహా పనిలో పురోగతేమీ లేదు. విజయనగరం జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగులో ఉన్న జంఝావతి, తారకరామ తీర్థ సాగర్‌ ప్రాజెక్టులు పడకేశాయి. జిల్లాలోని తోటపల్లి కాలువల నిర్మాణం కూడా చివరి వరకు పూర్తి కాలేదు. ఇలా సాగునీటి ప్రాజెక్టులలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పురోగతేమీ లేదు.

ఉత్తరాంధ్రలో ఉపాధి కల్పించే పారిశ్రామికీకరణ కూడా పడకేసింది, పాదయాత్రలో మూతబడ్డ జూట్ పరిశ్రమను తెరిపిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జూట్‌, సుగర్‌ పరిశ్రమలను తెరిపించకపోగా విశాఖ జిల్లాలోని చిట్టివలస జూట్‌ మిల్లును పూర్తిగా మూసేసేలా సెటిల్మెంటు చేశారు. నెల్లిమర్ల జూట్‌ మిల్లు యాజమాన్యం ఆ మధ్య లాకౌట్‌ విధించింది. ఉత్తరాంధ్రలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన రంగమైన జూట్‌ పరిశ్రమ నేడు పూర్తిగా చతికిలబడి ఉపాధి కల్పన ఉత్తిత్తి గానే మిగిలి పోయింది. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఫార్మా, రసాయన పరిశ్రమల నుండి రక్షణకు చర్యలేమీ లేవు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ వ్యాధి సూపర్‌ స్పెషాలటి ఆసుపత్రికి స్వయంగా ముఖ్యమంత్రే 2019లోనే శంకుస్థాపన చేసినా నేటికీ పునాది దశ దాటి ముందుకు వెళ్లలేదు. ఈ నాలుగున్నరేళ్లలో జగన్ పాలనలో ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకే నెట్టబడిందని చెప్పాలి. పాలనలో విఫలమై ప్రజలను సంతృప్తి పరచలేక టక్కు టమారా విధ్యలతో విషం పోసి ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో పడ్డారు. రాష్ట్రాన్ని ప్రజలను కాపాడే ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో ప్రజలు వేసిన తప్పటడుగులే నేడు వారికి శాపంగా మారాయి. కావునా ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రను ఏం ఉద్దరించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Advertisement

Next Story