- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో కౌరవ పతనం ఖాయమేనా?
2018 తర్వాత తెలంగాణ ప్రజలు ఒక్కొక్క ఎన్నికలో విజయాన్ని అందిస్తూ బీజేపీకి ఒక్కొక ఆయుధాన్ని అందిస్తున్నరు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ధర్మ యుద్ధంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే వందమంది కౌరవులలో ఒకరిగా మిగిలిపోతరు. నియంతృత్వ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి గెలిస్తే, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే పాండవులలో ఒకరిగా నిలిచిపోతరు. కేసీఆర్ భూమ్మీదికి దిగొస్తరు. ఒక్క మునుగోడు ఫలితంతో ప్రభుత్వం మారదు. కానీ, కేసీఆర్ నేలకు దిగివస్తరు. వచ్చే సాధారణ ఎన్నికలలో దిగిపోతరు. తెలంగాణకు ఈ పాడుపాలన నుంచి విముక్తి లభిస్తుంది. కాబట్టి, మునుగోడులో బీజేపీ గెలుపు ఒక చారిత్రక అవసరం.
ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టంతా మునుగోడు కురుక్షేత్రంపైనే ఉన్నది. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఇది దేశంలోనే అతి ఖరీదైన ఎన్నికగా మారిపోయింది. ఈ కురుక్షేత్రంలో బీజేపీ ధర్మాన్ని నమ్ముకుంటే, టీఆర్‌ఎస్ పార్టీ తమ అధికారాన్ని, డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నది. ప్రజల ఇష్టాన్ని, ప్రయోజనాన్ని బట్టి ఫలితం ముందుగానే స్పష్టమైన కురుక్షేత్ర ధర్మయుద్దమిది. ఈ ఎన్నికను కురుక్షేత్రంగా పోల్చడానికి వెనకున్న కారణం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కౌరవులంటే ఇష్టం.
అందుకే 2018లో 88 సీట్లు గెలిచినా, కౌరవులపై ఉన్న మమకారంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన సంఖ్యా బలాన్ని నూరుకు తగ్గకుండా చేసుకున్నరు. ఇప్పుడు ఆ నూరుమందినే మునుగోడులో ఊరికొకరిని పంపించిన్రు. మరి తమ మంది మార్బలంతో ఊర్లల్లో తిష్ట వేసిన ఈ గుంపు ఏం చేస్తున్నది? మునుగోడు ప్రజల కష్టం ఏంది? వాళ్లకు ఏం కావాలే? ఏం కోరుకుంటున్నరు? క్షేత్ర స్థాయిలో కష్టాలు చూసి వాళ్ల అభివృద్ధి కోసం ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నరా? అంటే అదేం లేదు. దావత్‌లు చెయ్యాలే, డ్యాన్సులు చెయ్యాలే, డబ్బులతో ఓట్లు కొనాలే. ఇంతకు మించి వీరు ఏం చేయడం లేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కోతి చేష్టలు చూసి ఊర్లల్ల జనం యేవగించుకుంటున్నరు. అధికారం కోసం వీళ్లు ఎంతకైనా దిగజారుతరని ఇప్పుడు మునుగోడు ప్రజలే స్వయంగా చూస్తున్నరు.
ఇది డ్రామాల ప్రభుత్వం
తెలంగాణలోని పేద ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డ ఎన్నిక ఇది. కేసీఆర్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ, గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇది తెలుసుకున్న కేసీఆర్ భయంతో వంద మంది ఎమ్మెల్యేలు, మంత్రుల టీమ్‌ని మునుగోడులో దింపిన్రు. తమ నియోజకవర్గాల సమస్యల్ని గాలికొదిలేసి, మునుగోడులో తిరుగున్న టీఆర్‌ఎస్ నాయకులకు తాము 2014,2018లో తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏమేం అమలు చేశారో చెప్పే దమ్ము ఉందా? వీళ్లు గల్లీల్లో తిరుగుతన్నప్పుడు ' మా డబుల్ బెడ్రూం ఇండ్లు ఏవి?' అని ప్రజలు మర్లవడాలే.
తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయినా కృష్ణ గోదావరి నుంచి సాగు నీరు అందలేదు. దళితులకు మూడు ఎకరాల భూమి రాలే. భూమి ఇయ్యకుంటే, ఇస్తనన్న దళిత బంధూ ఇయ్యలే. గౌడన్నల కోసం ఎనిమిదేండ్ల నుంచి ఏమీ చెయ్యని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల కోసం 'గౌడ సమ్మేళనం' అంటూ డ్రామాలు మొదలుపెట్టింది. ప్రజాసంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ లో సర్వాయి పాపన్న ఖిలాషాపూర్ గుండా పాదాయాత్ర సాగుతుందని ప్రకటించగానే, ఎనిమిదేండ్లుగా పట్టించుకోని టీఆర్‌ఎస్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించింది. ఎన్నికల కోసం గౌడన్నల మీద ప్రేమను నటిస్తున్నది.
Also read: పక్షపాత పాలనలో టీఆర్ఎస్! సాక్ష్యాలివే అంటోన్న బండి సంజయ్
అమలు కాని హామీలు
చేనేతలకు చేతినిండా పని కల్పిస్తామని వాగ్దానం చేసిన టీఆర్‌ఎస్ వారిని నిలువునా మోసం చేసింది. చేనేత బీమా, పన్ను రాయితీ, యంత్రాలు ఇస్తమని చెప్పి మోసం మాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నది. రైతులకు మాటిచ్చినట్టుగా రుణమాఫీ చేయలేదు. ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి మాట తప్పిన్రు. 24 గంటల కరెంట్ మాట కూడా ఉత్తిదే అయ్యింది. అన్నింటికన్నా ముఖ్యమంగా ఫ్లొరైడ్, మూసీ కాలుష్య నీటి ప్రవాహంతో నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలు విషపూరితంగా తయారయ్యాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చర్య అయినా తీసుకున్నదా? తెలంగాణ వచ్చినంక కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని నీళ్లు పారినయో అవే నీళ్లు పారుతున్నయ్. ఈ దుస్థితికి కారణం కేసీఆర్ అసమర్థ పాలన కాదా? బీసీ కార్పోరేషన్ లోన్లు, ఉపాధి లోన్లు ఇయ్యడం లేదు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా కేసీఆర్ అణచివేస్తున్న తీరును ప్రజలు గమనించాలే.
మెడకు ఉరితాడు వేసుకొని, కేసీఆర్‌కుకి ఓటు వేయొద్దని చెబుతూ ప్రజల కాళ్లు మొక్కుతున్న ఓయూ జేఏసీ విద్యార్థులు మునుగోడులో తిరుగుతున్నరు. నాడు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులే నేడింత ఆవేదన చెందడానికి కారణం కేసీఆర్ కాదా? ఇంటికో ఉద్యోగం ఇస్తమని, ఉద్యోగం ఇవ్వకుంటే రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తమని విద్యార్థులను మోసం చేసింది టీఆర్‌ఎస్. కేజీ టు పీజీ ఉచిత విద్య తన కల అని చెప్పి పేదవాళ్ల కలల్ని నాశనం చేసింది టీఆర్‌ఎస్. చర్లగూడెం, నర్సిరెడ్డి గూడెం, వెంకపల్లి, లెంకెపల్లి తండా, శివన్న గూడెం, లక్ష్మీపురం గ్రామస్తులు చర్లగూడెం రిజార్వాయర్‌లో భూములు కోల్పోయిన్రు. తమకు న్యాయంగా రావాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని నెలల తరబడి ధర్నాలు చేస్తుంటే, ఇప్పుడు మంత్రులు వచ్చి నోటి మాట కింద నష్టపరిహారం చెల్లిస్తమని చెప్పిపోవడం డ్రామా కాదా?
అన్నీ గాలి మాటలే
ఇగ, 2018 ఎన్నికలప్పుడు ఆకుపచ్చ మునుగోడు చేస్తనని కేసీఆర్ గాలి మాటలు చెప్పిన్రు. ఆ ఆకుపచ్చ మునుగోడు ఎక్కడయినా కనపడుతున్నదా? పక్కనే కృష్ణా నది పారుతున్నా, మునుగోడు ముంగిట్లో ఒక్క చుక్క సాగునీటి తీసుకురాలేని చేతగాని పాలన కేసీఆర్‌ది. చౌటుప్పల్‌కి డిగ్రీ కాలేజీ ఇస్తమని మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది. ఈ మోసాలను మునుగోడు ప్రజలు మర్చిపోలేరు. ఈ నూరు మంది ఎమ్మెల్యేలు (కౌరవులు) ఒక్కసారి గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలో అభివృద్ధి ఎట్లా ఉందో చూసి బుద్ధి తెచ్చుకోవాలే. తమ నియోజవకవర్గాలను అద్దంలో చూసుకొని విషయం గ్రహిస్తే రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో అర్థం అవుతుంది. ఈ వందమందికి నిజంగా తెలంగాణ ఉద్యమం మీద అవగాహన ఉంటే, తమ తమ నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే వారి నియోజకవర్గంలో ఉపఎన్నిక రావడానికి కారణమయ్యేవారు. కానీ, కేసీఆర్ కింద బానిసలుగా ఉండాలనుకునే వీళ్లలాంటి వారి వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు.
అన్ని నియోజకవర్గాలను ఒకేలా చూడని టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు వల్లనే ఈ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నిక చాలా మార్పులు తెచ్చింది, ఇంకా తీసుకురాబోతోంది. ఉద్యమాలు చేసినా రాని గట్టుప్పల్ మండలం రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చింది. చౌటుప్పల్-నారాయణపురం రోడ్డు విస్తరణ పనులు రాజగోపాల్ రెడ్డి రాజీనామతో మొదలయినయ్. ఆగమేఘాల మీద రోడ్లకు మరమ్మతులు, గ్రామాలలో చేసిన పనులకు బిల్లులు, చేనేత బంధు, గొర్రెల కాపారులకు నగదు బదిలీ.. ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లనే వచ్చినయ్ కానీ, టీఆర్‌ఎస్‌కి మునుగోడు మీద ఉన్న ప్రేమ వల్ల కాదు! మిగతా నియోజకవర్గాలు ఏం పాపం చేశాయి?
Also read: యువత కోసం ఈ యాత్ర! ప్రభుత్వ వైఫల్యాలపై బండి సంజయ్ స్పెషల్ ఎడిటోరియల్
ఇవిగో మేమిచ్చిన నిధులు
మునుగోడుకు కేంద్రం ఏం ఇచ్చిందో కూడా చేప్తా. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గానికి ఒక్క ఉపాధి హామీ పథకంలోనే రూ. 167 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇంచుమించు 62 వేల మంది ఈ పథకం కింద ఉపాధి పొందుతున్నరు. మునుగోడులో నిర్మించిన 42 రైతు వేదికలకు ఖర్చు చేసినవి కేంద్రం ఇచ్చిన నిధులే. మునుగోడు పరిధిలో ఉన్న 164 గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 14,173 మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులిచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 51,092 మంది రైతుల ఖాతాలలో ఏటా ఆరు వేల రూపాయల నగదును జమ చేస్తున్నది. మొక్కల పెంపకానికి రూ. 27 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ. 67.48 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 54 .98 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన 20.70 కోట్లు ఈ నియోజకవర్గానికి కేంద్రమే ఇచ్చింది.
ఇక జాతీయ రహదారుల నిర్మాణం మొత్తం కేంద్రమే చూసుకుంటున్నది. ప్రభుత్వ పాఠాశాలలకు మధ్యాహ్న భోజనం నుంచి అన్ని రకాల సౌకర్యాలకు కేంద్రం వాటగా నిధులు ఠంచనుగా చెల్లిస్తున్నది. మరి, మునుగోడుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క ఏంటో చెప్పగలదరా? ఒకవేళ కేంద్రం నిధులకు రాష్ట్ర నిధులు కూడా తోడయ్యి ఉంటే, మునుగోడు కూడా సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజవర్గాల్లాగే అభివృద్ధి అయ్యేది కాబట్టి, ఈ ఉపఎన్నికే వచ్చేది కాదు. కేసీఆర్ సవతి తల్లి ప్రేమను, కుటుంబ పాలనను తరమికొట్టడానికే ఈ రోజు బీజేపీ ఈ ఉపఎన్నిక ద్వారా పోరాటం చేస్తున్నది.
కబ్జాలు, అరాచకాలే
ఆపదలలో ఆదుకునే వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరుంది. టీఆర్‌ఎస్ గెలిస్తే కబ్జాలు, అరాచకాలు జరుగుతాయి తప్ప, అభివృద్ధి జరగదనే విషయం మునుగోడు ప్రజలు 2018లోనే అర్థం చేసుకున్నరు. కాబట్టే, అంతకుముందు టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పక్కకు పెట్టిన్రు. ఇప్పుడు మళ్లీ ఆయన్ను గెలిపిస్తే ఏం జరుగుతుందో మునుగోడు ప్రజలకు బాగా తెలుసు. టీఆర్‌ఎస్ పార్టీకి తమ కార్యకర్తల నమ్మకాన్ని తాకట్టుపెట్టిన ఎర్రగులాబీలను, టీఆర్‌ఎస్ తో 'జోడీ యాత్ర' చేస్తున్న కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఇప్పుడు మునుగోడు ప్రజల ముందు ఉన్నది.
2018 తర్వాత తెలంగాణ ప్రజలు ఒక్కొక్క ఎన్నికలో విజయాన్ని అందిస్తూ బీజేపీకి ఒక్కొక ఆయుధాన్ని అందిస్తున్నరు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ధర్మ యుద్ధంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే వందమంది కౌరవులలో ఒకరిగా మిగిలిపోతరు. నియంతృత్వ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి గెలిస్తే, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే పాండవులలో ఒకరిగా నిలిచిపోతరు. కేసీఆర్ భూమ్మీదికి దిగొస్తరు. ఒక్క మునుగోడు ఫలితంతో ప్రభుత్వం మారదు. కానీ, కేసీఆర్ నేలకు దిగివస్తరు. వచ్చే సాధారణ ఎన్నికలలో దిగిపోతరు. తెలంగాణకు ఈ పాడు పాలన నుంచి విముక్తి లభిస్తుంది. కాబట్టి, మునుగోడులో బీజేపీ గెలుపు ఒక చారిత్రక అవసరం.
బండి సంజయ్‌కుమార్
ఎంపీ, కరీంనగర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు