మాల్దీవుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేయాలి

by Ravi |   ( Updated:2024-01-31 00:16:21.0  )
మాల్దీవుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేయాలి
X

హిందూ మహాసముద్రంలో మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న కొన్ని ద్వీపాల సముదాయం మాల్దీవులు. ఆ దేశ ఆర్థిక అభివృద్ధి అంతా పర్యాటక రంగం మీదనే ఆధారపడి నడుస్తుంది. రక్షణ పరంగా భారతదేశంతో ఆ దీవులకు అనుబంధం అంతా ఇంతా కాదు.

1965 వరకు అది బ్రిటిష్ కాలనీలో ఒక భాగంగా ఉండేది. దాని జనాభా కేవలం 5.21 లక్షలు. ఆ దీవుల మీదికి టెర్రరిస్ట్ గ్రూపులు అటాక్ చేసినా -ఎదిరించి నిలబడగలిగే శక్తి మాల్దీవులను పాలించే ప్రభుత్వానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో! అనూహ్య రీతిలో ఆ దేశంలోని ముగ్గురు మంత్రులు భారత ప్రధాన మంత్రిపై, భారతదేశంపై విచక్షణ కోల్పోయి, జుగుప్సాకరమైన మాటలు మాట్లాడటంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. దీంతో మన దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు, ముఖ్యంగా సినీ, క్రికెట్ ప్రముఖులు ఆ దేశంతో విహారయాత్రలకు భారతదేశం నుండి ఎవరు కూడా వెళ్లరాదని సోషల్ మీడియాలో పిలుపునివ్వడం, అక్కడి పర్యాటక రంగంతో సంబంధం ఉండే విమానయాన సంస్థ తన సర్వీసులను రద్దు చేసుకోవడం మాల్దీవుల రాయబారిని పిలిచి, మన విదేశాంగ అధికారులు చివాట్లు పెట్టడం చక చక జరిగిపోయాయి.

పొరుగు నేత తిడితే సహిస్తారా

అయితే, నోరు పారేసుకున్న మంత్రులను సస్పెండ్ చేసినప్పటికీ, ఆ దేశ పర్యాటక రంగానికి కోలుకోలేని నష్టం జరిగింది. భారత ప్రజలు స్వచ్ఛందంగా ఈ పని చేశారు.

మాల్దీవ్ మంత్రుల దుష్ప్రవర్తనను ఆ దేశంలోని ప్రతిపక్ష నాయకులందరూ ఖండించారు. భారతదేశంతో ఆ దేశానికి ఉండే రక్షణ పరమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకొని, నూతన అధ్యక్షుని రాజీనామా చేయమని డిమాండు చేశారు. ఈ విషయంపై భారతదేశంలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక పక్షాల ఆలోచన తీరు దేశానికి వ్యతిరేకంగా ఉంది. ప్రధాని స్థానంలో ఏ పార్టీ వ్యక్తి ఉన్నా-మన దేశాన్ని, మన ప్రధానిని ఇతర దేశాల వారు దూషించినప్పుడు, ఆలోచనాత్మక రీతిలో ప్రతిస్పందించాలి. ఈ విషయంలో ప్రధాని మోదీపై తమకుండే ఈర్ష, అసూయ, ద్వేషాన్ని దృఢంగా ప్రతిపక్ష నాయకులు నిలుపుకున్న విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు.

అప్పుడే ఓటమి ఛాయలు

'భారత్ అవుట్ ' నినాదంతో అధికార పీఠాన్ని అధిష్టించిన ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు టర్కీ, యుఎఇ, చైనా దేశాల్లో పర్యటించి, చైనాతో 20 ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే మానసిక స్థితిని ఆ దేశ అధ్యక్షుడు కనబరచినట్లైంది. ఆ దేశ భద్రతకు ఉంచిన మన సైనికులను మార్చి 15 లోపు దేశం నుంచి వెళ్ళి పోవాలని కోరడం భవిష్యత్తులో ఆ దేశానికి ఇబ్బంది కలిగిస్తుంది. చైనాతో ఆ దేశం అంటకాగి శ్రీలంక పరిస్థితిని కొని తెచ్చుకుని చేతులు కాల్చుకోవాలి అనుకుంటే ఎవరు ఏమి చేయలేరు. తాజాగా మాలే(మాల్దీవ్ రాజధాని)నగర పాలక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి భారత్ అనుకూల వైఖరి గల పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. భారత్‌తో సానుకూల దృక్పథం కలిగి ఉండాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారనే విషయం ఈ ఎన్నిక ద్వారా తేటతెల్లమైంది. ఇదే సమయంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఎంతో అవసరం.

ఉల్లి బాల రంగయ్య

94417 37877

Advertisement

Next Story