- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆత్మ అనిర్వచనీయమేనా?
ఇటీవల బుద్ధుని తత్వం గురించి రాసిన ఒక వ్యాసం చదివాను. దీనిలో రచయిత 'బుద్ధుడు ఆత్మ గురించి చర్చించలేదు' అంటూనే, ‘బుద్ధుడు ఆత్మవాది’ అనే అభిప్రాయం కలిగే రీతిలో వాదించారు. అదెలాగో చూడండి.
“అసలు ఆత్మ శాశ్వతమా అశాశ్వతమా అనేది నిర్ణయించి చెప్పడం కష్టం. ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నవాడు కాబట్టే ఆత్మను పంచ స్కంధాలుగా అతడు (బుద్ధుడు) విభజించాడు. రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనే ఈ ఐదు తత్వాలు ఆత్మకు సంబంధించినవే. ఈ ఐదింటి కలయికే ఆత్మ. ఇదీ బుద్ధుడి అభిప్రాయం. కానీ దీన్ని అతడు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు” అంటూ రచయిత,“ఆత్మ నిత్యానిత్యాలకు అతీతమైనదని తెలుస్తోంది” అని వ్యాఖ్యానించారు.
చెప్పనిది చెప్పినట్లుగా వక్రీకరించి..
బుద్ధుని అభిప్రాయం అంటూ రచయిత ఉటంకించిన పై వాక్యాలు, ఆత్మ గురించి బుద్ధుడు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ‘రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనే ఈ ఐదు తత్వాలు ఆత్మకు సంబంధించినవే’ అనేది ఆ రచయిత సొంత అభిప్రాయం. బుద్ధుడు ఇలాంటి అభిప్రాయం ఎక్కడా, ఏ రూపంలోనూ వ్యక్తం చేయలేదు. ఈ విషయాన్ని రచయిత కూడా అంగీకరించారు. అయితే, పంచ స్కంధాల గురించి బుద్ధుడు చెప్పింది ఏమిటి అనే విషయాన్ని వ్యాస రచయిత అసలు పరిగణించలేదు. ఈ విషయమై బుద్ధ వచనం ఏం చెబుతుందో చూద్దాం.
ఏదీ నాదీ కాదు, నీది కాదు...
స్కంధ సంయుక్త లోని అనాత్మ లక్షణ సూత్రంలో, బుద్ధుడు ఈ విషయాన్ని ఎటువంటి సందిగ్ధతకు తావులేకుండా వివరించాడు. 'రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనేవి అనిత్యం, వాటి పట్ల కలిగే రాగం దుఃఖానికి దారితీస్తుంది. కాబట్టి, వీటిలో ఒక దానిని గాని (లేదా ఉమ్మడిగా ఐదు స్కంధాలను గాని) ‘ఇది నాది’ (ఏతం మమ), ‘ఇది నేను’ (ఏసోహమస్మి), ‘ఇది నా ఆత్మ’ (ఏసో మే అత్తా) అని భావించటం గానీ సరికాదు' అని బుద్ధుడు ప్రకటించాడు. ఈ సంయుక్తలో గల 150 సూత్రాలు ఇదే విషయాన్ని వివిధ రకాలుగా వివరించాయి.పంచ స్కంధాలు గురించి ఈ రకమైన బోధనలు బుద్ధవచనంలో ఇంకా చాలా చోట్ల ఉన్నాయి.
అనాత్మవాది బుద్ధుడు
క్లుప్తంగా చెప్పాలంటే, ‘రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనే ఈ ఐదు తత్వాలు ఆత్మకు సంబంధించినవే. ఈ ఐదింటికలయికే ఆత్మ’ అనే మాటలు బుద్ధుని బోధనలకు విరుద్ధం. మనిషిలో ఎక్కడా ఆత్మ లేదని నిరూపించటానికి బుద్ధుడు పంచస్కంధాలను విశ్లేషించాడు. దీనికి విరుద్ధంగా, ‘ఆత్మను పంచ స్కంధాలుగా అతడు విభజించాడు’ అని ప్రకటించటం అవగాహనా రాహిత్యం. బుద్ధుడు అనాత్మ వాది. ఆయన ఆత్మవాదాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ‘ఆత్మ నిత్యానిత్యాలకు అతీతమైనద”ని లేదా “ఆత్మ అనిర్వచనీయమ”ని బుద్ధుడు భావించినట్లు చెప్పటానికి కించిత్తు ఆధారం కూడా బుద్ధవచనంలో కనిపించదు.
డి. చంద్రశేఖర్
92900 91232