- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి కుటుంబాలు పతనమై - ఒంటరితనం చేరువై
భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఒక ప్రాచీన సామాజిక నిర్మాణం, ఇది అనేక తరాల వారసులు ఒకే ఇంట్లో నివసించే విధానం. ఈ వ్యవస్థ భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సామాజిక సంబంధాలకు బలమైన పునాది. అలాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఆర్థిక, భావోద్వేగ, సాంస్కృతిక పరిరక్షణకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ రకమైన వ్యవస్థ వల్ల గాఢమైన అనుబంధాలు, సామూహికత,పరస్పర సహకారం ప్రోత్సహింపబడతాయి. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు, పూర్వీకులు కలిసి నివసించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ వ్యవస్థ ఆర్థిక ప్రయోజనాలను కుడా అందిస్తుంది.
భారతీయ సంస్కృతికి ముఖ్యమైనప్పటికీ..
ఒకరికొకరు ఆర్థిక భారాలు పంచుకోవడం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆర్థిక భద్రత ఉంటుంది. పిల్లలు పెద్దవారితో కలిసి పెరగడం వల్ల మంచి విలువలు, ఆచారాలు నేర్చుకోవడంతో పాటు వారి వ్యక్తిత్వం, నైతికత, సామాజిక నైపుణ్యాలు మెరుగవుతాయి. ఉమ్మడి కుటుంబం భారతీయ సాంస్కృతిక విలువలను పరిరక్షిస్తుంది. ఉత్సవాలు, ఆచారాలు, సంప్రదాయాలను ప్రతి తరమూ ఒకే విధంగా పాటించడం ద్వారా ఈ విలువలు నిలుస్తాయి. అయితే ఆధునిక సమాజంలో సాంప్రదాయాలు, జీవన విధానాలు మారడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అనేక పర్యవసానాలు చోటుచేసుకుంటున్నాయి. యువత అధునిక ఆలోచనలను కలిగి ఉండడం వల్ల ఉమ్మడి కుటుంబంలో సర్దుకుపోవడం కష్టంగా మారుతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో సమకాలీన సవాళ్ళను ఎదుర్కొని, సమగ్రత, సహకారం, సామూహికతలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ వ్యవస్థను కొనసాగించడం అనేది భారతీయ సంస్కృతికి ఎంతో ముఖ్యమైనప్పటికి ఆ రకమైన దిద్దుబాటు చర్యలు లేకపోవడం విచారకరం.
ఇదే క్రమంలో మానవ జీవితంలో చాలా సంక్లిష్టతలను తెచ్చే దశలలో వృద్ధాప్యం ఒకటి. మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మనిషికి వృద్ధాప్యం అన్నది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. తాము వృద్ధులమైతే ఎలా జీవిస్తామో అని వయసులో ఉన్న వారు కూడా ఆందోళన చెందే పరిస్థితులు సమాజంలో ఏర్పడుతున్నాయి. భారీగా ఆస్తులు సంపాదించి ఇచ్చినా, కష్టపడి ఉన్నత చదువులు చదివించినా తమ పిల్లలు తమను ఆదరిస్తారో లేదో అన్న భయం చాలామందిలో నెలకొంది. కొందరు వారసులు పెద్దల పేరున ఉన్న ఆస్తులన్నింటిని తమ పేరున మార్చుకున్న తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తున్న ఉదంతాలు అనేకం చూస్తున్నాం. వృద్ధాప్యంలో శారీరకంగా బలహీనపడతాము, మానసికంగా నిష్క్రియాత్మకంగా ఉంటాము. వివిధ వ్యాధులు మన మనస్సు, శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ముసలి శరీరం కూడా తనంతట తానుగా సహాయం చేసుకోలేకపోతుంది. అన్నింటికంటే వృద్ధాప్యం అత్యంత సంక్లిష్టకరమైన విషయం ఏమిటంటే, మనకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తులు లేదా మనం ఎల్లప్పుడూ అవసరంలో ఉంటామని భావించే వ్యక్తులు మనలను విడిచిపెట్టడం. ఇలాంటి పరిస్థితులకు కారణం ఒకరకంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం కావడం.
వృద్ధాశ్రమాలు ప్రత్యామ్నాయంగా మారి..
నగరీకరణ, ఆధునికత, ఉద్యోగ సంబంధిత మార్పులు కుటుంబ విభజనలకు దారి తీస్తున్నాయి. యువత ఉద్యోగాలు, విద్య, ఇతర అవకాశాల కోసం పెద్ద ఎత్తున నగరాలకు వలస పోవడం వలన పాతతరం వృద్ధులు ఒంటరిగా మిగిలి పోతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 60 సంవత్సరాల పైబడి ఉన్న వ్యక్తుల సంఖ్య 10.38 కోట్లు (సుమారు 8.6%)గా ఉండగా 2021 నాటికి ఈ సంఖ్య 14.3 కోట్లు (సుమారు 10.1%)కు చేరుకుంది. 2050 నాటికి ఇది 19.5 శాతానికి పెరగనుంది. అలాగే వృద్ధుల జనాభాలో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం, 1000 మంది వృద్ధ పురుషులకు 1033 మంది వృద్ధ స్త్రీలు ఉన్నారు. 2021 నాటికి ఈ నిష్పత్తి 1000:1060 గా మారింది. ఇటీవల కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ “ భారతదేశంలో మహిళలు – పురుషులు 2023 ’’ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2036 నాటికి దేశ జనాభాలో 15 ఏళ్ల లోపు బాలల శాతం తగ్గి 60 ఏళ్ళు పైబడిన వృద్దుల జనాభా పెరగనుంది. 2026లో దేశ జనాభా 142.59 కోట్లకు చేరుకోగా వీరిలో 15 ఏళ్ల లోపు బాలలు 24.4 శాతం ఉండగా అది 2036 నాటికీ 20.5 శాతానికి పడిపోనుంది. ఇదే కాలానికి 60 ఏళ్ళు పైబడిన పురుష వృద్దుల జనాభా 10.7 శాతం నుండి 12 శాతానికి, మహిళల్లో 13.4 శాతం నుండి 16 శాతానికి పెరగనుంది.ఈ పరిస్థితిలో వృద్ధాశ్రమాలు (Old Age Homes) ఒక ప్రత్యామ్నాయంగా మారాయి.
వృద్ధులు తమ పిల్లల దగ్గర ప్రాముఖ్యత కోల్పోవడం లేదా పిల్లలు వృద్ధులను చూసుకోవడానికి సమయం లేకపోవడం వంటి కారణాల వలన వృద్ధాశ్రమాల అవసరం పెరిగింది. వృద్ధాశ్రమాలు వృద్ధులకు ఆహారం, వైద్యం, మరియు సామాజిక సహాయం అందించే ప్రదేశాలుగా మారాయి. కానీ వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధుల అనుభూతి, మానసిక, మరియు భావోద్వేగ అవసరాలను తీర్చుకోవడం చాలామందికి కష్టంగా ఉంటుంది. గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య దాదాపు 700 పైచిలుకు ఉండగా ఎక్కువ వృద్ధాశ్రమాలు కేరళలో ఉన్నట్లు వెల్లడైంది. దేశంలో ఉన్న అన్ని వృద్ధాశ్రమాలలో దాదాపు 46 శాతం వృద్ధాశ్రమాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణం వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం, మరియు కుటుంబ బాధ్యతలను తగ్గించుకోవాలని యువత ప్రయత్నించడం.
ఎక్కువైన వేధింపులు..
భారతదేశంలో ఆధునిక కాలంలో వృద్దులు, తల్లిదండ్రుల సంరక్షణపై పిల్లల బాధ్యత మరియు చర్యలు ఒక ప్రధాన సామాజిక అంశంగా మారాయి. ఈ విషయంపై వాదనలు, చర్చలు మరియు నిబంధనలు అనేక మార్గాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. పురాతన కాలంలో, కుటుంబ వ్యవస్థలు ఎక్కువగా సామాజిక మరియు మతపరమైన నియమాలకు అనుగుణంగా ఉండేవి, కానీ ఆధునిక కాలంలో వాస్తవాలు మరియు శ్రేయస్సు కొరకు కొత్త మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. అధునిక కాలంలో, కుటుంబ వ్యవస్థలు మరియు జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల, తల్లిదండ్రుల సంరక్షణపై పిల్లల బాధ్యతలు కూడా మార్చబడినాయి. ఇక పెద్దలు మరియు చిన్న పిల్లల మధ్య సంబంధాలు కూడా మారిపోయాయి. ఆధునిక సమాజంలో పెరుగుతున్న జీవన వ్యయాలు, పని ఒత్తిడి, మరియు తీరిక లేని సమయం వలన పిల్లలు తమ తల్లిదండ్రుల ఆర్థిక, శారీరక మరియు మానసిక అవసరాలను తీర్చడాన్ని విస్మరిస్తున్నారు. తల్లితండ్రులు, వృద్ధులు, వయో వృద్ధులను వారి కుటుంబాలు, పిల్లలు చూసుకోకపోవడం, వారిని మానసికంగా నిర్లక్ష్యం చేయడం, శారీరక, ఆర్థిక మద్దతు ఇవ్వక పోవడం లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గతంలోనే చట్టాలు తయారయ్యాయి. “తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లితండ్రుల, వృద్ధుల సంరక్షణ, రక్షణపై ఆయా కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంది.
అలాగే వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ రూల్స్ – 2011 పేరుతో 2007లో కేంద్రం చేసిన చట్టానికి అనుబందంగా కొన్ని కీలక సవరణలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ సవరణ ప్రకారం వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే వారు సంపాదించిన ఆస్తులు తిరిగి వాపస్ తీసుకునే అవకాశం ఉంది. 2019 లో వయోవృద్ధుల కోసం దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం 14567 నంబర్‌తో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ లైన్ కి వచ్చిన కాల్స్ విశ్లేషించగా 46 శాతం మంది వృద్ధ మహిళలు, 54 శాతం మంది వృద్ధపురుషులు వేధింపులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వృద్ధులను వేధింపులకు గురి చేస్తున్న వారిలో 56 శాతం మంది కొడుకులు, 13 శాతం మంది కోడళ్ళు, ఏడు శాతం మంది కూతుళ్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడం వలన వృద్ధుల సంరక్షణలో ఉన్న సవాళ్లను, వృద్ధాశ్రమాల పెరుగుదల కారణాలను విశ్లేషించడం అనేది అవసరం. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికి వృద్ధుల సంరక్షణకు మరింత శ్రద్ధ ఇవ్వడం, వారికి సరైన మానసిక, భావోద్వేగ, మరియు ఆరోగ్య సహాయం అందించడం అనేది మనందరి బాధ్యత. వృద్ధులు తమ జీవితాలను సుఖసంతోషాలతో గడపడానికి వారి పిల్లలు, కుటుంబ సభ్యులు, మరియు సమాజం అందరూ కలిసి పని చేయాలి. వృద్ధులు వారి చివరి దశలో ఆనందంగా, గౌరవంగా జీవించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.
డాక్టర్ కొల్లు శ్రీనివాస్,
జూనియర్ లెక్చరర్,
80089 44045