- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరుంధతి రాయ్‌పై 'ఉపా' చట్టం సమంజసమా?
అరుంధతీ రాయ్‌పై ఎప్పుడో 14 ఏళ్ల క్రితం ఒక సభలో ఆమె ప్రసంగించిన విషయం ఆధారంగా పాత కేసును తిరగదోడి ఇప్పుడు ఉపా చట్టం ప్రయోగించి ఆమెను అరెస్టు చేయ్యాలనడం విచిత్రం. సమసమాజం కోసం పరితపించి నిరంతరం కృషి చేసిన ఆమెపై అకారణంగా 'ఉపా' చట్టాన్ని ప్రయోగించడం అమానుషం.
అరుంధతీ రాయ్ సుప్రసిద్ధ రచయిత్రి. సామాజిక అసమానతలపై పోరాడిన ఉద్యమకారిణి. మన దేశంలో 'బుకర్ ప్రైజ్' పొందిన మొట్టమొదటి మహిళా రచయిత్రిగా చరిత్ర సృష్టించారు. 'నర్మదా బచావో ' ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. తన రచనల ద్వారా మతోన్మాదాన్ని, సామాజిక, ఆర్థిక దోపిడీ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.
సామాజిక సమస్యలపై పోరాటం
దైనందిన జీవితంలో ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే అనేక సమస్యలను, సవాళ్లను అరుంధతీ రాయ్ తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చారు. అలాగే సమకాలీన ప్రపంచంలో మానవ మారణ హోమానికి కారణమయ్యే ఉగ్రవాదం, ఫాసిజం దాష్టికాలను అజాదీ అనే పుస్తకంలో కండ్లకు కట్టినట్టు రాశారు. ఆమె రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు ఎందరి జీవితాలనో ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఈ వ్యాస సంపుటికి 'ఆజాదీ' అనే పేరు సరిగ్గా సార్ధకమైందని బహుమతి అందించిన ఫౌండేషన్ కితాబ్ ఇచ్చింది. ఎలాంటి కల్పితాలు లేకుండా వాస్తవాల ప్రాతిపదికన ఉన్నాయని కూడా ప్రశంసించింది.
అలాగే ఆమె అనేక పత్రికలలో వివిధ సందర్భాలలో రాసిన విమర్శనాత్మక వ్యాసాలు సమకాలీన రాజకీయ పరిస్థితులు, మానవ సామూహిక జీవన సంస్కృతికి సంబంధించిన అనేక కోణాలను ప్రతిభింభించాయి. ఈ వ్యాసాలను 2014లో పెంగ్విన్ ఇండియా ప్రచురణ కర్తలు 5 సంపుటాలుగా తీసుకొచ్చారు. 2019 లో 'హే మార్కెట్ బుక్స్' ప్రచురించిన 'మై సెడిషియస్ హార్ట్' అనే సంపుటిని నాన్ ఫిక్షన్ పుస్తకంగా తీసుకొచ్చారు.
ఆమె చేసిన నేరం ఏమిటి?
నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రజలకు మేలు చేయకపోగా భవిష్యత్తులో మహా ప్రళయంగా మారి కీడు చేస్తుందని, అనేక వన్య జీవులు అంతరించి పోతాయని, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని లక్షలాదిమంది గిరిజన ప్రజలు నిర్వాసితులు అవుతారని శాస్త్రీయంగా ఆలోచించి, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మేధాపాట్కర్ లేవనెత్తిన మహా ఉద్యమంలో అరుంధతీ రాయ్ కూడా కలిసి ఆమెతో సమఉజ్జీగా పనిచేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి చైతన్యం, అవగాహన కల్పించారు. తనకు ప్రైజ్‌గా వచ్చిన డబ్బును సైతం ఈ ఆందోళనకు విరాళంగా ఇచ్చిన గొప్ప మనసున్న దాత అరుంధతీ రాయ్.
'ఉపా' చట్టం ప్రయోగం ఎందుకు?
ఆమె రాసిన అనేక విమర్శనాత్మక వ్యాసాలు, ఇచ్చిన ఉపన్యాసాల సారం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉంది. భారీ పరిశ్రమలు రసాయన వ్యర్థాలను వెదజల్లి నదీ జలాలను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. ఆర్థిక వృద్ధి పేరుతో, సహజ వనరులను దోచుకోవటం, విచక్షణా రహితంగా అడవుల నరికివేతను అడ్డుకున్నారు. పర్యావరణ చైతన్యం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు నిర్మిస్తున్నారు అని ఆమె పై ఆరోపణలు వచ్చాయి. భారత ప్రభుత్వ సామాజిక, ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ అనేక రచనలు చేస్తున్నారు అని మరో ఆరోపణ. అలాగే చారిత్రిక నేపథ్యంలో 'కశ్మీర్ సమస్య'పై 14 ఏళ్ల కిందట బాహాటంగా ప్రసంగించారు. దాంతో ఆమెపై కేసు పెట్టి ఆనాడే జైలుకు పంపారు. ఇప్పుడు ఆ కేసును మరోమారు తిరగదోడి 'ఉపా' చట్టం ప్రయోగించారు.
బ్యాంకు రుణాల దొంగల్ని వదిలేసి..
వ్యాపారం ముసుగులో వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసిన దొంగలను, అక్రమ వ్యాపారులను, అనేక ఆర్థిక స్కాంలు చేసిన నేరస్తులను పట్టుకొని శిక్షించటంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టకుండా.. కేవలం ప్రజల పక్షాన తన గొంతును వినిపిస్తూ, కలం ఝులిపిస్తున్న అరుంధతీ రాయ్ పై మాత్రం 'ఉపా' కేసుతో అడ్డుకోవడం ఎంతవరకు సబబు? ఇంతకు ఆమె చేసిన నేరం ఏమిటి? మతోన్మాద విధానాలను ఎప్పటికప్పుడు రాయ్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిరుద్యోగ సమస్యపై ఉపన్యాసాలు ఇస్తూ యువతకు చైతన్యం కలిగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తనకు ఇచ్చిన పురస్కారాన్ని సైతం వెనక్కి ఇచ్చారు. అందుకే ఆమెపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది.
మీడియాపై, రచయితలపై యుద్ధం!
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చర్యలతో ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులతో పాటు మీడియా స్వేచ్ఛ అణచివేత కొనసాగుతోంది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల ప్రాథమిక హక్కుల కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టిన ఎందరో కవులను, రచయితలను, జర్నలిస్టులను, సంపాదకులను, ప్రొఫెసర్లను, సామాజిక ఉద్యమకారులను అణచివేయడానికి కాలం చెల్లిన రాజద్రోహం, దేశద్రోహం ముద్రలు వేసి అక్రమ కేసులు పెట్టడం, జైళ్ళలో బెయిల్ కూడా రాకుండా సెక్షన్లు పెట్టి నిర్భందించటం అన్యాయం, అక్రమం. ఇలాంటి ప్రభుత్వ కక్షపూరిత చర్యలు ఎంతవరకు సమంజసమో సామాన్య ప్రజలు, యువత, విజ్ఞులు ఆలోచించి ఐక్యంగా ఉద్యమించాలి. స్వేచ్ఛాయుత రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలి.
డా. కోలాహలం రామ్ కిశోర్,
98493 28496