- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీసీలను మరిచిన బీజేపీ
ఇటీవల ముగిసిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో బీజేపీ ఎన్నో అంశాలపై డిక్లరేషన్ ఇచ్చింది. అయితే, ఒక బీసీ బిడ్డగా ప్రధాని మోదీ బీసీలకు సంబంధించి ఏదైనా డిక్లరేషన్ ఇస్తారేమోనని దేశంలో 65 శాతం ఉన్న బీసీ ప్రజలంతా ఎదురు చూశారు. కానీ, వారికి నిరాశే మిగిలింది. దీంతో బీసీలపై బీజేపీకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ముందు బీసీ ప్రజలంతా మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినా బీజేపీ నుండి సానుకూల స్పందన రాలేదు. దీనిని బట్టి చూస్తే బీసీలపై బీజేపీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదా? అని అనుమానించాల్సి వస్తున్నది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. దీని గురించి బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదు. బీసీ కులగణన చేపట్టాలంటూ తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ శాసనసభలలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ల అంశానికీ అతీగతీ లేకుండా పోయింది.
పార్టీలకతీతంగా ఏకమై
దేశంలో ఇతర కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. కానీ, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నా పట్టించుకోవడం లేదు. వెంటనే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. జనాభా గణనలో ఇప్పటికే ఉన్న 34 కాలమ్స్ కు అదనంగా మరో కాలం జతచేస్తే బీసీ కుల గణన వస్తుందని తెలిసినా, దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. నిజానికి కులాలవారీగా బీసీల లెక్కలు తీయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వచ్చాయి. కేంద్రం నియమించిన ఎన్నో కమిషన్‌లు సమర్పించాయి. కేంద్రం మాత్రం సరే అంటూనే, మొండిచేయి చూపుతున్నది.
దేశంలోని జనాభా ప్రకారం కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాలు తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. బీసీల డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా ఏకం కావాలి. అవసరమయితే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశముంటుంది.
దుండ్ర కుమారస్వామి
బీసీదళ్ జాతీయ అధ్యక్షుడు
99599 12341