పర్యాటకం అభివృద్ధికి కలెక్టర్ తీవ్ర కృషి

by Sridhar Babu |
పర్యాటకం అభివృద్ధికి కలెక్టర్ తీవ్ర కృషి
X

దిశ, భద్రాచలం : జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తీవ్ర కృషి చేస్తున్నారు. గోదావరి తీరంలో పర్యాటకులకు ఆహ్లాదం పంచడానికి హట్స్ నిర్మించి, గిరిజన వంటలు రుచి చూపించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ భద్రాచలంలోని గోదావరి తీరంను పరిశీలించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి, జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి గిరిజనుల ఆచార వ్యవహారాలు దేవస్థానంకు వచ్చే భక్తులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 10, 11 తేదీలలో జరుగు ముక్కోటి ఏకాదశి తెప్పోత్సవం ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులు అధికంగా వస్తుంటారని, భక్తులు గోదావరిలో విహారయాత్ర చేసే విధంగా తెప్పలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి తక్కువ ధరలో భక్తులు విహరించేలా చూడాలని ఇరిగేషన్ ఏఈ వెంకటేష్ ను ఆదేశించారు.

అలాగే భక్తులు రాత్రిపూట బస చేయడానికి ఏర్పాటు చేసే హట్ చూపరులకు అందంగా ఉండేలా తయారు చేయాలని ఐకేసీ సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా తొమ్మిదవ తేదీ నుండి టూరిస్టులకు అందుబాటులో ఉండాలన్నారు. భక్తులు ఐటీడీఏలోని మ్యూజియంను సందర్శించి రాత్రి క్యాంపింగ్ లో బస చేస్తారని, పదో తేదీ నాడు కిన్నెరసాని బొజ్జగుప్ప గ్రామంలోని దర్శనీయ స్థలాలు చూసిన తర్వాత 11వ తేదీన బెండలపాడులోని వెదురు కర్రలతో తయారు చేసిన సామానులు అక్కడున్న పరిసరాలు చూసి టూరిస్టులు వారి స్వగ్రామాలకు వెళ్లిపోయేలా చూడాలని అన్నారు. కరకట్ట దగ్గర ఏర్పాటు చేసే స్టాల్స్ లో గిరిజన వంటకాలు, తృణధాన్యాలకు సంబంధించిన ఆహార పదార్థాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్ రావు, దేవస్థానం ఈఓ రమాదేవి, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వరరావు, ఏసీఎంఓ రమణయ్య, మ్యూజియం ఇన్​చార్జ్ వీరాస్వామి, ఐకేపీ ఏపీఎం జగదీష్, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed