అంకెలు, అక్షరాలు అపురూపమే కానీ…

by Ravi |   ( Updated:2024-08-13 01:00:56.0  )
అంకెలు, అక్షరాలు అపురూపమే కానీ…
X

కేంద్ర బడ్జెట్‌లో అంకెలు, అక్షరాలు అపురూపంగా ఉన్నాయి. కానీ దళిత బహుజన మైనార్టీలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ బడ్జెట్‌ పన్నుకట్టే వారికి అనుకూలంగా ఉంది. అస్పృశ్యులను, నిరక్ష్యరాస్యులను, వృత్తికారులను, సాంకేతికపరులను పూర్తిగా ఈ బడ్జెట్‌ నిర్లక్ష్యం చేసింది. ఇందులో ప్రధానంగా బడ్జెట్‌కు ఉండే రాజ్యాంగ స్పృహ తగ్గింది. డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగంలో ఏమి పొందుపరిచారో దళిత బహుజనుల సంరక్షణల కోసం ఏమి పొందుపరిచారో ఆ సూత్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది.

భారతదేశ ఆర్థిక ఉత్పత్తిలో దళిత బహుజనులను భాగస్వామ్యం చేసినప్పుడే భారతదేశం సంపద నిబిడీకృతమవుతుందని అని అంబేడ్కర్‌ చెప్పారు. దళితులు శ్రామిక శక్తులు వారికి భూమి, ఉపాధి సాంకేతిక జ్ఞానం, శ్రమ, నైపుణ్యం కలిగించినప్పుడే భారతదేశ సంపద పెరుగుతుంది. భారతదేశం ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయక దేశం. ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి గ్రామాల్లో ఊరు వేరుగా ఉంది. దళిత వాడ వేరుగా ఉంది. దళిత వాడకు విద్యుత్‌ సౌకర్యం లేదు. దళితవాడకు మంచినీటి సదుపాయం లేదు. మురుగుపారే డ్రైనేజ్‌ సిస్టమ్‌ లేదు. రోడ్లు లేవు. దళితులు 3,4 కుటుంబాలు ఒక్క సెంటులో జీవిస్తున్నారు. దళితవాడలు ఇంకా మురికిగానే ఉన్నాయి. దళిత జీవితాన్ని దుర్భరంగా పెట్టారు. భారతదేశంలోని గ్రామాలు చూసిన విదేశీ పరిశోధకులు ఇది స్పృశ్య భారతమా అస్పృశ్య భారతమా? అని అడుగుతున్నారు.

కునారిల్లుతున్న విద్యా బడ్జెట్!

భారతదేశానికి ఊపిరి లాంటి విద్యారంగానికి భారీగా కోత పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1.20 లక్షల కొట్లే ఇచ్చి రూ.9. వేల కోట్లు తగ్గించారు. కొన్నింటికి పెంచి, మరికొన్నింటికి తగ్గించారు. కేంద్ర విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా ల్యాబులు, లైబ్రరీలు లేవు. పరిశోధనలకు సరైన స్కాలర్‌షిప్‌లు లేవు. భారతదేశంలో ఉన్నత విద్య సరిగా లేక ఉన్న విద్యార్థులు విదేశాలకు వలస కడుతున్నారు. భారతదేశంలో విద్య ఉన్నతమైనది కాదని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. విద్యా వ్యవస్థ దెబ్బతీయటం అనేది ఒక పద్ధతి ప్రకారం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. నిజానికి విద్యారంగంలో విద్యారంగాన్ని దెబ్బతీసే అనేక కోతలు విధించబడ్డాయి. ఉన్నత విద్య నియంత్రణ మండలి యూజీసీకి 60 శాతానికి పైగా నిధులు తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రపంచస్థాయి సంస్థలకు నిధులు రూ. 1300 కోట్ల నుంచి రూ.1800 కోట్లకు పెంపు చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసి)కు 6,407 కోట్ల నుంచి రూ.5,500 కోట్లకు నిధుల తగ్గింపు, ఐఐఎంలకు రూ. 331 కోట్ల నుంచి రూ. 212 కోట్లకు కేటాయింపులు తగ్గింపు, ఐఐటీలకు రూ. 10,384 కోట్ల నుంచి రూ. 10,324 కోట్లకు తగ్గింపులు జరిగాయి.

ఉద్యోగ కల్పన హుళక్కి..

ఈ బడ్జెట్‌ ప్రభుత్వ ఉద్యోగాలను నిరాకరిస్తుంది. ఈ బడ్జెట్‌ ముఖ్యంగా కార్పొరేట్‌ హస్తాల్లో ఇరుక్కుపోయినట్టు నిరూపిస్తుంది. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక మత్తుమందులకు, గంజాయికి, నేరాలకు పాల్పడుతున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగ వసతి రైల్వే, విద్యుత్‌, టెలిఫోన్‌, బ్రిడ్జ్‌ నిర్మాణంలో, గృహనిర్మాణంలో కలిగించినట్లయితే వారు నేరస్థులుగా, అర్థ నేరస్థులుగా వారు జీవించరు. వారిలో వ్యక్తిత్వ నిర్మాణ దక్షత పెరుగుతుంది. ఒక యువకుని వ్యక్తిత్వ నిర్మాణానికి లౌఖికవాద భావజాలం, లౌకికవాద దృష్టి, సామాజిక స్ఫూర్తి ఇవన్నీ కూడా పెంపొందించే శిక్షణ అవసరం. స్కిల్‌ నైపుణ్యం ఒక్కటే చాలదు.

పేదల గుడిసెలపై భారీ భవంతులు..

పట్టణాల్లో మురుగువాడల్లో దళితులు, ఆదివాసీలు, గ్రామాల్లో ఉన్న వృత్తికారులు పట్టణాలకు వెళ్లి మురుగువాడల్లో జీవిస్తున్నారు. నివాసానికి ఇళ్లు లేక మురుగు కాలువల మీద చెక్కబద్దలు వేసుకొని వాటిమీద జీవిస్తున్నారు. కార్పొరేట్‌ శక్తులు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటున్నారు. బలవంతంగా పేదల గుడిసెలు ఖాళీ చేయిస్తున్నారు. ఈ మురుగువాడల నిర్మూలనకు, నూతన పారి శ్రామిక వాడల నిర్మాణానికి పథకాలు లేవు. అందువల్ల ఇది పూర్తిగా అగ్రవర్ణ కార్పొరేట్‌ బడ్జెట్‌గానే మన ముందు నిలబడుతుంది.

శ్రామికుల ఆదాయ మార్గంపై కోత!

ఇకపోతే ఉపాధిహామి రంగంపై ఈ బడ్జెట్‌లో కోతలు విధించి బుద్ధి పూర్వకంగాన శ్రామికుల ఆదాయ మార్గాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ బడ్జెట్‌ నిర్మాణంలో తప్పకుండా భూమి పంపకం ఉండాలని, కుల నిర్మూలనా భావం ఉండాలని, కులాన్ని నిర్మూలించే భావ చైతన్యం కోసం, ఆచరణాత్మక కార్యక్రమం కోసం బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉన్నప్పుడే, దేశంలో సామరస్యత, శాంతి ప్రజ్వరిల్లుతాయని దేశానికి మత సామరస్యం, లౌకికవాద భావన సామ్యవాద సిద్దాంత స్ఫూర్తి చాలా అవసరం అని నొక్కి చెబుతూ వచ్చారు.

ఈనాడు దళిత, బహుజన, మైనార్టీ, స్త్రీ లౌకికవాద మేధావులంతా పార్టీలకు అతీతంగా డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించి ఏ భావజాల ఆధీనతలకు లోబడకుండా సామ్యవాద లౌఖికవాద భారతాన్ని నిర్మించడం కోసం నడుం కట్టాల్సిన చారిత్రక సందర్భం ఇది. అప్పుడే భారతదేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలందరికి జీవించే హక్కుతో, జీవన సౌందర్యంతో, వ్యక్తిత్వ వికాసంతో మానవాభ్యుదయ సోపానంతో ఆ సోపానాన్ని అధిరోహించి విజయపతకాలు ఎగరేస్తారని ఆశిద్దాం. ఆ దిశగా పయనిద్దాం.

డా. కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story