నిజం చెప్పడం నేరం అయిపోతోంది!

by Ravi |   ( Updated:2023-06-16 00:16:28.0  )
నిజం చెప్పడం నేరం అయిపోతోంది!
X

నిజం చెప్పడం, నిజం రాయడం, నిజం చూపించడం తప్పు అయిపోయింది ఈ రోజుల్లో! నిజం మాట్లాడితే కూడా పక్కా తప్పు అని ముద్ర వేస్తున్నారు. ప్రశ్నించే వారే ఉండకూడదు అనే ధోరణితో ప్రభుత్వం ఉంది. అధినేతలు ఉన్నారు! ప్రభుత్వంను ప్రశ్నించే జర్నలిస్ట్‌లకు, యాజమాన్యంలకు దేశంలో తొమ్మిది ఏండ్ల నుంచి కష్టాలే, కష్టాలు వచ్చి పడుతున్నాయి. బీబీసీ మొదలు చాలా సంస్థల కార్యాలయాల మీద ఐటీ దాడులు జరిగాయి! కార్పొరేట్‌లు జాతీయ మీడియాను 85 శాతం కబ్జా చేసేసారు. ఎన్డీటీవీని గౌతమ్ అదానీ టేక్ ఓవర్ చేసేసారు. దేశంలో నాలుగు లక్షల కోట్ల మీడియా ఇండస్ట్రీ ఉండగా, మొత్తం డబ్బు, అధికారంకు 95 శాతం జీ హుజూర్ అనే పరిస్థితికి వచ్చింది.

రిపోర్టర్ల పరిస్థితి, యాజమాన్యం తీరు!

ఒక మంత్రిని ఊరికి రోడ్డు వేయిస్తానన్న హామీని మీరు చేయడానికి ఇంకెంతకాలం పడుతుంది? అని ప్రశ్నించిన రిపోర్టర్‌ను అరెస్టు చేయిస్తారు. మహిళా కుస్తీ బిడ్డల ఆందోళన గురించి ఒక మాట చెప్పండని మహిళా కేంద్ర మంత్రిని ఒక మహిళా విలేకరి అడిగితే ఆమె పరుగు పరుగున కార్ ఎక్కి వెళ్లిపోతుంది. అమేథి పార్లమెంట్ పరిధిలోని జగదీష్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఒక విలేఖరి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అడిగితే, అసందర్భంగా, నీవు ఇలా అడిగి నా నియోజకవర్గం ప్రజలను అవమానిస్తున్నావు, నీవు దైనిక్ భాస్కర్ రిపోర్టర్ వి కదా, మీ మేనేజ్మెంట్‌తో మాట్లాడుతానని అని హెచ్చరించి వెళ్లిపోయిన కొద్ది సేపటికి ఆ దైనిక్ భాస్కర్ స్ట్రింగర్, కెమెరా‌మాన్‌ల ఉద్యోగం ఊడుతుంది. విపిన్ యాదవ్ రిపోర్టర్‌గా, రషీద్ హుసైన్ కెమెరా‌మెన్‌గా ఇటీవల మార్చ్‌లోనే జాయిన్ కాగా, దైనిక్ భాస్కర్ లాంటి పెద్ద పేపర్ వాళ్ళు వారికి మా పేపర్‌తో సంబంధమే లేదని ప్రకటిస్తారు, ఇదీ రిపోర్టర్ల పరిస్థితి, యాజమాన్యంల తీరు!

తాజాగా ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సి ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2021లో 13 నెలలు ఢిల్లీ బోర్డర్‌లో నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న సమయంలో వారి వార్తలను ఇవ్వవద్దని బ్లాక్ చేయాలని, భారత్ ప్రజాస్వామ్య దేశమని, మీ కార్యాలయాల మీద ఐటీ దాడులు చేయిస్తామని తనని నేరుగా కేంద్రం బెదిరింపులకు లోను చేసిందన్నారు. ఆ సందర్భంలో తమ మీద ఎలా ఒత్తిళ్ళు వచ్చాయో చెప్పారు. ఇప్పుడు ఈ జాక్ డోర్సిన్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాండిల్‌ను ఆరు నెలలు బ్లాక్ చేసిన విషయం విధితమే. దేశంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తొమ్మిది ఏండ్లలో పీఎం నరేంద్ర మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఒకసారి ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దోస్తానా కొనసాగలా? వద్దా? అంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.

ఆ జర్నలిస్టులు ఇప్పుడు టార్గెట్!

2014 నుంచి దేశంలోని మీడియాను తన అరచేతిలో పెట్టుకోవాలని, తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని పీఎం మోడీ అనుకొని, అందులో ఆయన 80 శాతం సక్సెస్ కూడా అయ్యారు. అందుకు ప్రభుత్వం, కార్పొరేట్‌లు పత్రికా యాజమాన్యాలకు కోట్ల రూపాయలలో ఇచ్చే యాడ్స్ పెంచారు. తమకు వ్యతిరేకం రాసినా, చూయించినా, యాడ్స్ బంద్ చేస్తూ, ఐటీ దాడులు చేస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాను అద్భుతమైన ప్రభుత్వ అనుకూల, స్క్రిప్ట్, అండ్ మేనేజ్డ్ మీడియాగా కేంద్రం చేసుకోవడం జరిగింది. బాధ్యతగా ప్రశ్నలు అడిగే వారిని దేశ ద్రోహులు అంటూ జైల్లో పెట్టేస్తున్నారు. బాధ్యతగా జవాబు ఇచ్చే మంత్రుల కొరత ఉంది. బ్రిజ్ భూషణ్ లాంటి ఎంపీలు, అజయ్ మిశ్రా తేని లాంటి క్రిమినల్ రికార్డులు ఉన్న వారే బీజేపీలో ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. ఆసారామ్, రాం రహీమ్ లాంటి రేప్, మర్డర్ కేసులలో ఉన్న దొంగ బాబాల రూపంలో ఉన్న దిరేంద్ర శాస్త్రి ఒకడు. ఇప్పుడు ఆయన బీజేపీ నేతల వెంట తిరుగుతున్నాడు. ఇతను ఇటీవల రాముడికి ఐదుగురు తండ్రులు అని వ్యాఖ్యానించాడు, ఆ వ్యాఖ్యలను శంకరాచార్య లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. ఇటీవలే జరిగిన కోరమాండల్ రైలు ప్రమాదంలో 280 మందికి పైగా చనిపోతే, ఆ ప్రమాదం నాకు మందే తెలుసని విచిత్ర ప్రకటనలు చేశాడు. అయిన ఆ వ్యాఖ్యలపై చర్యలుండవు. హిందూ, ముస్లింలు అంటూ వివాదాస్పద స్టేట్మెంట్‌లు ఇస్తూ, విద్వేషాలు సృష్టిస్తాడు! ఇలాంటి వారిని కూడా మీడియా ఏమీ అనదు, అనవద్దు. కొన్ని యూట్యూబ్‌లలో నిజం వెల్లడి చేస్తున్న రవిష్ కుమార్, పుణ్యప్రసూన్, అభిసార్ శర్మ, అజిత్ అంజుమ్, ఆర్ఫా ఖానం, ప్రగ్యా, సాక్షి లాంటి వారు ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్రానికి టార్గెట్‌గా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లోని జర్నలిస్ట్‌ల పరిస్థితి అంతే. జర్నలిజం అంటే అధికార పక్షంకు చేసే ఊడిగం కాదు. అది కత్తి మీద సాములాంటిది. నిజం చెప్పే, నిజం వెంట ఉండే యుద్ధం లాంటిది. సమాజ హితంలో పనిచేసే కలం, ఒక కలం కారుల కార్ఖానా! నేల మీది నిజాన్ని( గ్రౌండ్ రియాలిటీ )చెప్పేది. విద్యుత్తు‌లా ఊహించే, ఊహా తరంగాలు, నిబద్దత గల పాత్రికేయుల ముందు బక్కెద్దులను ఆపే పాలకుల పగ్గాలు ఏమీ పనిచేస్తాయి! పాత్రికేయులు కూడా రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కుల కోసం పోరాడే వారి వెన్నుదన్నుగా ఉంటున్న నిత్య ఉద్యమ కారులేనన్న అనే విషయం గుర్తిస్తే మంచిది.

ఎండి.మునీర్

సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు

9951865223

Advertisement

Next Story