- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్షేనా?
సాంకేతిక సమస్యలతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని పట్టించుకోకుండా, దాని జీత నష్టాన్ని ప్రతిఫలంగా ఇవ్వాలని తలపోయడం వేధింపుగానే భావించాల్సి ఉంటుంది. చిన్న విషయాన్ని సీసీఏ రూల్స్ చట్రానికి ముడిపెడుతున్న అధికారగణం చర్యలు ప్రభుత్వానికి- ఉద్యోగులకు గ్యాప్ పెంచేవిగా ఉన్నాయి. మరి అదే సందర్భంలో సొంత సెల్‌ఫోన్, ఇంటర్నెట్ ప్రభుత్వం కోసం వినియోగించాలనే నిబంధన ఎక్కడా లేదు. ఈ దశలో స్థానిక డీడీఓలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి విద్యారంగాన్ని ఇతర శాఖలతో పోల్చడం సరికాదు. బోధన సమయంలో ఇతర బాధ్యతలు ఇరుకున పెడుతున్నందున అన్నింటికీ మించి తరగతిలో స్వేచ్ఛ తగ్గుతోంది. అందుకే ప్రభుత్వం వీటన్నింటి పరిశీలించి తదనుగుణంగా వ్యవహరించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనం పెంచడం కోసం 2018 లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం కరోనా కాలంలో అటకెక్కింది. ప్రజలలో ప్రభుత్వ విశ్వనీయత పెంచేందుకే ఈ విధానం అమలు చేస్తున్నామని ప్రకటించింది ప్రభుత్వం. కానీ, ఇందులో ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఇరుకున పెట్టాలనే వ్యూహం అంతర్లీనంగా ఉందనేది జగమెరిగిన సత్యం.
వ్యవస్థీకృత సోమరితనాన్ని రూపుమాపడం కోసం సంస్థాగతంగా వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగిందే. అందుకే, కార్యాలయాలలో పేవల పనితీరును ప్రక్షాళన చేయబూనడం వాంఛనీయం. పని గంటలలో కుదురుగా పనిచేయడం అవసరమే. వ్యవస్థలలో ఉన్నత ప్రమాణాలు, సాంకేతికత, అనవసర కాలయాపన సంస్కరించడం అవసరమే. కానీ, ఆ పేరుతో పనిగట్టుకొని వేధించే చర్యలు సహేతుకం కాదు కదా! ఫేషియల్ యూప్ హాజరుకు వేతనాల చెల్లింపునకు సంబంధం లేదని చెబుతూ వస్తున్న ప్రభుత్వాధినేతల స్వరం నేడు మారింది.
వికేంద్రీకరణ అంటూనే
ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు ఏర్పడిన పరిణామాలు ఓసారి గమనిస్తే, 7 జనవరి 2022న ప్రభుత్వం వేతన సవరణ సంఘం ఇచ్చిన సిఫారసులను పక్కన పెట్టి సొంత సిఫార్సులను ప్రకటించడంతో ఉద్యోగులు ఎక్కువగా నష్టపోయారు. దీంతో ఉద్యోగులు పీఆర్‌సీ కోసం ధర్నాలు, చలో విజయవాడ వంటి నిరసనలు నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను ఒత్తిడిగా భావించి వారిని కట్టడి చేయాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. అందుకే తొలి అస్త్రంగా పనిభారం పెంచడం వంటి చర్యలు తీసుకుంది. అందులో భాగంగా క్షణం తీరికలేని విధంగా కార్యక్రమాలు అమలు చేసుకుంటూ సెల్‌ఫోన్ ద్వారానే తమకు అవసరమైన సమాచారాన్ని యాప్‌లలో అప్‌లోడ్ చేయించే పనులను ముమ్మరం చేసింది. అంతేకాక, బయోమెట్రిక్ యంత్రాలకు మంగళం పాడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సొంత సెల్‌ఫోన్‌తోనే ఫేసియల్ యాప్ ద్వారా హాజరు(Face recognition attendance system) వేసేలా కొత్త విధానాన్ని ఆగస్టులో అమలుకు తెచ్చింది.
అధికార వికేంద్రీకరణ అంటూ ప్రగల్బాలు పలుకుతున్న ప్రభుత్వం వాస్తవాధికారాల నిర్వహణ మాత్రం ఉన్నతస్థాయిలో కేంద్రీకృతమవుతోంది. ఎంతలా అంటే, ఒక ఉద్యోగి తప్పు చేస్తే తిరిగి విధులకు అనుమతించే విషయం జిల్లాస్థాయి నుంచి సెక్రెటేరియట్‌కు చేరేలా, వారికి మెమోకి బదులు సస్పెన్షన్ కాపీ వచ్చేలా మారింది. కనీసం ఒక పూట సెలవు ఇచ్చే అవశిష్ట అధికారం కూడా ఉన్నతాధికారుల చేతులకు చేరేలా వాస్తవ పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల శ్రేయస్సు ఎంతమాత్రం కోరుకోవడం లేదు. ఇటీవల ఓ మంత్రి 'ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ తమ ప్రాధాన్యం కాదని' నేరుగానే స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ వైఖరిగానే భావించాలి. ఎందుకంటే, పీఆర్‌సీ అమలు విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగస్థులకు అగాథం ఏర్పడింది.
Also read: గిరిజన వర్సిటీ ఏది?
సాంకేతిక సమస్యలు పట్టించుకోకుండా
వాస్తవానికి ఇప్పుడు అమలవుతున్న పీఆర్‌సీ ద్వారా ఉద్యోగులు బావుకున్నదేమీ లేదు. వివిధ స్లాబులలో కొంత శాతం ఇంటి అద్దె కోత, అశాస్త్రీయంగా మధ్యంతర భృతి కంటే నాలుగు శాతం ఫిట్‌మెంట్ తగ్గింపు, జీతాల పెంపు గణాంకాలలో చూపి కరువు భత్యం మాయం చేయడం, జీతంలో పెరుగుదల కనిపించినా లాభం జరగకపోగా నష్టమే ఎక్కువగా జరిగింది. స్వల్పంగా పెరిగిన జీతం నుంచి ఎపీజీఎల్ఐ, పీఎఫ్, ప్రీమియం స్లాబులను పెంచి జీతం ఇచ్చినట్లే ఇచ్చి వెనుకకు లాక్కుంది. అందని జీతాలకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. డీఏ అర్థం మారిపోయింది. డియర్‌నెస్ అలవెన్స్ లేనందువలన ఉద్యోగుల కొనుగోలు సామర్థ్యం సన్నగిల్లిపోతోంది. ఎప్పుడో ఇవ్వాల్సిన కరువు భత్యం ఇవ్వకపోగా, చివరకు రద్దు చేశారు. నెలవారీగా జీతాలు రాక రుణాలు తీసుకున్న ఉద్యోగుల పరపతిని దెబ్బతీస్తోంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో కార్యక్రమాల సాఫల్యతకు వారధులైన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాథం పెరిగిపోతుంది. హక్కుల అమలులో నమ్మకం సడలుతున్నది.ఈ దశలో ఇప్పుడు అమలు చేస్తున్న ఫేషియల్ యాప్ హాజరు ప్రామాణికంగా వేతనాల చెల్లింపుకు దిగితే ఉద్యోగులు మరిన్ని కష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
సాంకేతిక సమస్యలతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని పట్టించుకోకుండా, దాని జీత నష్టాన్ని ప్రతిఫలంగా ఇవ్వాలని తలపోయడం వేధింపుగానే భావించాల్సి ఉంటుంది. చిన్న విషయాన్ని సీసీఏ రూల్స్ చట్రానికి ముడిపెడుతున్న అధికారగణం చర్యలు ప్రభుత్వానికి- ఉద్యోగులకు గ్యాప్ పెంచేవిగా ఉన్నాయి. మరి అదే సందర్భంలో సొంత సెల్‌ఫోన్, ఇంటర్నెట్ ప్రభుత్వం కోసం వినియోగించాలనే నిబంధన ఎక్కడా లేదు. ఈ దశలో స్థానిక డీడీఓలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి విద్యారంగాన్ని ఇతర శాఖలతో పోల్చడం సరికాదు. బోధన సమయంలో ఇతర బాధ్యతలు ఇరుకున పెడుతున్నందున అన్నింటికీ మించి తరగతిలో స్వేచ్ఛ తగ్గుతోంది. అందుకే ప్రభుత్వం వీటన్నింటి పరిశీలించి తదనుగుణంగా వ్యవహరించాలి.
మోహన్‌దాస్
ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్, నెల్లూరు
94908 09909