- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ విజయం ఎప్పుడో రావాల్సింది!
నిజానికి భారతదేశం శాస్త్ర జ్ఞాన సంపన్నమైంది. కానీ అది చాలా కాలం మతోన్మాదం వల్ల మరుగున పడింది. మతోన్మాదం అనేది ఒక పెద్ద శాస్త్ర జ్ఞాన అవరోధ కుడ్యం. ఈనాడు దాన్ని అధిగమించగలిగితే విశ్వం మన చేతిలోకి వస్తుంది. రాబోయే తరాలు చంద్రుణ్ణి స్వయంగా చూడగలుగుతాయి. సూర్యుణ్ణి సొంతం చేసుకోగల్గుతాయి. భారతదేశం ఆగష్టు 23వ తేదీన తన జ్ఞాన నేత్రాన్ని తెరిచింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. వాస్తవానికి ఈ పరిశోధనలు దేశంలో ఎప్పుడో జరగాల్సింది! కానీ భారతదేశం తమ పూర్వ ఖగోళ శాస్త్ర జ్ఞానాన్ని విస్మరించింది. నిజానికి భారతదేశంలో హిందూ మత భావనకు ఖగోళశాస్త్ర భావనకు పెద్ద యుద్ధమే జరుగుతోంది. అసలు ప్రపంచ వ్యాప్తంగా విశ్వ విజ్ఞానానికి వ్యతిరేకంగా మత వాదులు ఎంతోమంది శాస్త్రవేత్తలను హింసించారు, వారిని సజీవంగా దగ్ధం చేశారు, జైళ్లో పెట్టారు. కానీ శాస్త్ర జ్ఞానం ఆగలేదు. అది మహోన్నతమైన స్రవంతిగా సాగుతూనే వెళ్లింది.
జ్ఞాన వాదం.. మతవాదం యుద్ధం
నిజానికి మన భారతదేశంలో విశ్వజ్ఞాన పరిశోధనకు మూఢ విశ్వాసాలు అడ్డు వచ్చాయి. ఇప్పటికి కూడా వీళ్లు చంద్రుణ్ణి పూజిస్తున్నారు. నక్షత్రాలను, గ్రహాలను భూ కేంద్ర సిద్ధాంతంతో చూస్తున్నారు. ఈ నక్షత్రాలు నిశ్చలంగా, స్తబ్దంగా వున్నాయా? లేవు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. అలా తిరగక పోతే అవి సూర్యునిలో పడిపోతాయి. అలాగే మిల్కీవే కేంద్రం చుట్టూ దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల నక్షత్రాలు తిరుగుతున్నాయి. లేకపోతే అవి వాటి కేంద్రంలో పడిపోతాయి. కేంద్రానికి దగ్గరలో వున్న నక్షత్రాలు అధిక వేగంతో ప్రదక్షిణం చేస్తాయి. దూరం పోతున్న కొద్దీ వాటి ప్రదక్షిణ వేగం తగ్గుతుంది. సూర్యుడు వున్న స్థానాన్ని బట్టి అతడు మిల్కీవే కేంద్రం చుట్టూ సుమారు 20 కోట్ల ఏళ్ళకొకసారి ప్రదక్షిణం చేస్తున్నాడని లెక్క వేశారు. అంతేగాకుండా మొత్తం మిల్కీ వే గెలాక్సీ తన చుట్టూ తాను తిరుగుతున్నది. ఆ విధంగా అది 50 కోట్ల ఏళ్ళకొకసారి ఆత్మ ప్రదక్షిణం చేస్తున్నది వాస్తవం. కానీ భారతీయులలో హిందూ మతోన్మాదులు ఇప్పటికీ విశ్వజ్ఞాన రహస్యాల వెల్లడి దృక్పథంలో లేరు. నరేంద్ర మోడీ సైతం చంద్రయాన్ చంద్రుణ్ణి తాకడాన్ని శివశక్తి గా వర్ణించడం ఆశ్చర్యంగా వుంది. ఆయన ఇంకా మూఢ విశ్వాసాల ఊబిలోనే వున్నాడు. ఏదో ఒక విధంగా ఈ విజయాన్ని మతోన్మాదం ఖాతాలో వేయాలని చూస్తున్నాడు.
పురాణాలను నెత్తికెత్తుకుని..
నిజానికి ఈ 3వ చంద్రయాన్ విజయం చార్వాకులకు, సాంఖ్యులకు చెందుతుంది. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విక్రమ్ ల్యాండర్, అందులోని ప్రగ్యాన్ రోవర్... అక్కడ పని చేసేది ఒక్కపూట (పగలు) మాత్రమే! అయితే చంద్రుడిపై ఒకపూట భూమిపై 14 రోజులకు సమానం. నిజానికి ఈ స్థితికి రావడానికి ఇస్రో సంస్థ అనేక అవరోధాలను అధిగమించింది. ఈ విజయానికి శాస్త్రజ్ఞులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట తృటిలో చేజారిన లక్ష్యాన్ని సాధించామన్న విజయ గర్వం వారిలో తొణికిసలాడింది.
చంద్రయాన్ -2 నుండి చంద్రయాన్-3 ప్రయాణం చేయడానికి శాస్త్రవేత్తలు చేసిన కృషి అపారమైనది. ఇందులో మహిళా శాస్త్రజ్ఞులు వుండటం కొత్త వెలుగు. ఎందుకంటే మహిళా శాస్త్రజ్ఞులకు ఓపిక, ఓర్పు ఎక్కువ. వారు శాస్త్ర రంగంలోకి ప్రవేశించిన తరువాత శాస్త్ర రంగం విస్తృతమైనది అనక తప్పదు. ఇస్రోలో పనిచేసిన శాస్త్రజ్ఞులు అందరూ కూడా మొదటి నుండి సరైన బడ్జెట్ లేక, సరైన ప్రోత్సాహకాలు లేక, సరైన యంత్ర పరికరాలు లేక, సరైన జీతాలు లేక ఎంతో బాధపడ్డారు. వాటిని అన్నింటిని అధిగమించడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. నిజంగా మన భౌతిక శాస్త్రం ఈనాటిది కాదు అతి ప్రాచీనమైనది. చార్వాకులు, సాంఖ్యులు, వైశేషకులు, న్యాయదర్శనకారులు, భారతదేశంలోని భౌతిక, తాత్విక శాస్త్ర జ్ఞానానికి పునాది వేశారు. మనం వారందరినీ విస్మరిస్తూ వచ్చాము. ఆ శాస్త్ర జ్ఞానాన్ని పక్కకునెట్టి మనం పుక్కిటి పురాణాలను నెత్తికెత్తుకుని తిరిగాము. అందుకే మనం సూర్యుని నుండి విడివడిన ఒక శకలంలా భూమిని గుర్తించలేకపోయాము. అందుకు కారణం అజ్ఞానం. పురాణ కథలు, మత బోధనలు చేయడానికి వందల కేంద్రాలు వున్నాయి కాని, జ్ఞాన బోధకు పీఠాలు లేవు. చివరికి విశ్వవిద్యాలయాలలో కూడా మత బోధనలకు ద్వారాలు తెరిచారు.
విశ్వం విస్తృతం.. జ్ఞానమూ విస్తృతమే
ఇంకా విశ్వంలో తెలుసుకోవలసిన అనేక విషయాల పట్ల మనం అప్రమత్తంగా లేము. ఇప్పుడు అనంత విశ్వంలోకి మనం విస్తరించాలి అంటే ప్రపంచ శాస్త్ర జ్ఞానాన్ని భారతదేశానికి తెచ్చుకోవాలి. విశ్వ నిర్మాణంపై అనేక వాదాలు వున్నాయి. విశ్వం అనంతంగా విస్తరిస్తూనే వుంటుందని జార్జి గయోన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతం. దీని ప్రకారం ఒకప్పుడు విశ్వం ముకుళిత స్థితిలోనే వుండేది. కానీ పేలుడు జరిగిన తరువాత మాత్రం విశ్వం అనంతంగా విస్తరిస్తూ పోవడం మొదలు పెట్టింది. దూరం పోతున్న కొద్దీ గెలాక్సీల వేగం పెరుగుతున్నది కదా? వాటి పలాయన వేగం వాటి మధ్య గ్రావిటేషనల్ శక్తి కంటే ఎంతో హెచ్చుగా వున్నది. అందువల్ల వాటి వేగం తగ్గదు. అవి తిరిగి చేరువగా రావడం కుచించుకు పోవడం అనేది ఇక ఎంత మాత్రం జరగదు. ఇంత వరకు అది ఎలా జరిగిందో జరిగింది. ఇక ముందు మాత్రం అది జరగదు. గెలాక్సీల పలాయన వేగం ఇంకా ఇంకా పెరుగుతూనే వుంటుంది. విశ్వం అనంతంంగా విస్తరిస్తూనే వుంటుంది. కొంత కాలానికి మనకు సమీపంలోని కొన్ని గెలాక్సీలు తప్ప మిగిలినవన్ని మనకు ఊహాకు కూడా అందనంత దూరానికి వెళ్ళిపోతాయి. నిజానికి విశ్వం విస్తృతమవుతుంది.
జ్ఞానం మేథోహితం
ఇప్పుడు కావలసింది భారతదేశానికి విస్తృతమయిన ల్యాబులు, పరికరాలు. వీటినే మనం అందించాలి. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను అన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థినీ విద్యార్థులు వీక్షించి, పరవశించిపోయారు. అంతే కాక అనేక ప్రశ్నలు సంధించారు. అంటే భారతీయ విద్యార్థులలో శాస్త్రజ్ఞాన జిజ్ఞాస వుంది. దానికి తగినట్టుగా పాఠశాలల్లో, కాలేజీలో, విశ్వవిద్యాలయాలలో ల్యాబ్స్ లేవు, దేవాలయాలు కట్టడం తగ్గించి శాస్త్ర జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే పిల్లలలో ఫోన్ అడిక్షన్, మందు అడిక్షన్ తగ్గిపోతాయి. నిజానికి చంద్రుని దగ్గరికే కాకుండా అన్ని గ్రహలపైకి భారతీయులు వెళ్ళే రోజు దగ్గరలోనే వుంది. కోపర్నికస్, గెలీలియాలు ఎక్కడో లేరు మన భారతీయ విద్యార్థుల్లోనే ఉన్నారు.
శాస్త్రం ఒక దృశ్యీకృత జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. భ్రమను పోగొడుతుంది. జ్ఞానం మేథోహితం. అది విద్యార్థినులకు ఎక్కువ. వారి మెదడులో కెమెరాలు ఉంటాయి. వాటిని జ్ఞాన ప్రవాహ దృశ్య చిత్రణలోకి మలపగలిగితే ప్రతి విద్యార్థి ఒక సైంటిస్ట్ అవుతాడు. నిజానికి భారతీయ యువతులు విశ్వాన్ని తమ హస్తాల్లోకి తీసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ప్రతి విద్యార్థిని విశ్వాంతర గమన శీలి జిజ్ఞాసులే. మనం పరికరాలు అందించాలి అంతే. భారతదేశం ప్రాచీనకాలం నుండి ఈనాటి వరకు భావవాద, భౌతికవాద యుద్ధంలో వుంది. ఈనాడు శాస్త్రజ్ఞాన పతాకలు చంద్ర గ్రహం మీద ఎగురుతున్నాయి. ఈ పతాకలు అన్ని గ్రహాల మీద ఎగిరే రోజు దగ్గరలో వుంది. డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి అప్పుడు నెరవేరుతుంది. ఆ దిశగా అడుగులు వేద్దాం.
డా. కత్తి పద్మారావు
దళిత ఉద్యమనేత
98497 41695