తెలుగు సినిమా రొడ్డకొట్టుడుకు అలవాటైందా?ఎవరు మారాలి దర్శకుడా హీరోనా?

by Ravi |   ( Updated:2022-09-03 13:58:36.0  )
తెలుగు సినిమా రొడ్డకొట్టుడుకు అలవాటైందా?ఎవరు మారాలి దర్శకుడా హీరోనా?
X

'ఇజ్జతే, శౌరతే

చాహతే, ఉల్ఫతే

కోయీ భీ చీజ్

దునియామే రహతీ నహీ

ఆజ్ మై హూన్ జహాన్

కల్ కోయీ అవుర్ థా

ఏభీ ఏక్ దౌర్ హై

వో భీ ఏక్ దౌర్ థా'

1972లో వచ్చిన సూపర్ హిట్ హిందీ సినిమా 'దాగ్' లోని ఒక డైలాగ్ ఇది. 'గౌరవాలూ, మర్యాదలూ, ఘనతలూ, గొప్పలూ, విజయాలూ ఈ లోకంలో శాశ్వతం కాదు. ఇవాళ నేనున్న స్థానంలో నిన్న మరొకరున్నారు. ఇదొక యుగం అయితే, అదొక యుగం' అనేది ఈ మాటల అర్థం. అక్తర్ ఉల్ ఈమాన్ రాసిన ఈ మాటలు ఎంత గొప్పవి. ఇవి మన తెలుగు సినిమావాళ్లకు తెలుసో లేదో తెలీదు. తెలిసినా గుర్తుందో లేదో ! ఎందుకంటే యుగాలు మారినప్పుడల్లా కాలంతో పాటు ప్రజలూ మారతారు. వాళ్ల ఇష్టాలూ మారతాయి. వారి అభీష్టాల మేరకు మనమూ మారాలి లేదా ఘోర వైఫల్యాలు తప్పవు.అయినా, మన తెలుగు సినిమావాళ్లు ఇప్పటికీ ఇంకా 'రామారావు ఆన్ డ్యూటీ' అంటే ఎట్లా? ఎవరు భరిస్తారు? డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు భరిస్తారు? ఆచార్యలూ, రామారావులు డ్యూటీ నుంచి దిగి పోవల్సిన కాలం వచ్చేసింది. అది గమనించకుండా సినిమాలు తీస్తే రెండో ఆటకల్లా దుకాణాలు మూసేయాల్సి వస్తుంది.

మన తెలుగు సినిమావాళ్లు తాము తీస్తున్న సినిమాలలో ఉన్న లోటుపాట్లనీ, సమస్యలనీ, ఆకట్టుకోలేని తనాన్ని గమనించడం లేదు. సినిమా హాళ్లకు ప్రేక్షకులు రావడం లేదని వాపోవడం తప్ప ఎందుకు రావడం లేదో ఆలోచించడం లేదు. పైగా నేరం ఓటీటీల పైనో మరో దాని పైనో వేస్తున్నారు. రోగం ఒక చోట ఉంటే మందొక చోట పెట్టె ప్రయత్నం అన్నమాట. ఒకటి రెండు దశాబ్దాల క్రితం ఉన్నట్టు ఇప్పటికీ హీరోయిజం పైనో, హీరో హైప్ పైనో సినిమాలు తీస్తే చూడడానికి నేటి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. దీనిని నిర్మాతలు, దర్శకులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేకుంటే స్టార్ హీరోలతో పాటు అందరూ డ్యూటీలు దిగి పోవాల్సి వస్తుంది. స్వచ్ఛంద పదవీ విరమణలూ తప్పవు.

అవి మరుపురాని కథలేగా!

ఇప్పటి సినిమా నిర్మాతలూ, దర్శకులూ ఒక విషయం ఆలోచించాలి. అలనాటి 'గుండమ్మ కథ', 'మిస్సమ్మ' లాంటి సినిమాలు టీవీలలో వస్తే ప్రజలు ఎందుకు, ఎన్నిసార్లు అయినా చూస్తున్నారు? అవి వారికి ఎందుకు బోర్ కొట్టడం లేదు? ఎందుకంటే వాటిలో కథ వుంది, ఆసక్తికర కథనం ఉంది. మూడు గంటల పాటు కట్టి పడేసే బిగువు వుంది. అది వ్యాపార సినిమాలకు అయినా ఉండాల్సిన లక్షణం. మరివ్వాళ ఇప్పటికీ హీరోలు గాలిలో ఎగురుతారు. అర్థం పర్థం లేని మాటలు, పాటలు. ఒకటేమిటి అంతా గోల గోల. ప్రేక్షకులు తమ గోలను తప్పించుకోవడానికి సినిమాలకు వస్తే హింసకు గురి చేసి 'ఎందుకు వచ్చాం రా బాబూ'' అనేట్టుగా ఉంటే ఎలా? నిజానికి సినిమాలలో మనం కథ చెప్పం, చూపిస్తాం. అంటే, సినిమా నిర్మాణానికి మంచి కథ కావాలి. దానిని దృశ్య రూపంలోకి మార్చి ఆద్యంతం ఆసక్తికర కథనంతో సినిమాను నడిపించాలి.

అప్పుడు ప్రేక్షకుడు సీట్లో కుదురుగా కూర్చుని చూస్తాడు. కథనానిది సినిమాలో ప్రధాన భూమిక. అది ఎంత పకడ్బందీగా ఉంటే సినిమా అంత బిగువుగానూ, ఆసక్తిగానూ వుంటుంది. మన భారతీయ సినిమాలలో పాటలు సంగీతం అంతర్భాగం. అవి లేకుండా భారతీయ వ్యాపార సినిమాను ఊహించలేము. సినిమాలలో పాటలు కథలో అంతర్భాగంగా ఉండాలి. సినిమా కథను ముందుకు నడిపించేలా ఉండాలి. నేపథ్య సంగీతం ఆయా దృశ్యాల మూడ్‌ను ప్రేక్షకులలో ప్రోది చేసేందుకు సహకరించాలి. మాటలూ అంతే. సినిమా ప్రధానంగా దృశ్య మాధ్యమం అయినప్పటికీ మాటలు ఆయా పాత్రల మౌలిక లక్షణాన్ని క్యారెక్టరైజేషన్‌ని ఆవిష్కరించాలి. ఇక చివరగా, ఎంత జాగ్రత్తగా ఎడిటింగ్ చేస్తే సినిమా అంత బాగా వస్తుంది. ఇవేవీ మనవాళ్లు ఆలోచిస్తున్నట్టు లేదు. అంతా రొడ్డ కొట్టుడు యవ్వారం.

నేల విడిచి సాము చేసి

తెలుగులో వస్తున్న చాలా సినిమాలను చూస్తే వాటిలో కథ ఉందా? అనిపిస్తుంది. అసలు కథ పట్ల మనవాళ్లకు అవగాహన అనేది ఉందా? అనిపిస్తుంది. హీరో కాల్ షీట్స్ దొరికితే చాలు కథ లాంటి దాన్ని వండేయొచ్చు అనుకుంటారు. హీరో మార్కెట్‌తో సినిమా ఆడుతుంది అనుకుంటారు. అక్కడే ఇవ్వాళ మన తెలుగు సినిమా ఆగిపోయింది. సరిగ్గా ఫెయిల్యూర్ అక్కడే మొదలవుతున్నది. వెతికితే మన తెలుగు సాహిత్యంలోనూ, భారతీయ సాహిత్యంలోనూ ఎన్ని కథలు లేవు. రావిశాస్త్రి, కొ.కు, కాళీపట్నం, భరద్వాజ, చలం, అంపశయ్య నవీన్, అల్లం రాజయ్య, తుమ్మేటి లాంటి ఎంతో మంది రాసిన కథలున్నాయి.

ఆయా కథల నుంచి కొన్ని సంఘటనలను తీసుకున్నా పూర్తి నిడివి కథలు అవుతాయి. జన జీవితంలో ఎన్నెన్ని కథలు కనిపిస్తాయి. వాటిని ఎప్పుడైనా చూస్తామా? లేదే? ఇది బియోపిక్‌ల కాలం నడుస్తోంది. ఎంత మంది మహానుభావుల జీవితాలు తెలుసు మనకు. గంగుభాయ్, ఝుండ్, రాకెట్రీ, మహానటి లాంటి ఎన్ని సినిమాలు విజయవంతం కాలేదు. తెలుగు సినిమా వారిలో కథల పట్ల అవగాహన ఉన్నవారు తక్కువ. కథా రచయితల పట్ల గౌరవం తక్కువ. పారితోషకాలు తక్కువే. మరిక మంచి కథలు ఎట్లా వస్తాయి? ఇక పాటలు, డాన్సులు తెర మీదికి ఎందుకు వస్తాయో? ప్రేక్షకుడికి అంతు బట్టదు. హీరో హీరోయిన్‌ల ప్రదర్శనే ప్రధానం. చాలా సందర్భాలలో ప్రేక్షకులు బయటకు వెళతారు. 'కోట్లాది రూపాయలు పెట్టి తీసాం, పాన్ ఇండియన్ సినిమా' అని ఊదరగొడితే ఏం ఫలితం. అలాంటి స్థితిలో సినిమాలు ఆర్థికంగా విజయవంతం ఎలా అవుతాయి? ప్రేక్షకులు వందల రూపాయలు ఖర్చు పెట్టి, సమయం వృధా చేసుకుని టాకీసులకు ఎందుకు వస్తారు? హాయిగా ఇంట్లో కూర్చుని ఓటీటీలలో చూస్తారు.

ఆకట్టుకుకుంటున్న సిరీస్‌లు

ఓటీటీలలో వచ్చిన కొన్ని సిరీస్ గురించి నేనిక్కడ ప్రస్తావించదల్చుకున్నాను. పంచాయత్‌ -2 (అమెజాన్‌ ప్రైమ్‌): అత్యంత వాస్తవికంగా మన ఊరిలో లేదా పక్క ఊరిలో జరిగినట్టుగా ఉన్న కథతో ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తిన సిరీస్‌ ఇది. ఇంజినీరింగ్‌ చదివి అనుకోని పరిస్థితులలో ఓ పల్లెలో పంచాయతీ సెక్రెటరీగా చేరిన అభిషేక్‌ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది వినోదాత్మకంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. పాత్రలన్నీ మన చుట్టూ ఉన్నవే అనిపిస్తుంది. అనంతం: ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ వాస్తవిక కథనంతో ఎంతో ఆకట్టుకుంది.

సాస్ బహు అచార్ ప్రైవేట్ లిమిటెడ్. : ఇది మహిళా సాధికారత పైన రూపొందిన సిరీస్. ఆ మాట ఎక్కడా చెప్పకుండానే ఆద్యంతం బిగువుగా హాస్యాన్ని మేళవించి తీసారు. మధ్య తరగతి జీవులు ఇది మన కథే అనేంతగా సాగుతుంది. గుల్లక్: మధ్యతరగతి జీవితాలను చాలా బాగా ఆవిష్కరించిన సిరీస్. సహజ పాత్రలతో మంచి చిత్రీకరణతో సాగుతుంది. వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకంటే, వీటిలో పాత్రలు మనలాగే మాట్లాడతాయి, మనలాగే ప్రవర్తిస్తాయి. మనమే అనేంతగా మనలను ఆకట్టుకుంటాయి. ఇలాంటివి చూసైనా మన తెలుగు సినిమాలు నేలమీదికి దిగితే బాగుపడతాయి. అపజయాలకు దోషాలను వేరే వాళ్ల మీదకు తోసేయకుండా, తమ దోషాలను తామే గుర్తించి సరి చేసుకుంటే తెలుగు సినిమా బతికి బట్ట కడుతుంది. అట్లని ఓటీటీలో వచ్చేవన్నీ మంచివే అని కాదు, దాని గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం.

వారాల ఆనంద్

9440 501281

Advertisement

Next Story