- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదేనా?
భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కింది! మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు మన ప్రధాని నరేంద్ర మోడీ! మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఫాదర్ ఆఫ్ పవర్ కుస్తీ బిడ్డలపై దాష్టికాన్ని ఆదివారం దేశం అంతా చూసింది! ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి, మహిళల కోసం 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం కోసం పీఎం ఉపన్యాసం ఇస్తున్న తరుణంలో, 35 రోజులుగా జంతర్ - మంతర్ వద్ద కుస్తీ బిడ్డలను వందల మంది పోలీసులు ఈడ్చుకెళ్లి, అరెస్టు చేసిన దృశ్యాలు కనిపించాయి! తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, కుస్తీ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ మహిళా కుస్తీ ఛాంపియన్ బిడ్డలు సత్యాగ్రహం, ధర్నా చేస్తున్నారు! సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అతని మీద ఒక ఫోక్సో కేసు సహా రెండు కేసులు నమోదు అయ్యాయి! కానీ పోలీసుల చర్యలు లేవు, పైగా తాను గతంలో ఒకరిని కాల్చి చంపానని, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు! తాను నార్కోటిక్ టెస్ట్‌కు రెడీ అంటాడు, పీఎం,హోమ్ మంత్రి చెబితే అరెస్టు అవుతానంటాడు! తాను ఐదుసార్లు ఎంపీగా గెలిచాను అంటాడు! తనకు తిరుగు లేని బలం ఉందని, మైండ్ గేమ్‌తో బీజేపీ నేతలను బ్లాక్ మెయిల్ చేస్తాడు!
భారత బిడ్డల ఆత్మఘోష!
దాదాపు 40 కేసులలో ఇరుక్కుని ఉన్న ఈ అతిపెద్ద క్రిమినల్ బ్రిజ్ భూషణ్ ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి వెళ్లి కూర్చున్నాడు! గౌరవం పొందాడు! ఒక ఫోక్సో కేసులో నిందితుడు ఇంత బరితెగించడం, బహుశా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది మొదటి సారిగా పేర్కొనవచ్చు! డెకాయిటీ, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, మర్డర్, అటెంప్ట్ టూ రేప్ లాంటి కేసులు బ్రిజ్ భూషణ్ మీద ఉన్నాయి! బీజేపీ నేతల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల మీద, చివరికి మంత్రుల మీద కూడా ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరి మీద రేప్ కేసుల ఆరోపణలు ఉన్నాయి! మదర్ ఆఫ్ డెమోక్రసీలో బాధిత ఆడపిల్లల గొంతు వినే వారు కనిపించడం లేదు. వినేష్ పొగట్‌ను, సునీతా పొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పున్యను అరెస్టు చేసిన తీరు దారుణం! ఛాతి మీద బూట్లు, వీపు మీద లాఠీల మోత కనిపించింది! వీరిని తీసుకుని వెళుతున్న సందర్భంలో వినేష్ పొగట్ మాట్లాడుతూ పోలీసులు తమని ఎక్కడికి తీసుకెళ్లుతున్నారో తెలియదని, దేశం తన బిడ్డలకు ఇస్తున్న గౌరవం చూడండి అంటూ వాపోయారు! దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రశ్నించే గొంతుకలను, బాధితులను, మానవ హక్కులను అణిచివేస్తున్నారు అన్నారు. తమపై అణిచివేతలు తప్పనిసరిగా చరిత్రలో లిఖించబడుతాయని అన్నారు. ఎందరో భారత్ బిడ్డల ఎన్నో అన్యాయాల ఆత్మ ఘోష ఇది! దీనికి మూల్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం చెల్లించక తప్పదు!
ఆడబిడ్డలకన్నా పవర్ ముఖ్యమా?
మరోవైపు ఆదివారం కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్లనీయకుండా వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన మహిళా రైతులను ఎక్కడికక్కడ నిలిపివేసారు! ఇండ్ల వద్దే గృహ నిర్బంధం చేశారు! చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు! గాజిబోర్డర్ వద్ద రైతు ఐక్య వేదిక నేత రాకేష్ తికాయత్‌ను, వేలాది మంది రైతులను నిలిపివేయగా తమ ఆందోళన కుస్తీ బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఇక్కడనే నిరవధికంగా కొనసాగిస్తాము అన్నారు. రోడ్ల మీదే ఎక్కడికక్కడ మహిళా రైతులు కూర్చుని నిరసన తెలిపారని వినేష్ పొగట్ కూడా అన్నారు! దేశం ప్రమోట్ కావడమంటే ఆడబిడ్డల చేత కన్నీళ్లు పెట్టించడమేనా మోదీజీ! చెప్పండి! ఆడపిల్లలు తమపై సాగుతున్న అత్యాచారాల విషయంలో గొంతు ఎత్తవద్దు, తల్లిదండ్రులకు చెప్పవద్దు, గొంతు ఎత్తితే ఏం జరుగుతుందో! చూడండి! అంటూ కేంద్రం తన రాజకీయ పవర్ ద్వారా చూయిస్తున్నది! నిజానికి ప్రతీ చోటా లైంగిక వేధింపులు ఉంటాయి! అన్ని రంగాల్లోను ఎంతో ఓపికగా మహిళలు భరిస్తూ ఉంటారు! వీడు మారకపోతాడా అనుకుని బయటకు చెప్పరు, చెబితే తమ భవిష్యత్తుకు ఇబ్బందిగా భావిస్తారు! అయితే అది శృతి మించినపుడే బిడ్డలు ఓపెన్‌గా ఇలా కుస్తీ బిడ్డలు బయటకు వచ్చినట్లు, వచ్చి న్యాయం కోసం పోరాడుతారు!
ఈ విషయం ప్రధాని మోడీకి పక్కాగా తెలుసు, ఒలంపిక్‌లో మెడిల్స్ తెచ్చినపుడు వినేష్ పొగట్ తదితరులను పిలిచి మోడీ ప్రశంసించినపుడు వారు బ్రిజ్ భూషణ్ వ్యవహారం గురించి ప్రధానికి చెప్పారు! అయినా ఈ విషయాన్ని నరేంద్రమోడీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. అంటే దేశంలోని ఆడబిడ్డలకన్నా ఆయనకు పవర్ ముఖ్యం అనేది తేలిపోయింది! 2024 లో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యం! అందులో గెలువడం ముఖ్యం! ఆడబిడ్డల పరువు, ప్రతిష్టలు ముఖ్యం కాదు! అయినా న్యాయ పోరాటం ఆగేట్లు లేదు! జంతర్ - మంతర్ వద్ద టెంట్లు కూల్చి బిడ్డల సామాగ్రి అంతా తీసేసి ఆ స్థలాన్ని పోలీసులు ఆక్రమించినా, మరో చోట ఆందోళన ఉంటుంది! ఇది మహిళా లోకం ఇజ్జత్ కా సవాల్ అయిపోయింది! ఈ దేశ బిడ్డలను అవమానాలకు గురి చేసిన పరిస్థితి!
బేటీ పడావో, బేటీ బచావో ఇదేనా!
దేశంలోని ప్రతీ గడప నుంచి దీనిపై నిరసనలు తెలుపాల్సిన సమయం! కుస్తీ బిడ్డలకు అండగా నిలబడాల్సిన తరుణం! తానా షాహీ గిరికి బుద్ధి చెప్పి, మట్టి కరిపించాల్సిన సమయం! ఆజ్ నహీ తో కల్ నహీ! మరోవైపు మహిళ అయిన మన దేశం రాష్ట్రపతికి పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ ఆహ్వానం కూడా లేదు! 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతకన్నా చీకటి రోజు ఏముంటుంది! బేటీ పడావో, బేటీ బచావో అంటే ఇదేనా! మహిళలకు కనీస గౌరవం లేదా జనాభాలో సగం ఉన్న మహిళల మీద గౌరవం ఇదేనా? లైంగిక వేధింపుల విషయంలో బిడ్డలు ఎప్పుడూ అబద్దం చెప్పరు! మన దేశంలో ఆడపిల్లను దేవిగా గౌరవం ఇస్తాం! ఆ గౌరవం ఏమైపోయింది మోదీజీ! బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసే బదులు కుస్తీ బిడ్డలను, వారి మద్దతు దారులను అరెస్ట్ చేసి 109 మంది మీద కేసులు పెట్టారు! ఇదేమి న్యాయం మోదీజీ! ఇలా న్యాయం కోసం పోరాడే గొంతుకలను అణిచివేయడం వల్ల ఏమి సాధిస్తారు? కుస్తీ బిడ్డల ఘోష వినండి! బ్రిజ్ భూషణ్‌ను తక్షణం అరెస్టు చేయండి!
ఎండి.మునీర్,
సీనియర్ జర్నలిస్ట్,
99518 65223