Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ కు పెరిగిన పర్యాటకులు.. వారంలోనే 30 వేల మంది సందర్శన

by Shamantha N |
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ కు పెరిగిన పర్యాటకులు.. వారంలోనే 30 వేల మంది సందర్శన
X

దిశ, నేషనల్ బ్యూరో: హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) పర్యాటకులతో కళకళలాడుతోంది. న్యూఇయర్ సందర్భంగా పర్యాటక ప్రాంతాలను చూసేందుకు జనాలు పోటెత్తారు. గత వారం రోజుల్లో 30 వేల మందికి పైగా ప్రజలు మనాలిని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా 10 వేల వాహనాలు పట్టణంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. న్యూఇయర్‌ వేడుకల కోసం సుమారుగా 20 వేల మందికిపైగా పర్యాటకులు హిల్ స్టేషన్‌ను సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, హిమాచల్‌లో భారీగా మంచు పడుతోంది. శుక్రవారం లాహౌల్‌ – స్పితి, మనాలి (Manali) ఎగువ ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది. సోలాంగ్‌ వ్యాలీ, రోహ్‌తంగ్‌పాస్‌, అటల్‌ టన్నెల్‌ ప్రాంతాలు మంచుతో పర్యాటకుల ఆహ్వానిస్తున్నాయి. సిమ్లా, మనాలి, కసోల్‌ తదితర ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి.

భారీగా ట్రాఫిక్ జాం

మరోవైపు, భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. శుక్రవారం సాయంత్రం మనాలి – సోలాంగ్‌ నాలా రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. సోలాంగ్‌ వ్యాలీలో భారీగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనరాకపోతలకు తీవ్ర ఇబ్బందలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా సుమారు 1,000 వాహనాలు అక్కడ చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులను కులు పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, హిమాచల్ లోని అనేక ప్రాంతాల్లో 10-15 కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జాం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, మనాలిలో రాబోయే 48 గంటల్లో తేలికపాటి నుంచి భారీ మంచు కురిసే అవకాశం ఉంది. దీంతో, ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed