పార్కు స్థలంలో ఇంటికి పర్మిషన్‌!

by Kalyani |
పార్కు స్థలంలో ఇంటికి పర్మిషన్‌!
X

దిశ, వరంగల్‌ టౌన్ : ఆక్రమణలకు వరంగల్‌ మహానగర పాలక సంస్థ అధికారులు వంతపాడుతున్నారని ఆరోపణలు అనేకం ఉన్నాయి. ప్రతీ గ్రీవెన్స్‌సెల్‌లో ఆక్రమిత స్థలాల్లో కట్టడాలను నిలిపివేయించాలని దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తన్నుకు చచ్చేది మీమా అనే ఆలోచనలతో అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ ప్రజల మధ్య భూతగాదాలకు తెగబడుతున్నారు. వరంగల్‌ నగరంలో కొత్తవాడ ఏరియాలో ఓ పార్కు స్థలాన్ని కబ్జా చేసి, నిర్మాణానికి దిగుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓ రియల్టర్‌ ఇక్కడ కొంత స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయించాడు. ఆ సమయంలో సుమారు 10 గుంటల స్థలాన్ని (ఎల్‌పీ నంబర్‌ 89/81) పార్కు స్థలంగా పేర్కొన్నాడు. రెవెన్యూ రికార్డుల్లో సైతం అది ఓపెన్‌ ల్యాండ్‌గానే నమోదైంది.

అంతేకాదు, బల్దియా ఆ స్థలంలో పార్క్‌ కోసం ఏర్పాట్లు కూడా చేసింది. ఇదిలా ఉండగా, కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి ఆ స్థలం తనదంటూ దిగబడ్డాడు. ఏకంగా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. స్థానికులు అడ్డుకోవడంతో వెనకడుగు వేసి.. కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సైతం ఆ స్థలం పార్కు స్థలంగా భావిస్తూ తీర్పు వెలువరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, మళ్లీ ఇటీవల ఆ స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధపడుతుండడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆ స్థలం పార్కుకు చెందినదని పేర్కొంటున్నారు. అన్ని ఆధారాలు చూపిస్తున్నారు. అయితే, తమకు ప్లాట్లు అమ్మిన వ్యక్తే ఆ స్థలం మరొకరికి విక్రయించి ఉంటాడని అనుమానిస్తున్నారు.

మామూళ్లకు కక్కుర్తి పడి బల్దియా అధికారులు ఆ స్థలంలో నిర్మాణానికి పర్మిషన్‌ ఇచ్చి ఉంటారని ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఆ స్థలంపై విచారణ చేపట్టకుండానే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ ఆఫీసులో పలుమార్లు ఫిర్యాదు చేశామని అయినా, అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు చేసిన తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికే చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. ప్రజోపయోగమైన స్థలాన్ని కబ్జా కోరల నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed