కార్మిక చట్టం అమలు సబబేనా?

by Ravi |   ( Updated:2023-03-20 18:30:20.0  )
కార్మిక చట్టం అమలు సబబేనా?
X

రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాలను ప్రోత్సహించేందుకు వివిధ చట్టాలను సవరిస్తున్నాయి. గత నెల 22న, కర్ణాటక ప్రభుత్వం ఫ్యాక్టరీల చట్టం బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రోజువారీ పని గంటలను తొమ్మిది నుండి పన్నెండు గంటలకు పెంచి, గరిష్టంగా వారానికి 48 గంటలు పని చేయాలని అలా వరుసగా నాలుగు రోజులు చేస్తే అప్పుడు ఆ కార్మికుడు 3 రోజుల పాటు వీక్లీ ఆఫ్ పొందుతారని ఉంది. ఇది కార్మికుడికి, యాజమాన్యం పరస్పరం అంగీకరిస్తేనే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. అయితే కార్మికులు, యాజమాన్యం మధ్య పరస్పర అంగీకారం నేడు ఉనికిలో ఉందా? ఈ చట్టం నిజమైన ఉద్దేశం స్పష్టంగా, కార్మికులను రోజుకు 12 గంటలు పనిచేయాలని చట్టబద్ధంగా బలవంతం చేయడానికి కంపెనీలకు తగ్గట్టు వెసులుబాటు చేయడమే. నిజానికి తొమ్మిది గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే కంపెనీలు ఓవర్‌టైం కోసం రెట్టింపు వేతనాలు చెల్లించాలి. అయితే ఈ చట్టం కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది.

అలాగే కర్మాగారాలు, కార్యాలయాలలో రాత్రి షిఫ్టుల్లో పని చేసేందుకు కూడా ఈ చట్టం మహిళలను అనుమతిస్తుంది. దీని ప్రకారం యజమానులు ఉద్యోగినుల భద్రతా చర్యలకు లోబడి మహిళలు రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల మధ్య పనిచేయవచ్చని. లైంగిక వేధింపుల చర్యలను నిరోధించడం యాజమాన్యాల బాధ్యత అని నిర్దేశించింది. అలాగే రాత్రి షిఫ్టుల్లో మహిళా కార్మికులకు వారి ఇళ్ళ నుండి తిరిగి రావడానికి యజమానులు రవాణా సౌకర్యాన్ని అందించాలి. ఆ వాహనంలో సీసీటీవీ, జీపీఎస్‌ను అమర్చాలని కోరింది. అయితే వారి భద్రతకు సంబంధించి ఈ నిబంధనలన్నీ కేవలం మాటలకే పరిమితం. పగటిపూట కూడా మహిళలు తమ పని ప్రదేశాలలో సురక్షితంగా లేరన్నది వాస్తవం. దానికి ఉదాహరణే కర్ణాటకలో మహిళలపై నేరాల సంఖ్య గణనీయంగా పెరగడం. 2019లో మహిళలపై నేరాలకు సంబంధించి నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,828 కాగా, 2021 నాటికి 14,468కి పెరిగింది. కొత్త చట్టం మొత్తం కార్మికుల ప్రయోజనాలకు గానీ, మహిళా కార్మికులకు గానీ ప్రయోజనం చేకూర్చేది కాదని చాలా స్పష్టంగా అర్థమైంది. దీని ఏకైక ఉద్దేశ్యం కార్మికులపై పెరిగిన దోపిడీని చట్టబద్ధం చేయడం. ఇప్పటికే నాలుగు అపఖ్యాతి పాలైన లేబర్ కోడ్‌లను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూనే, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యల పట్ల కార్మికులు జాగరూకంగా ఉండాలి.

ఆళవందార్ వేణు మాధవ్

8686051752

Advertisement

Next Story

Most Viewed