అభివృద్ధి వైపుగా తెలంగాణ అర్బనైజేషన్ పునాదులు ..

by Ravi |   ( Updated:2024-12-07 01:15:08.0  )
అభివృద్ధి వైపుగా తెలంగాణ అర్బనైజేషన్ పునాదులు ..
X

అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి... ప్రపంచం మొత్తం జపిస్తున్న మంత్రమిది. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందనేది మనందరికీ స్పష్టంగా కన్పిస్తున్న వాస్తవం. 2 లక్షల ఏక కాల రుణమాఫీతో రైతుల ఖాతాల్లోకి దాదాపు 22 వేల కోట్లను పంపి వాటిని వ్యవస్థలోకి తెచ్చి ఆర్థిక పరిపుష్టికి కారణం ఒకటైతే... అధికారం చేపట్టిన అతి తక్కువ కాలంలోనే 15వేల ఉద్యోగాల్ని అందించే ఫాక్స్ కాన్ వంటి కంపెనీలకు అంకు రార్పణ, ఇతరత్రా అనేక కంపెనీల ఏర్పాటు మొదలు నిన్నటి కోకోకోలా ప్యాక్టరీ ప్రారంభం వరకూ ప్రగతికి బాటలు వేసే దిశగా ప్రజా ప్రభుత్వం సాగుతుంది.

ఏ దేశ ప్రగతిలో నైనా పారిశ్రామిక పురోగతే కీలక పాత్ర పోషి స్తుంది. అలాంటి పారిశ్రామిక వృద్ధి అర్బన్ ఏరియాల్లోనే గరి ష్టంగా జరుగుతుంది. దీనికి పటిష్ట పునాదుల్ని వేసింది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఇంచుమించు మనం స్వాతంత్ర్యం పొందిన సమయంలోనే పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, ఈజిప్ట్‌తో పాటు దాదాపు పదేండ్ల తర్వాత నైజీరియా సహా కొన్ని ఆఫ్రికా దేశాలు స్వపరిపాలన ఆరంభించాయి. ఐతే విస్తీర్ణంలోనైనా, జనాభా పరంగానైనా అతి పెద్దది మనదేశమే, ఎన్నో ప్రతికూలతలు ఉన్నప్పటికీ సువిశాల భారతదేశం ఈ దేశాలన్నింటి కన్నా అత్యుత్తమమైన స్థానంలోనే నేడున్నది. దీనికి కారణం నాటి పాలకుల దూరదృష్టే అన్నది సుస్పష్టం.

ప్రపంచ స్థాయి నగరంగా ఫోర్త్ సిటీ!

ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ప్రధాన భూమిక పోషిస్తున్నది పారిశ్రామికీకరణే. దీనివల్ల రాష్ట్రంలో గ్రోత్ కారిడార్లు, నగరాలు పెరుగుతాయి. అంతి మంగా పట్టణీకరణ వల్లే ప్రగతి వేగంగా పరుగులు పెడుతుంది. మనిషి తలసరి ఆదాయం పెరిగి జీవన ప్రమాణాలు పెంపొందుతాయి అని ఆర్థిక నిపుణులు చెబుతున్న సత్యం. గత అర్ధ శతాబ్దంగా మనందరి కళ్లముందు సత్యమై నిలుస్తున్న నిజం. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అర్థం చేసుకుంది. అందుకనుగుణంగా రాజధానిలో ప్రపంచస్థాయి నగరంగా ఫోర్త్ సిటీ నిర్మాణానికి కంకణం కట్టుకుంది. రాజధాని వెలుపల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్దంగా అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో హెచ్ఎండీఏ, కుడా, ఉడా, తుడా, సుడా వంటి 9 అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలకు అదనంగా మరో 18 పట్టణాభివృద్ధి సంస్థలను కొంతకాలం క్రితం ఏర్పాటు చేసింది. కొన్నింటి పరిధి పెంచింది. వీటి ద్వారా ఆయా ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రచిస్తోంది. వీటి పరిధిలోని ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఉపాధికి ఊతమిచ్చే సంస్థ లను ఏర్పాటు చేస్తూ ఆయా ప్రాంతాల జీవవైవిధ్యాన్ని కాపాడుతూనే పారిశ్రామిక వైవిధ్యం ఉండేలా జోన్లుగా డెవలప్ చేయాలని సంకల్పిస్తుంది.

నలుదిశలా నగరాభివృద్ధి..

తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం దాదాపు 1,12,077 చదరపు కిలో మీటర్లు ఉండగా ఇందులో అడవులు, నదులు, సరస్సులు వంటి ప్రాంతాలు మినహా దాదాపు 82,262 చదరపు కిలోమీటర్లు 27 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల కిందకి వస్తుంది. అంటే ఇంచుమించు 80 శాతంగా రాష్ట్రం నలుదిశలా నగరాభివృద్ది జరిగి దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ మారనుంది. తద్వారా దేశం ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడం కోసం తనదైన పాత్రను పోషించనుంది తెలంగాణ. ఇప్పటికే తనదైన శైలిలో దూసుకుపోతున్న హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దాదాపు 7,252 చ.కి.మిలు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు సమానంగా మిగతావి సైతం తమ కార్యాచరణను రూపొందించుకుంటాయి. వీటిలో ప్రత్యేకంగా టెంపుల్ టూరిజానికి ఊతమిచ్చే జోగులాంబ గద్వాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ఇంచుమించు ఆయా జిల్లాల మొత్తానికి వర్తిస్తుంది. అలాగే మిగతావాటిలో సైతం ఏరియాల వారీగా ఫార్మా, ఆటోమోబైల్, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయా లనే ప్రణాళికలు సైతం ప్రభుత్వం వద్ద ఉన్నాయని సాక్షాత్తు సీఎం సహా ఇతర ఉన్నతాధికారులు చెప్పారు. అందుకనుగుణంగా పెట్టుబడుల ఆకర్షణలో సైతం ఈ అపార అవకాశాలను విదేశీ పెట్టుబడిదారులకు సైతం గత పర్యటనల్లో వివరించిన వార్తల్ని మనం చూసాం.

ప్యూచరిస్టిక్ స్టేట్‌గా తెలంగాణ..!

కనెక్టివిటీ అనేదే అభివృద్దికి అత్యంత కీలకమైన వనరు. ఈ పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా వాటి పరిధిలోని గ్రామాల్లో రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రతి గ్రామానికి ఖచ్చితంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఉన్న రోడ్లను విస్తరించడం జరుగుతుంది. తద్వారా గ్రామసీమలు వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఇప్పటికే ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)తో ఈ రోడ్లు అనుసంధానమౌతాయి. అప్పుడు తెలంగాణలోని ఈ మూల నుండి ఆ మూలకు కేవలం రెండున్నర, మూడు గంటల వ్యవధిలో సైతం రవాణా సాధ్యపడుతుంది. వీటితో పాటు మురుగు నీటి నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్ పటిష్టమౌతుంది. ప్రతీ గ్రామం దేశంతో అనుసందానమయ్యేలా ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఆయా ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసే ప్రత్యేక సెజ్‌లతో ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందుతాయి. ఇలా ప్రతి ప్రాంతం దేనికదే ప్రత్యేకతను సంతరించుకొని జియో ట్యాగింగ్ గుర్తింపును పొందుతాయి. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రతీ రాష్ట్రంకు గల ప్రత్యేక గుర్తింపు లాంటిది, మన ముఖ్యమంత్రి నినదిస్తున్న ఫ్యూచరిస్టిక్ స్టేట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న మన యావత్ తెలంగాణకే ప్రత్యేక గర్వకారణమిది.

పన్నులు పెరుగుతాయనేది అసత్యం!

కొంతమందిలో పట్టణాభివృద్ది సంస్థలున్నచోట పన్నులు పెరుగుతాయి, కాలుష్యం పెరుగుతుందనే అనే అపోహలు ఉన్నాయి. అవన్నీ అసత్యాలే..! ఎందుకంటే ఈ అథారిటీలు సొంత వనరులతో పాటు ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక అభివృద్ది గ్రాంట్లను పొందుతాయి. వీటివల్ల పైన చెప్పినట్టుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఉదాహరణకు కేంద్రం నుండి ఇండ్ల నిర్మాణానికి అందే గ్రాంటునే పరిశీలిస్తే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 72వేలు ఇస్తుంటే, పట్టణ ప్రాంతాల్లో దాదాపు లక్షా యాభైవేలు అందిస్తున్నారు. ఆరోగ్య రంగంలో సేవలు అందించే ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అంగన్వాడీలు, ఇతర విద్యాలయాలు ఇతర రంగాల్లోనూ ఇంచుమించు పట్టణ ప్రాంతాలకు ఇలాంటి అధిక ప్రోత్సాహకాలే అందుతున్నాయి. తద్వారా నిధులు పెరిగి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందివస్తాయి. అంతిమంగా ప్రపంచంతో పోటీ పడే తత్వం, అవకాశాలు తెలంగాణ యువతకు దొరికి నవతెలంగాణ ఆవిర్భావానికి ఈ యూడీఏలు నాంది పలుకబోతున్నాయి. ఈ దిశగా ఆలోచన చేసిన ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.

అందుకే సర్కారుకు ప్రజల జేజేలు..

కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే సమగ్ర విధానాలతో ఎంతో ముందు చూపుతో యావత్ తెలంగాణనే గ్రోత్ కారిడార్‌‌గా మలిచే ఈ మహా యజ్ఞం మరో నాలుగేళ్లలో దిగ్విజయం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడిచిన ఒక సంవత్సర పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజాభిమానం, ప్రజా ఆమోదం పొందాయి. దూరదృష్టి, సంకల్పబలం ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్‌కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ పునాదులే నేడు జరుపుకుంటున్న ప్రజా విజయోత్సవాలను మరో పదేళ్లు సుస్థిరం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

-పున్నా కైలాస్ నేత

టీపీసీసీ, జనరల్ సెక్రటరీ

94921 87210

Advertisement

Next Story

Most Viewed