తెలంగాణలో దళిత సీఎం సాధ్యమయ్యేనా?

by Ravi |   ( Updated:2023-11-22 00:45:31.0  )
తెలంగాణలో దళిత సీఎం సాధ్యమయ్యేనా?
X

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళిత నేతను ఎన్నుకుంటామని ఉద్యమం సమయంలో సంచలమైన ప్రకటన చేశారు కేసీఆర్, కానీ 2014 ఎన్నికల్లో విజయం సాధించాకా, ఆ వాగ్దానాన్ని భంగం చేసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. కంటితుడుపు చర్యగా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దీంతో దళిత ముఖ్యమంత్రి ఆశలు అడియాశలయ్యాయి. అయితే, ప్రాంతీయ పార్టీల్లో తాము నిర్మించుకున్న సౌధంలో ఉన్నత స్థానంలో మరొకరిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని చేస్తారనేది అడియాసే. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా అప్పట్లో కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు.

ఆ వర్గాల ఓటర్లు ఎక్కువ..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా చూపించిన మార్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనేది కేసీఆర్‌తో సహా పలువురు తెలంగాణ నేతలు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. అందుకు కృతజ్ఞతగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడమే కాక, నూతనంగా నిర్మించుకున్న తెలంగాణ సచివాలయానికి ఆయన పేరును నామకరణం చేశారు. అయితే బీఆర్ఎస్ పాలనలో ఈ తరహా కార్యక్రమాలు తప్ప దళితులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనేది దళిత నేతల అభిప్రాయం. కేసీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు వారి కుటుంబంలో బలమైన నాయకత్వం ఉంది. నిజానికి దళితులకు ముఖ్యమంత్రి అనే వాదన రావడం, అది తెలంగాణలో బలపడటానికి ప్రధాన కారణం వారి జనాభా. రాష్ట్రంలో ఒక కోటికి పైగా ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది దాదాపు 28 శాతం. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఓటర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. దీనికి తోడు బీసీల జనాభా కూడా సగానికి పైగా అనగా 52 శాతం మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనాభా మొత్తం కలిపితే 85 శాతానికి దగ్గరగా ఉంటుంది. కానీ కేవలం 15% మాత్రమే ఉన్న వర్గాల వారు అధికార పదవులలో ఉంటున్నారనే అసంతృప్తి మిగిలిన వర్గాల్లో ఉన్నది. అందుకే బీజేపీ తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బీసీలను చేస్తామని బహిరంగంగా ప్రకటించింది. జాతీయ పార్టీల్లో ఈ సంస్కృతి అరుదుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు బీజేపీ కూడా ఏ రాష్ట్ర ఎన్నికల్లో ఇలా ప్రకటించలేదు. కానీ తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా, బీసీల జనాభా సగానికి పైగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఇతర పార్టీలను కొంత ఇరుకునపెట్టింది.

కాంగ్రెస్‌‌లో అవకాశం ఎక్కువ!

ఇక దళిత ముఖ్యమంత్రి వాదన అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కొంతముందు ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దళితులకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వగలదని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ విషయంలో ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకున్నా, తెరవెనుక దళిత ముఖ్యమంత్రి ప్రస్తావన ఆ పార్టీలో జోరందుకున్నది. దీన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క తాను సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా దళిత సీఎం ప్రస్తావన తెచ్చారు. ఈ విషయంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఎందుకంటే, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దామోదర సంజీవయ్యకి అవకాశం ఇచ్చిందని అలాగే, ఆయనను ఏఐసీసీ అధ్యక్షునిగా రెండు పర్యాయాలు అవకాశం కల్పించిందని, అంతేందుకు ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగానే కాక లోక్ సభలో పార్టీ నేతగా దళిత నేత మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నామనేది వారి వాదన. అలాగే భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, దళిత నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ ప్రకటన చేసి ఒక అడుగు ముందుకు వేశారు. అయితే, ఈ వ్యాఖ్యల వెనుక ఎన్ని కారణాలున్నప్పటికీ, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే! అందులో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఏ రకంగా జరుగుతాయనేది చివరి నిమిషం వరకు అంతుబట్టవు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రి చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అందుకే డిసెంబర్ మొదటి వారంలో వెలువడనున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలపై దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడి ఫలితాలు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయనున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూద్దాం మరి!

- నేలపూడి స్టాలిన్ బాబు,

83746 69988

Advertisement

Next Story