రాష్ట్రంలో మానవ హక్కులకు చోటెక్కడ?

by Ravi |   ( Updated:2023-06-16 00:30:33.0  )
రాష్ట్రంలో మానవ హక్కులకు చోటెక్కడ?
X

మెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ 2021-22 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నివేదిక విడుదల చేసింది. ఏయే దేశాల్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారో అనే అంశంపై ప్రతి ఏడాది ఒక నివేదికను విడుదల చేస్తుంది. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. దేశంలో అనేక చోట్ల మతహింస, రాజ్యహింస, మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతున్నట్లు ఆ నివేదికలో వెల్లడించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన ఉంది? ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎలా హరిస్తున్నారనే అంశాలను ఈ నివేదికలో ప్రత్యేకంగా పొందుపర్చారు.

ప్రశ్నించిన వారిని నేరస్థులుగా చూస్తూ..

ఏపీలో పాలకపక్షం పోలీసు వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తున్నదీ, వారి ద్వారా ప్రతిపక్షాలను, ప్రశ్నించే వారిని, మీడియాను ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నది ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులను పొందుపర్చారు. విశాఖలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో కిరణ్ అనే యువకుడిని పోలీసులు కొట్టి చంపారు. అక్రమ ఇసుక దందాను ప్రశ్నించిన వరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 11 మంది అమాయకులు చనిపోయారు. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన 68 ఏళ్ల రంగనాయకమ్మపై కేసులు నమోదు చేశారు. గంజాయి, జూదం వంటి అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చారనే నెపంతో జర్నలిస్ట్ చెన్నకేశవులను పొడిచి చంపారు. భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కులు ఉల్లంఘిస్తూ అతి క్రూరమైన చట్టాలతో హింసిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దారుణాలు 150కి పైగా గుర్తించడం జరిగిందన్నారు. సొంత పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణ రాజును పోలీసులు విచక్షణారహితంగా కొట్టడాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ప్రజలపై అనేక రూపాల్లో అధికార పక్షం నాయకులు, పోలీసులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.

ప్రపంచంలో అనేక దేశాల్లో మానవ హక్కులు, పౌర హక్కులు హరించివేస్తున్నారని ఆలోచిస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అసలు జీవించే హక్కునే కాలరాస్తున్నారు. మొత్తం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి రాజ్యాంగ విలువలను అపహాస్యం పాలుచేస్తూ రాజ్యహింసకు పాల్పడుతున్నారు. పత్రికా స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తున్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. పాత్రికేయుల్ని ప్రాసిక్యూట్‌ చేస్తున్నారు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛపైనా ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని నేరస్థులుగా పరిగణించి వారిపై దేశద్రోహం లాంటి నేరాలు మోపుతూ వేధిస్తున్నారు. ఫ్యాక్షన్ పడగనీడలో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇనుపసంకెళ్లు వేసి ఖాకీల క్రౌర్యం రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం విధానాలపై ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు ఉంటుంది. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఈ విధమైన కక్ష సాధింపులతో, పగ, ప్రతీకారంతో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదు. బ్రిటీష్ వారి పాలనలో కూడా లేని నిర్బంధ కాండ ఇప్పుడు కొనసాగుతుంది.

ఎప్పుడూ లేని నిర్బంధాలు చూపిస్తూ..

పోలీసులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. పోలీసులు ప్రజల, ప్రతిపక్షాల హక్కులు, స్వేచ్ఛను కాపాడాలి. ఈ నాలుగేళ్లలో ఎంత మంది పోలీసు అధికారులు హైకోర్టు మెట్లెక్కి దిగారో చెప్పనక్కరలేదు. పలుమార్లు డీజీపీ స్వయంగా హైకోర్టు ముందు హాజరు అయి వివరణ ఇచ్చుకోవాల్సి దుస్ధితి. పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు, సుప్రీంకోర్టులు తూర్పార పట్టాయి. ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాలను, కొన్ని టీవీ ఛానళ్లను, పత్రికలను వేధించడం జగన్ ప్రభుత్వానికి ఒక వికృత క్రీడగా మారింది. నాలుగేళ్లుగా ఈ తరహా నిర్బంధ కాండ సాగుతూనే వుంది. అధికార పార్టీ నాయకులు ఎంత ఉన్మాదంగా చెలరేగిపోతున్నా, పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజావ్యతిరేక చర్యలు ప్రశ్నించడం ప్రతిపక్షం, మీడియా బాధ్యత అని పోలీసులు గుర్తించాలి.

రాష్ట్రంలో 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసి, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వున్న చంద్రబాబును తన సొంత నియోజకవర్గంలో తిరగనివ్వలేదు. లోకేష్ యువగళం పాదయాత్రకు సైతం అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. సొంత పార్టీ పార్లమెంట్ రఘురామకృష్ణంరాజు, మరికొంతమంది దళితులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఆ వ్యవస్థకు మాయనిమచ్చగా మిగిలిపోయింది. ఎంపీపై జరిగిన దౌర్జన్యం ఒక ఎత్తయితే పార్లమెంట్ సభ్యునిగా తన సొంత నియోజకవర్గంలో తిరిగే స్వేచ్ఛ, రక్షణ కూడా కరువయ్యాయి అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? నెల్లూరు కోర్టులో ఫైల్స్ మాయమైన సంఘటన మొదలు బూతు వీడియోల వరకు పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన వివరణ ఆ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టింది. అధికారపక్షంలో ఉన్నవాళ్ళు కళ్ళు పీకి, కుళ్ళబొడిచినా, కాళ్ళువిరిచి కత్తులతో పొడిచినా, శిరోమండలాలు చేసినా పట్టించుకొనే దిక్కులేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులను బాధితులుగా, బాధితులను నిందితులుగా మారుస్తున్నారు. సొంతబాబాయి హత్యకేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పైనా పోలీసులు కేసులు పెట్టారు. ఎస్సీలపై సైతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అమరావతి రాజధాని రైతులపై వేధింపులకు ఇక అంతే లేదు. అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ కార్యాలయం అడ్డాగా మారింది. సీఐడీ వారు పెడుతున్న కేసులన్నిటిలో కోర్టుల్లో భంగపాటు ఎదురవుతున్నా, చీవాట్లు పెడుతున్నా సీఐడీ తీరుమారడం లేదు. బ్రిటిష్ కాలంలో కానీ ఎమర్జెన్సీలో కానీ ఇలాంటి నిర్బంధాలు చూడలేదు. పోలీసుల పని తీరుకు, వారు అనుసరిస్తున్న అధికార పార్టీ పక్షపాత ధోరణిని ఎన్సీఆర్బీ నివేదిక తూర్పార పట్టింది.

చట్టం తమ చుట్టంగా మార్చి..

గతంలో పోలీస్ వ్యవస్థను ఏ ప్రభుత్వం ఇంత నీచంగా వాడుకున్న పరిస్థితి లేదు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అరాచకం, విధ్వంసం, దాడులు వదిలేసి అధికారపార్టీ నాయకుల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. మాకు ఎదురు రావడమే మహానేరం అన్న విధంగా పరిపాలన సాగిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల కేసుల విషయంలో చట్టం అధికారంలో వున్న వారికే అండగా ఉంటుంది. అధికారపార్టీ ఫిర్యాదులపైనే పోలీసులు స్పందిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అమల్లోకి తీసుకువస్తున్నారు. దానికి ప్రతిరూపమే జీవో నెం.1. రాష్ట్రంలో రాజద్రోహం కేసులు పెరిగాయి. జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దేశద్రోహం కేసు పెట్టడం పోలీసులకు ఆనవాయితీగా మారింది. సుప్రీంకోర్టు కూడా తప్పు బట్టిన సెక్షన్ 124 కేసులు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదుకావడం జగన్ రాచరిక పాలనకు అద్దం పడుతుంది.

అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన మానవ హక్కుల నివేదికల్లో గడచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్నింటినే అగ్రరాజ్యం ప్రస్తావించింది. ఇతర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కీర్తి, ప్రతిష్టలు తీసుకురాలేకపోయినా అరాచకం, అణచివేతల్లో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు, పాలకపక్ష నియంతృత్వ, పైశాచిక ధోరణులను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తన నివేదికల్లో స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికగా జగన్ సర్కార్ గత నాలుగేళ్లలో చేసిన పగ, ప్రతీకారం, అహంకారపూరిత, రాజ్యహింసను బట్టబయలు చేసింది. అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన మానవ హక్కుల నివేదికల్లో వీటిని ప్రముఖంగా ప్రస్తావించిన తర్వాత కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినట్లు లేదు. ఇంకా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టం వైసీపీ చుట్టంగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసులోని కుట్ర కోణం వెలుగులోకి రాకుండా సాక్షాత్తూ ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నాడు. బాబాయి హత్య కేసు సమగ్ర విచారణ జరిగితే తన మెడకు కూడా చుట్టుకుంటుందని భయపడుతున్నాడు. జగన్ రెడ్డి నిజస్వరూపం ప్రపంచ వేదికపై బహిర్గతమైంది. ఇకనైనా కక్షసాధింపు, పగ, ప్రతీకారాలకు స్వస్తి చెప్పాలి. హింసకు తావులేని శాంతియుత పాలన కొనసాగాలి. మానవ హక్కులకు, పౌర హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

9949777727

Advertisement

Next Story