నడుస్తున్న చరిత్ర:ఇది అగ్రకుల ధనవంతుల పాలన

by Ravi |   ( Updated:2022-09-03 17:20:11.0  )
నడుస్తున్న చరిత్ర:ఇది అగ్రకుల ధనవంతుల పాలన
X

అగ్రకులాల పాలక వర్గాలకు పీఠాలే ముఖ్యం కాని శ్రామిక జన బాధల పట్ల కనీస సానుభూతి, బాధ్యతలు లేవు. 75 ఏండ్లుగా ఈ బూటకం సజావుగా సాగడానికి జనాభాలోని బహుజనులలో అవగాహనా రాహిత్యంతో పాటు అనైక్యతయే కారణం. జనాభాలో విడివిడిగా మతవివక్షకు బలవుతున్న ముస్లింలు ఉన్నారు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఎస్సీ,ఎస్టీలు ఉన్నారు, సంఖ్యకు సరిపడే హక్కులు దక్కని అధిక సంఖ్యాక బిసిలు కూడా ఉన్నారు. అందరు కలగలిసి నిబద్ధత గల బహుజనులుగా మారడం లేదు. గొప్ప అవకాశాన్ని వదిలేసి చిన్న చిన్న విషయాలపై విభేదిస్తున్నారు. వీరికి ఈ స్పష్టత వచ్చేదాకా 90 శాతం జనాన్ని ఆ 10 శాతం వర్గాలు ఏలుతూనే ఉంటాయి.

నాభాలో సామాజిక, ఆర్థిక, బలహీనవర్గాలకు చెందిన 90 శాతం మంది ప్రజలను పాలించి, ఉద్ధరించడానికి 10 శాతం అగ్రకుల ధనవంతులు గత 75 ఏండ్లుగా పోటీ పడుతున్నారు. ఎప్పుడెన్నికలు వచ్చినా ఆ వర్గాలే ప్రధాన రాజకీయ పార్టీలవారీగా విడిపోయి పాలించే అవకాశం 'మాకంటే మాకని' కాట్లాడుకుంటున్నారు. ఏ పార్టీలో చూసినా ముందు వరుస నాయకులు వారే ఉంటారు. పార్టీ గెలిస్తే వారే పీఠాలు ఎక్కుతారు. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ ఏదైనా ఎన్నికలలో గెలిస్తే అధికారపీఠం దక్కేది వారికే. 90 శాతం దేశ జనాభా పల్లకీ బోయీలు మాత్రమే. ఇది ఒక్కసారిగా వచ్చిన పరిణామం కాదు. తరతరాలుగా గ్రామాలలో పెద్దరికమంతా అగ్రకుల భూస్వాములదే. మిగతా కులాలకు చెందిన రైతులు, శ్రామికులు, వృత్తులే జీవనాధారంగా ఉన్నవాళ్లు ఈ తతంగమంతా తమ వలన కాదని దూరమే ఉన్నారు.

అందుకే చాలా గ్రామాలలో దశాబ్దాల తరబడి ఒకే వ్యక్తి పోటీ అనేదే లేకుండా సర్పంచ్‌గా, మున్సబుగా, పటేలుగా కొనసాగారు. రచ్చబండ కన్నా వారి ఇంటి ఆవరణలోనే ఎక్కువగా తగాదాల పంచాయతీలు సాగేవి. దీంతో వారి తరవాతి తరానికి కూడా సామాన్య ప్రజానీకాన్ని ఎలా మెప్పించాలి? ఎలా బెదిరించాలి? ఎలా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అనేవి సునాయాసంగా అబ్బేవి. ఆ క్రమంలో భూస్వాముల పిల్లలు గ్రామ, మండల, జిల్లా స్థాయి రాజకీయ నేతలుగా ఎదిగి వచ్చారు. ఎట్లాగూ చేయి అందుకునేందుకు తమ బంధువులో, సహాసంపన్నులో పైస్థాయిలో ఉంటారు కాబట్టి వారు ఆ స్థాయిలోని రాజకీయ హోదా పీఠాన్ని అందుకోగలిగారు. ఈ విధంగా ప్రజలలో పలుకుబడి ఉన్న ప్రతి రాజకీయ పార్టీలో ముందు వరుసలో ఆ 10 శాతం వారే ఉన్నారు.

వారే ఊదరగొడతారు

పాలనకు బయట ఉన్న పార్టీలలో ఉన్న ఈ ఆధిపత్య కులాల రాజకీయ పెద్దలే ప్రస్తుత పాలనను విమర్శిస్తూ రాబోయే ఎన్నికలలో తమను గెలిపిస్తే ప్రజల కష్టాలన్నీ తీర్చుతామని ఊదరగొడుతున్నారు. అదే ఆశతో జనం కాంగ్రెస్‌ను గద్దె దించి తెలుగుదేశానికి, ఆ తర్వాత తెలంగాణాలో టీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెట్టారు. ఆత్మగౌరవం అని టీడీపీ, స్వయంపాలన అని టీఆర్‌ఎస్ ప్రజల మద్దతు పొందినా జనం జీవితాలలో వచ్చిన మార్పేమీ లేదు. గత 75 ఏండ్లుగా అన్ని తరాల రాజకీయనేతలందరి ఆస్తులు ఒకటికి పదింతలుగా పెరిగిపోయాయి.ప్రజల జీవన పరిస్థితులు మాత్రం కడు దయనీయమైపోతున్నాయి. ఆ క్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది.

రసాయనిక ఎరువుల రాక రైతు జీవితాన్ని సర్వనాశనం చేసింది. యాంత్రీకరణ వృత్తులని ధ్వంసం చేసింది. ఉద్యోగిత తగ్గి యువత నిరాశతో కుంగిపోతోంది. ఈ మార్పును ప్రభుత్వాలు చూస్తూ ఊరుకున్నాయి తప్ప బడుగువర్గాలను కాపాడేందుకు ప్రత్యామ్నాయాలను వెతకలేదు. తద్వారా ఉన్నతవర్గాలు వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలు ఎదిగి, రెక్కల కష్టంపై బతికేవాళ్లంతా శ్రమదోపిడీకి బలవుతున్నారు. అందుకే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. బుజ్జగించే మాటలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఈ అధిపత్యకులాల పాలన రైతులు, శ్రామికులకు కలుగుతున్న నష్టాన్ని పూరించే క్రమంలో నిర్దిష్ట ప్రణాళికలు చేపట్టలేదు.

ఎవరి గోల వారిదే

కేంద్రం ఇచ్చిన డబ్బులతో పబ్బం గడుపుకుంటూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు మాటలు చెబుతోందని, ఈ ఏడేండ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని, కుటుంబపాలనకు అంతం పలకాలని బీజేపీ గొంతు చించుకొంటోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతుల పంటలపై మద్దతు ధర పెంచుతామని, రూ. రెండు లక్షల బ్యాంకు పంట రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పింది. ఇంతకాలం స్వార్థ, స్వీయవర్గాల ప్రయోజనాల కోసం అబద్దపు పాలన కొనసాగించిన, సాగిస్తున్న అన్ని పార్టీలు శ్రామికవర్గాలను అన్ని రకాలుగా ధ్వంసం చేసి సంక్షేమపథకాల లేపనాలు రాస్తూ అదే గొప్ప పాలనగా ప్రచారం చేస్తున్నారు.

నిజానికి సంక్షేమ పథకాలు ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరచవు. పౌరుడు చావకుండా బతకకుండా ఓటేసే యంత్రంగా ఉంచేందుకు అవి ఉపయోగపడుతున్నాయి. సంక్షేమ పథకాలు పెరిగి పెరిగి దేశ, రాష్ట్ర ఆర్థిక పునాదులకే ముప్పు వాటిల్లనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నా మన నేతలు మాత్రం వాటి జపమే చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, స్థిరాస్తులను అమ్మి, అందినకాడికి అప్పులు చేసినా తెలంగాణ ఆర్థిక దుస్థితి ఇప్పట్లో కోలుకునేలా లేదు.

ఆగని అవినీతి, అక్రమాలు

తెలంగాణాలో అధికార పార్టీ నేతలు, అధికారగణం జేబులు అవినీతి సొమ్ముతో పొంగిపొర్లుతున్నాయనడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సర్పంచ్ స్థాయి నాయకుడు పార్టీ మీటింగ్ ప్రచారానికి ప్రముఖ దినపత్రికలో రెండు ముందు పేజీలలో ప్రకటన ఈయగలిగాడంటే అయన ఆదాయాన్ని ఊహించవచ్చు. చిన్న సందర్భానికి కూడా పాలక పక్ష నేతలు పోటీ పడి అధినాయకత్వాన్ని కీర్తిస్తూ పేజీల కొద్దీ ప్రకటలిస్తున్నారు. పాలనలో ఒడుదొడుకులున్నప్పుడు ప్రచారమే సగం బలమన్నట్లు పెద్దలు ఈ తతంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తోంది. 'అవినీతి ఎక్కడ ఉందని ప్రజలను సర్వేలలో అడిగితే వాళ్లు చెప్పే మొదటి పేరు రెవెన్యూ శాఖ. తర్వాత రెండు లేదా మూడో స్థానంలో మున్సిపల్ శాఖ ఉంటుందని' స్వయంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నట్లు పత్రికలలో వచ్చింది. ఆ శాఖ ఉద్యోగుల సమక్షంలోనే ఈ మాట అంటే వారికి ఉన్న భయం కూడా పోతుంది. సమర్థవంత నిఘా విభాగంతో ఒక్కో అధికారి, ఉద్యోగి లంచగొండుతనాన్ని బయటపెట్టి ప్రజలకు నీతివంత పాలన అందించాల్సిన బాధ్యతగల వ్యక్తి రాష్ట్రంలో అవినీతి గురించి అంత తేలిగ్గా మాట్లాడటం సబబు కాదు.

అయినా, బయటపడరు

అప్పు తెచ్చి, ఆస్తులు అమ్మి సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేస్తున్న ప్రభుత్వాలకు ప్రజల నిజమైన కష్టాలు వేరుగా ఉన్నాయని తెలిసినా బయటపడరు. అవినీతి వలన ప్రజలు తమ పనుల కోసం చెప్పులరిగేలా తిరుగుతూ లంచాలు ముట్టచెబుతున్నారు. రోజూ ఏదో శాఖకు చెందిన ఉద్యోగి ఏసీబీకి పట్టుబడుతున్న తీరు దీనికి అద్దం పడుతోంది. డిమాండ్ చేసినంత లంచం ఈయలేని దుస్థితిలోనే ప్రజలు అనిశాను ఆశ్రయిస్తున్నారు. ఇచ్చినదానితో ఉద్యోగి తృప్తిపడితే కథ బయటికే రాదన్నమాట. ప్రజలకు పైసా ఖర్చు కాకుండా పని జరిగితే ఆ మేలు ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రత్యామ్నాయమవుతుంది. ధరల పెరుగుదల సామాన్యుని నడ్డి విరుస్తోంది. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై టాక్స్, పెనాల్టీ అపరాధ రుసుము వాహనం విలువను దాటిపోతున్న సందర్భాలున్నాయి.

శాంతి భద్రతలు నగరం నడిబొడ్డున ఖూనీ అవుతున్నాయి. ఉద్యోగ ప్రకటన బలవంతపు ప్రక్రియగా మారింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత లేకపోగా, భూ కబ్జాలు, చాటుమాటు కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిజానికి సుపరిపాలన అంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ సవ్యంగా, ప్రభుత్వ ఆధీనంలో ఉండడమే. వీటికి అదనంగా సంక్షేమ పథకాలు ఉండాలి. వాటిని గాలికొదిలేసి ఎక్స్ ట్రాలే అసలు స్థానం ఆక్రమించాయి. అగ్రకులాల పాలక వర్గాలకు పీఠాలే ముఖ్యం కానీ శ్రామిక జన బాధల మీద కనీస సానుభూతి, బాధ్యతలు లేవు. 75 ఏండ్లుగా ఈ బూటకం సజావుగా సాగడానికి బహుజనుల అవగాహనా రాహిత్యంతో పాటు అనైక్యతయే కారణం. జనాభాలో విడివిడిగా మతవివక్షకు బలవుతున్న ముస్లింలు ఉన్నారు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు, సంఖ్యకు సరిపడే హక్కులు దక్కని అధిక సంఖ్యాక బీసీలు ఉన్నారు. అందరు కలగలిసి నిబద్ధత గల బహుజనులుగా మారడం లేదు. చిన్న చిన్న విషయాలపై విభేదిస్తున్నారు. వీరికి ఈ స్పష్టత వచ్చేదాకా 90 శాతం జనాన్ని ఆ 10 శాతం వర్గాలు ఏలుతూనే ఉంటాయి.

(బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాదయాత్ర 60 రోజులు పూర్తయిన సందర్బంగా)

బి.నర్సన్

94401 28169

Advertisement

Next Story