- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లీడర్ డర్టీ లాంగ్వేజ్ వలన సమాజంలో జరిగే అనర్థాలేంటి?
ప్రజలు ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా స్పందించి, ప్రతిఘటించి, ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడే వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. మన అభ్యుదయం అరచేతిలో వాడే ఫోన్‌లోనే ఆగిపోతే, ఇలాంటి పరిస్థితులను, వ్యక్తులను ఆపకపోతే ముందు తరాలకు బతుకు మీద భరోసాను అందించలేము. మనం ఓటు హక్కుకే పరిమితం కారాదు. అప్రజాస్వామిక పోకడలను, అసాంఘిక కార్యకలాపాలను, అన్యాయాలను, అవినీతిని, అబద్ధపు ప్రచారాలను, ప్రలోభాలను సంఘటితంగా ప్రతిఘటించాలి. మానవీయ, నైతిక విలువలను, నీతి, నిజాయితీతో ప్రజాస్వామ్యాన్ని రక్షించేవారిని ఎన్నుకోవడం మనందరి ముఖ్యమైన బాధ్యత.
ఓ దేశ పరిపాలనా విధానం, ఆ దేశ అభివృద్ధి మంచి నాయకుడి మీద ఆధారపడి ఉంటాయి. వ్యవస్థకు, వ్యక్తులకు మధ్య నాయకుడు నిస్వార్థంగా ఉండగలిగినపుడే అభివృద్ధికి బీజం పడుతుంది. పాలితుల జీవితాల బాధ్యత పాలకుడి మీదనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన దేశం పాలకుడినెప్పుడూ తండ్రి స్థానంలోనే ఉంచింది. తండ్రి దారితప్పితే కుటుంబం వీధి పాలవుతుంది. సరి అయిన నిర్ణయం తీసుకోలేని నాయకుడు ప్రజల బతుకులను ఆగం చేస్తాడు.
నాయకుడు వ్యక్తిత్వంగానూ, సామాజికంగానూ, రాజకీయంగానూ, ఆదర్శప్రాయంగానూ ఉండాలి. ఇష్టాలు, అభిప్రాయాలు బహిర్గతం చేసుకునే హక్కు ఉన్నప్పటికీ, అది అవతలివారి జీవితాలను శాసించనంత వరకే ఉండాలి. ప్రజా సంక్షేమానికి పార్టీలు, నాయకులు అనుసరించిన ఆదర్శాలు సమాజంలో ఏ విధమైన మార్పునకు దోహదపడుతున్నాయో ప్రజలతోపాటు కాలం, చరిత్ర గుర్తుంచుకుంటాయి. ప్రజలు వింటున్నారనే స్పృహ లేకుండా మాట్లాడటం రాజకీయ విలువలను దిగజార్చడమే అవుతుంది.
అవే ఆదర్శ పాఠాలుగా
నాయకులు చేసుకునే విమర్శలు, ప్రతి విమర్శలు వ్యవస్థలో మంచి మార్పులకు తోడ్పడాలి. వ్యక్తిగతంగా ఆపాదించుకునే దుర్భాషలు, దూషణలు కక్షపూరిత చర్యలకు దారి తీస్తున్నాయి. ఇది ప్రజలలో పరోక్షంగా విషబీజాలు నాటుతున్నాయి. నాయకులు అభివృద్ధి కోసం కాకుండా, వ్యక్తిగత దూషణ కోసం ప్రెస్ మీట్‌లు పెట్టడం ఏ నైతికతకు నిదర్శనం? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం విపక్షాల విధి. దాంతో అధికార పార్టీ తన పొరపాట్లను సరిచేసుకోవాలి. లేదా స్పష్టమైన సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. పార్టీలు విలువలను పక్కకు పెట్టి రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నాయి. ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. కొంతకాలం ఉండిపోయే పదవి కోసం నాయకులు తమ వ్యక్తిత్వాలను కోల్పోతున్నారు.
ప్రస్తుతం రాజకీయం అంటేనే అబద్ధాలు మాట్లాడడం, వాగ్దానాలు తప్పటం, ఉన్నది లేనట్టు చెప్పడం అన్న ధోరణి కొనసాగుతోంది. యువ నాయకులను వీటినే ఆదర్శవంత పాఠాలుగా అనుసరించేలా పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఎంతగా ప్రలోభ పెడితే అన్ని రోజులు అధికారంలో ఉంటామనేది పార్టీల ముఖ్య లక్షణంగా కనిపిస్తున్నది. అధికార, ప్రతిపక్షాల శత్రుత్వ ప్రభావం నాయకుల కంటే కార్యకర్తల మీద, పార్టీని అభిమానించే ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల చెప్పినట్టు 'మెరుగైన సమాజ అభివృద్ధికి పార్టీలు పోటీపడాలి తప్పా ఒకరినొకరు తొక్కుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించకూడదు' మాట మనిషి విలువను పెంచుతుంది. మంచి మాటే ఇతరులలో మన స్థాయిని పెంచుతుంది. నాయకులు వాడుతున్న భాష ఆయుధమవుతుందా? ఔషధమవుతుందా? అనేది గమనించాలి. నిర్ణయించుకోవాలి.
వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి
సాంఘిక సమానత్వానికి, సామాజిక న్యాయానికి, మత ప్రమేయం లేని పాలనకు, జవాబుదారీతనానికి, పాలనలో పారదర్శకతకు ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రయత్నిస్తాయి. అందుకే మనదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పేర్కొంటారు. ఇలాంటి దేశంలో అధికారంలో ఉన్న నాయకుడు తనపై వచ్చిన ఆరోపణలను సమర్థించుకోవడమే రాజనీతిగా భావిస్తున్నారు. బహిరంగ వేదికల మీద అనుచిత భాషను వాడుతూ దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారు. వీరిని సమర్ధించే వర్గాలు కూడా ఉండటం దౌర్భాగ్యం. రాజకీయ వ్యవస్థ దేశానికి వెన్నెముక లాంటిది. అది అర్థం మారి, విలువలను కోల్పోతూ ఒంగి పోతున్నది. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో, అంతే వేగంగా ధ్వంసం చేసుకుంటున్నాం.
వ్యవస్థలను నిలబెట్టే నాయకులు ఉన్నత వ్యక్తిత్వాలను కలిగి ఉండకపోతే ప్రజాస్వామిక పునాదులు కదులుతాయి. ప్రజలు ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా స్పందించి, ప్రతిఘటించి, ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడే వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. మన అభ్యుదయం అరచేతిలో వాడే ఫోన్‌లోనే ఆగిపోతే, ఇలాంటి పరిస్థితులను, వ్యక్తులను ఆపకపోతే ముందు తరాలకు బతుకు మీద భరోసాను అందించలేము. మనం ఓటు హక్కుకే పరిమితం కారాదు. అప్రజాస్వామిక పోకడలను, అసాంఘిక కార్యకలాపాలను, అన్యాయాలను, అవినీతిని, అబద్ధపు ప్రచారాలను, ప్రలోభాలను సంఘటితంగా ప్రతిఘటించాలి. మానవీయ, నైతిక విలువలను, నీతి, నిజాయితీతో ప్రజాస్వామ్యాన్ని రక్షించేవారిని ఎన్నుకోవడం మనందరి ముఖ్యమైన బాధ్యత.
పి.సుష్మ
సోమేశ్వర్ బండ, మక్తల్
99597 05519